చెంగనూరు చుట్టు ఆలయాల మెట్లు

29 Dec, 2019 00:59 IST|Sakshi

మండలదీక్షను ఆచరించిన భక్తకోటి భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టుకొని శబరి కొండకు ప్రయాణం అయే సమయం ఇది. దాదాపు నాలుగు కోట్ల మంది యాత్రికులు శబరిమలై యాత్ర చేస్తారని అంచనా. వీరిలో దాదాపు 75 శాతం మంది రైలు మార్గంలో శబరిమలై వెళుతుంటారు. అక్కడ పూజాదికాలు ముగించుకొని, తిరిగి చెంగనూరునుంచి వెనక్కి మళ్లుతారు.

చెంగనూరును ఒక రైల్వే స్టేషన్‌గానే చూస్తుంటారు తప్పితే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉండే అరుదైన పుణ్యక్షేత్రాల గురించి తెలియకపోవడం వల్ల చెంగనూరు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలు కోసం వేచి చూస్తూ కాలం గడుపుతుంటారు. చెంగనూరు రైల్వే స్టేషన్‌కు చాలా సమీపంలో కొలువై ఉన్న ఈ క్షేత్రాల గురించి తెలియనివారు ఇకనైనా దర్శించుకుని తరించగలరనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసం.

చెంగన్‌ అంటే ఎర్రటి నేల. ఈ విధమైన నేల కలిగిన ప్రాంతం కాబట్టి చెంగనూరు అనే పేరు ఏర్పడింది.  ఇక్కడ కొలువైన పుణ్యక్షేత్రమే మహాదేవ ఆలయం లేదా భగవతి అమ్మగుడి. ఈ గుడిలో ముందు వైపున శివలింగం ఉంటే, వెనుకవైపున అమ్మవారి విగ్రహం ఉండటం ఆలయ ప్రత్యేకత. విశేషమేమిటంటే, ఇక్కడ 3, 4 నెలలకు ఒకసారి అమ్మవారి వస్త్రానికి రక్తపుమరకలు కనిపిస్తాయట. దీనిని త్రిప్పుట్టు అంటారు. ఆ సమయంలో మూడు రోజులపాటు దర్శనాలు నిలిపివేసి  ఆలయాన్ని శుద్ధి చేశాక, దర్శనాలకు అనుమతిస్తారు.

దేవాలయంలో ఈ సమయాన్ని ఆధారంగా చేసుకొని, ఏడాదికి మూడుసార్లు త్రిపుట్టు ఆరట్టు పేరుతో ఏనుగుల మీద ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకెళ్లి పంబానదిలో స్నానం చేయిస్తారు. మహిళలంతా దీపజ్యోతులు వెలిగించి ఊరేగింపుగా ఇందులో పాల్గొంటారు. ఈ సమయంలో పంచవాద్య మేళతాళాలతో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం చెంగనూరు పట్టణం నడిబొడ్డున రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లకు కేవలం  కిలోమీటర్‌ దూరంలో
ఉంటుంది.

పంచ పాండవులు నిర్మించిన ఆలయాలు
మహాభారత కాలంలో పంచపాండవులు చివరిసమయంలో పరీక్షిత్తుకి రాజ్యాన్ని అప్పగిస్తారు. తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కేరళకు వస్తారు. ఇక్కడ ప్రకృతిని చూసి ముచ్చటపడి, పాండవులు వేర్వేరుగా అయిదు శ్రీకృష్ణదేవాలయాల్ని నిర్మించుకున్నారట. ఈ ఆలయాలన్నీ చెంగనూరు పట్టణం చుట్టూ నెలకొని ఉంటాయి. ధర్మరాజు ప్రతిష్టించిన తిరిచిట్టాట్‌ మహావిష్ణు దేవాలయం, భీమసేనుడు ప్రతిష్టించిన పులియూర్‌ మహావిష్ణు దేవాలయం, అర్జునుడు నెలకొల్పిన అరణ్ముల పార్థసారథి దేవాలయాలు పూర్తిగా చెంగనూర్‌కు ఆనుకొని ఉంటాయి.

ఇక నకులుడు ప్రతిష్టించిన తిరువాన్‌ వండూర్‌ మహావిష్ణు దేవాలయం, సహదేవుడు ప్రతిష్టించిన తిరుకొడితనమ్‌ మహావిష్ణు దేవాలయాలు మాత్రం కొద్దిపాటి దూరంలో ఉన్నాయి. చెంగనూరు రైల్వేస్టేషన్‌ లేదా బస్‌ స్టేషన్‌ నుంచి ఒక ఆటో లేదా కారు మాట్లాడుకొని ఒక్క రోజులో ఈ అయిదు గుడులు దర్శించి రావచ్చు. నమ్మాళ్వార్‌ దివ్యదేశం గ్రంథంలో ప్రస్తావించిన 108 వైష్ణవదేవాలయాల్లోనూ ఈ అయిదింటి గురించిన వివరణ ఉన్నది. ట్రావన్‌కోర్‌ దేవస్థానమే ఈ గుడులను కూడా నిర్వహిస్తున్నది.

తిరిచిట్టాట్‌ మహా విష్ణు దేవాలయం
ఈ ఆలయం పూర్తిగా చెంగనూర్‌ పట్టణం మధ్యలోనే నెలకొని ఉన్నది. దీనిని ధర్మరాజు ప్రతిష్టించినట్లు చెబుతారు. శ్రీకృష్ణుడితోపాటు బలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. స్వామి పుష్కరిణి దగ్గర ప్రతీ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

తిరుపులియూర్‌ మహావిష్ణు దేవాలయం
చెంగనూర్‌ పట్టణ శివారు ప్రాంతమే పులియూర్‌. హరిప్పాడ్‌ నాగక్షేత్రానికి వెళ్లే దారిలో ఇది అగుపిస్తుంది. పూర్వం ఇక్కడ సప్తరుషులు ఆసీనులై పూజలు అందుకొన్నట్లు స్థల పురాణం. అందుకే ఇక్కడ సప్తర్షుల దేవాలయాలున్నాయి.

అరన్ముల పార్థసారథి ఆలయం
పంచపాండవుల ఆలయాలలో ఇదే ముఖ్యమైన దేవాలయం. అరన్ముల అంటే ఆరు వెదురు స్తంభాలు అని అర్థం. ఆరుస్తంభాల కోవెలగా దీన్ని చెబుతారు. ప్రతి ఏటా మకరజ్యోతి సమయంలో అయ్యప్పకి అలంకరించే తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకొని వెళ్లేటప్పుడు ఈ గుడి దగ్గర ఆపి పూజలు నిర్వహిస్తారు.  ఇది అర్జునుడు నిర్మించిన ఆలయం కావటంతో ఇక్కడ విశేషంగా నాట్యార్చనలు జరుగుతుంటాయి. దాదాపు ఆరడుగుల ఎత్తున కృష్ణపరమాత్మ విశ్వరూప దర్శనం కనిపిస్తుంది. దీంతోపాటు అయ్యప్ప, నాగరాజ, బలరామ మూర్తుల కోవెలలు ఉన్నాయి. దేవాలయానికి ఉత్తరం వైపున పంబనది దర్శనం ఇస్తుంది. మలయాళ ధనుర్మాసంలో ఇక్కడ ఖాండవ వన దహనం నిర్వహిస్తారు.

తిరువాన్‌ వాండూర్‌ మహావిష్ణు దేవాలయం
ఈ ఆలయాన్ని నకులుడు నిర్మించినట్లు చెబుతారు. చెంగనూరుకు సమీపంలోనే ఈ గ్రామం ఉంది. ఇది పంబనదికి ఆనుకొని ఉండటం వలన ఇక్కడ స్వామిని పంబనిచప్పన్‌ అనీ పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే గజ మేళా చెప్పుకోదగినది.

తిరుకోడిత్తనమ్‌ మహావిష్ణుదేవాలయం
ఇక్కడ శ్రీ కృష్ణావతారంతోపాటు నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. సహదేవుడు నిర్మించిన ఆలయం ఇది. స్వామి నిల్చొన్న భంగిమలో దర్శనం ఇస్తాడు. ఆయన్ని అద్భుతనారాయణుడు అని, అమృత నారాయణుడు అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలలో కూటక్కుట్టు నాట్యం విశిష్టమైనది.

తిరువల – శ్రీ వల్లభ స్వామి ఆలయం
ఇక్కడ శ్రీ వల్లభుని ఆలయం ఉంది. దాదాపుగా సంవత్సరం పొడవునా నాట్య ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయం మూసివేసిన తర్వాత రాత్రంతా ఇక్కడ శ్రీ కృష్ణుణ్ణి స్మరిస్తూ మోహిని అట్టం, కథాకళి రీతుల్లో నాట్య ప్రదర్శన జరుగుతుంది. అర్ధరాత్రి పూట సప్తర్షులు ఇక్కడకు వచ్చి అర్చనలు నిర్వహిస్తారని స్థానికుల నమ్మకం. దుర్వాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం అని, ఆయన విష్ణుమూర్తి పాదాలు కడిగిన కొలనుగా స్థానిక పుష్కరిణిని చెబుతారు.

హరిప్పాడ్‌ సుబ్రహ్మణ్య క్షేత్రం
చెంగనూరు రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉండే మహిమాన్విత క్షేత్రమే హరిప్పాడ్‌. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. పరశురాముడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. నాలుగు చేతులు కలిగిన మురుగన్‌ విగ్రహం దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. ఇక్కడ నాగ పడగలు, నాగ ప్రతిమలు చాలా విశిష్టమైనవి. చెంగనూర్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉండే బస్‌ స్టాండ్‌ నుంచి హరిప్పాడ్‌కు నేరుగా బస్సులున్నాయి.

మావెలిక్కర భద్రకాళి దేవాలయం
చెంగనూరు దాటాక తదుపరి రైల్వేస్టేషన్‌ మావెలిక్కర. ఇక్కడ అమ్మవారి గుడి చాలా పెద్దది. మొత్తం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఆలయాల్లో శబరిమలై తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయంగా దీన్ని చెబుతారు. ఇది తాంత్రికపూజలకు నెలవైన ఆలయం. దీన్ని చెట్టికుళంగర దేవాలయం అని పిలుస్తారు.  ఇక్కడ అత్యద్భుతంగా నిర్వహించే కుంభ భరణి దీపోత్సవానికి భక్తులు విచ్చేస్తారు.  

ముక్కంటి క్షేత్రాలు
చెంగనూర్, కొట్టాయంకు సమీపంలో వైకోమ్‌ మహాదేవాలయం, ఎట్టుమాన్నూర్‌ మహాదేవాలయం, కడతుర్తి మహాదేవాలయం పేరుతో మూడు సుప్రసిద్ధ శైవక్షేతాలున్నాయి. ఈ మూడు ఆలయాలు చాలా విశాలమైన ప్రాంగణంలో కొలువుదీరి ఉంటాయి. వీటిని ఒకేరోజున దర్శించుకొనే వీలుంది. ఇక్కడ రోజూ సాయంత్రం జరిపే ఊరేగింపు అత్యంత శోభాయమానం.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా