మా ఆవిడ పాత పేపర్లు

9 Oct, 2017 04:49 IST|Sakshi

సమ్‌సారం సంసారంలో సినిమా

ఆ పాత పేపర్లవాడికి ఉస్మాన్‌ పేట్‌ బస్తీలో చిన్న రేకుల ఇల్లు ఉంది. దానిని రాసివ్వమని కూచునింది మా ఆవిడ. వాడు లబోదిబోమంటున్నాడు. ‘మరెంతిస్తావో చెప్పు’ అంటోందావిడ. ‘నూటాబై ఇస్తాను. ఇక మీ మాట నా మాట కాకుండా నూట డెబ్బై ఇస్తాను’ అంటున్నాడతను. ‘నూట డెబ్బై. ఏ మూలకు? మీ పాత పేపర్ల వాళ్ల సంగతి నాకు తెలియదా? పేపర్లలో పెద్దపెద్ద అక్షరాల్లో వేశార్లే. మీరు పాత పేపర్లే అమ్మి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారట కదా. అప్పుడప్పుడు గోవా, బ్యాంకాక్‌ కూడా వెళ్లొస్తుంటారట గదా షికారుకి’ ‘ఏంటమ్మా ఈ అన్యాయం’ అంటున్నాడు పాత పేపర్లవాడు. ఇంటికి రెండు తెలుగు పేపర్లు, ఒక ఇంగ్లిష్‌ పేపరు వస్తాయన్న మాట నిజం. అవి నెలా రెండు నెలలు తిరిగే సరికల్లా ఇంతెత్తున అవుతాయన్నది కూడా నిజం. తూకం వేసినా టోకున కొన్నా అవి గట్టిగా 200 రూపాయల బరువు కూడా రావన్నది నిజన్నిజం. కాని మా ఆవిడ మాత్రం నమ్మదు. అదేదో బిగ్‌ బజార్‌ యాడ్‌లో కిలో పది రూపాయలకు కొంటాం అని చూసినప్పటి నుంచి పాత పేపర్లు అమ్మి ఒక పది గ్రాములు బంగారు గొలుసన్నా కొనుక్కోవాలని పంతం పట్టి ఉంది. ‘ఇంతకూ ఏమంటావయ్యా. సరే. మూడొందలు ఇవ్వు’ అంది.

ఇక వాడి సహనం వెంటిలేటర్‌ను పీకేసుకుంది. మాట మాట్లాడకుండా టప్పున తక్కెడ, గోతాం పట్టా తీసుకొని మెట్లు దిగి పోబోయాడు. ‘సరే సరే... ఏం చేస్తాం. ఇలా వాళ్లను వీళ్లను పోషించడమే సరిపోయింది. ఎంతిస్తావో ఇచ్చి తీసుకెళ్లు. ఈసారికి కాబట్టి ఇస్తున్నాను వచ్చేసారి మాత్రం మూడొందలు పైసా తక్కువైనా ఇవ్వను’ అని వాడిచ్చిన ఒక వంద నోటు నలిగిన యాభై, ఇరవై నోట్లు తీసుకుంటూ లోపలికి వచ్చింది మా ఆవిడ. ‘ఇలా కదా వెలగపండు కాస్తా ఇంట్లో నువ్వు గింజంత అవుతున్నది. అరె.. ఇంట్లో మగ మనిషి ఉన్నాడే ఏం లాభం. లేచి ఆ పేపరువాణ్ణి నాలుగు అదిలించి నాలుగు డబ్బులు లాగాలని చూడకుండా కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తుంటే ఇక ఈ సంసారం అయినట్టే. నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు. ఇన్నాళ్లు లాక్కొచ్చాను. ఏదో రోజు విసుగొచ్చి చిలుకూరి బాలాజీ టెంపుల్‌ వాళ్ల ఆశ్రమంలో చేరిపోతాను’
ఉరుమురిమి సీలింగ్‌ మీద పడినట్టు అర్థమైంది.

‘చిలుకూరి బాలాజీ టెంపుల్‌ వాళ్లకు ఆశ్రమం ఉందా? అది కనుక్కో ముందు’ ‘కనుక్కుంటాను. చిలుకూరులో లేకపోతే హరిద్వార్‌కు వెళ్లి రామ్‌దేవ్‌ బాబా ఆశ్రమంలో చేరుతాను. టికెట్టు డబ్బులు లేవనుకుంటున్నారేమో. పాత పేపర్లు అమ్మినవన్నీ ఒక డబ్బాలో వేసి పెడుతున్నానులెండి’ ‘ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక ఆరాటంలో ఉంటావ్‌. డబ్బే అన్నింటికీ పరిష్కారం కాదు గుర్తుపెట్టుకో’ అన్నాను గంభీరంగా. ‘ఆహా. అలాగా. మరి కట్నం డబ్బులు పదివేలు తగ్గాయని, ఉంగరానికి వేసిన బంగారం నాసిరకందని, వాచీ సీకోది కొనిపెట్టమంటే హెచ్‌ఎంటిది కొనిపెట్టారనీ ఆడపడుచు లాంఛనం ఇంతివ్వాల్సింది అంతిచ్చారని పెళ్లిలో నన్నూ మా నాన్నను ఎందుకు పీక్కు తిన్నారు? బుద్ధ పరమాత్ముడికి మల్లే మెల్లగా నవ్వుతూ రూపాయి అడక్కుండా తాళి కట్టకపోయారా?’ ‘అదంటే... అది వేరు’ ‘ఇదంటే ఇది వేరా? హూ. మా నాన్న రోజుకి శేరు బియ్యం అన్నం తిని మాటవరసకైనా తేన్చకుండా దిలాసాగా బజారుకెళ్లేవాడు. అలాంటి మనిషి మీ దెబ్బకు చిక్కి చీపురుపుల్ల \ అయిపోయాడు కదండీ’ ‘ఆయనకు షుగరొస్తే నా మీదకు తోస్తున్నావ్‌’ ‘తోస్తున్నాను. తోసి తోసే సంసారాన్ని జాగ్రత్తగా లాక్కు వస్తున్నాను. పెళ్లప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతిదానికీ దుబారే. శోభనం రోజు తెల్లారి టీ పట్టుకు వచ్చే లోపల ఏం కొంపలంటుకుపోయాయని మీరు బజారుకు వెళ్లి కాఫీ హోటల్‌లో కాఫీ తాగొచ్చారు. రెండు రూపాయలు వృథా. అప్పుడే అనుకున్నాను మీరుత్త వృథా చేసే మనిషని’ ‘మీ వంటింట్లో జెమిని టీ పౌడర్‌ చూశాను. అదంటే నాకు పడదు.

నా బ్రాండ్‌ త్రీ రోజెస్‌. అందుకే బజారుకెళ్లాను. తాగింది కాఫీ కాదు. టీయే’ ‘టీయో కిరసనాయిలో. కాపురం పెట్టాక పనులు నేనే చేసుకుంటానంటే పని మనిషిని పెట్టేదాకా ఊరుకున్నారా? అదేమంటే నా మీద ప్రేమ. ఎందుకండీ ప్రేమ... అన్నం పెడుతుంటా ఐస్‌క్రీమ్‌ తెచ్చిస్తుందా? అంట్లు కడిగి బట్టలుతికి ఇల్లు ఊడ్చి బాత్‌రూమ్‌లు కడిగి వారానికోసారి దుప్పట్లు మార్చి నెలకు రెండుసార్లు బూజులు దులిపితే చేతికి ఎముక లేకుండా మూడొందల యాభై ఇద్దామని నేనంటే ఐదొందలు ఇచ్చేదాకా ఊరుకున్నారా? ఎలాగండీ ఇలాగైతే. విజయ్‌ మాల్యా కూడా ఇలా ఉండడు తెలుసా?’
దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ‘బాధ పడకు అర్ధాంగీ. నేనేం చేసినా నీ సుఖం కోసం నీ సంతోషం కోసం నీ అనురాగ వాత్సల్య అనుషంగిక’... ఆ తర్వాత భాష రాక ఊరుకున్నాను.
‘నా సంతోషం. ఏమిటండీ సంతోషం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఏటిఎం కార్డు నా చేతికిచ్చి చోద్యం చూస్తున్నారు. ప్రతి పైసా నేను చూసి చూసి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎంత ఖర్చవుతుందో ఎంత మిగులుతుందో ఆ తలనొప్పి నాదే అయ్యింది. అరె.. మగవాళ్లు ఇలా బయటికెళ్తారు అలా లక్షలు తెస్తారు... ఇలా బైటికెళ్తారు అలా కోట్లు కుమ్మరిస్తారు. మీరూ ఉన్నారు. ఉత్త జీతం డబ్బు కాకుండా’...
లేచి చెప్పులు తొడుక్కున్నాను.

‘ఎక్కడికెళ్తున్నారు?’ ‘బైటికెళ్లొస్తాను. ఒక లక్ష రూపాయలు దొరుకుతాయేమో చూసొస్తాను’ ‘చాల్లెండి జోకులు.’ ‘మరి కుండలో అన్నం కుండలోనే ఉండాలి పిల్లలేమో బాహుబలిలాగా కండలు పెంచాలి అంటే కుదురుతుందా? మనం హాయిగా బతికేంత జీతం వస్తున్నది కదా. నీకేం కావాలో డ్రా చేసుకుని ఖర్చు పెట్టుకో. నువ్వూ నీ పిసినారి బుద్ధులూనూ’
‘హూ. నేను పిసినారిని కాబట్టే పిల్లలను అంత మంచి స్కూల్లో చదివిస్తున్నారు. నేను పిసినారిని కాబట్టే మీరు కొత్త బండిలో ఆఫీసుకు వెళుతున్నారు. నేను పిసినారిని కాబట్టే మొన్న ఐమాక్స్‌ చికెన్‌ ఫ్రాంకీ నములుతూ హాయిగా సినిమా చూడగలిగారు. నేను పొదుపు చేయకపోతే ఇదంతా అవుతుందా. మీలాగా నేనూ ఉండుంటే ఈసరికి బతుకు అమరావతి రాజధానిలా అట్టర్‌ కన్ఫ్యూజన్‌లో ఉండుండేది’
‘సరే. ఆపు. నీకో సంగతి చెప్పాలి. ఆఫీసులో ఓటీ చేస్తే రెండు వేలొచ్చాయి. చీర కొందామని ప్లాన్‌. ఏమంటావు’ ‘రెండు వేలొచ్చాయా?’ ‘ఉత్త పుణ్యానికే వచ్చాయి’‘ఎంతనుకున్నా నా మొగుడులాంటి మొగుడు లేడనేదే వాస్తవం. ఏ నోము ఫలితమో ఏ వ్రతం మహత్యమో మా నాన్న మంచితనమో లేదంటే నా అదృష్టమో ఇలాంటి మొగుడు దొరికాడు. ఉండండి. నూనె తక్కువేసి చిటికెలో ఉప్మా చేస్తాను. తినేసి చెన్నై సిల్క్స్‌కు వెళదాం’... చెంగు చెంగున ఎగురుతూ వంటింట్లోకి వెళ్లింది. పక్క సీటు ఉళగనాథంకు మళ్లీ రెండు వేలు బాకీ అని నిట్టూరుస్తూ లేచి నిలబడ్డాను.


సినిమాలో సంసారం పేపర్‌ చీర గురించి ఆలోచిస్తున్నా...
లక్ష్మీపతి(కోట శ్రీనివాసరావు) పరమ పిసినారి. ఆయన పిసినారి తనం నాలుగు జిల్లాలకు ఎరుకైంది. లక్ష్మీపతి కూతురు పద్మ(రజని), కోటీశ్వరుడి కొడుకైన కృష్ణమూర్తి(రాజేంద్రప్రసాద్‌) ప్రేమించుకుంటారు. లక్ష్మీపతిని మెప్పించి, పద్మని పెళ్లి చేసుకునేందుకు ఆయనకంటే పిసినారిగా నటిస్తుంటాడు కృష్ణమూర్తి. ఓ సందర్భంలో ‘ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి బట్టలు కట్టుకోవాలా చెప్పండి. రాత్రిళ్లు న్యూస్‌పేపర్‌ని లుంగీలా చుట్టుకుని పడుకుంటానంతే’ అని లక్ష్మీపతికి చెబుతాడు. దీంతో లక్ష్మీపతి కూడా న్యూస్‌పేపర్‌ని లుంగీలా కట్టుకుంటాడు. ‘హవ్వ. ఏవండీ.. ఏమిటీ పిచ్చిపని. మీకు మతి పోతోందా?’ అని కోప్పడుతుంది భార్య. ‘నువ్వు నోర్ముయ్‌.. లుంగీలు కట్టడం తడపడం ఆరేయడం నీళ్ల ఖర్చు.. సబ్బు ఖర్చు డబ్బు ఖర్చు. ఈ పేపర్‌ లుంగీ ఓ అద్భుతమైన ఆలోచన. అస్సలు పేపర్‌ చీర ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’ అంటాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిదీ సీన్‌. సినిమా కాబట్టి పిసినారి తనాన్ని ఇంత పరాకాష్టగా చిత్రీకరించారు. కానీ, నిజ జీవితంలోనూ పాత పేపర్‌కు కక్కుర్తి పడే జనం ఉంటారు.

ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.
సాక్షి పాఠకులతో పంచుకోండి.  ఈ మెయిల్‌:  samsaaram2017@gmail.com
- నిష్ఠల

మరిన్ని వార్తలు