అహనా పెళ్లంట అలనాటి స్టైలంట

29 Jun, 2018 02:04 IST|Sakshi

ఫ్యాషన్‌లో రెట్రో స్టైల్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడీ స్టైల్‌ పెళ్లిలోనూ కళకళలాడుతోంది. కట్టులో పాత కళకు పడతులు పట్టం కడుతున్నారు.  ఆభరణాల అలంకరణలోనూ పాత సొబగులకే వోటేస్తున్నారు.


అలనాటి కళ.. నేడు కళ కళ
పెళ్లి కుదరగానే ముందు పట్టు దుస్తుల మీదకు వెళతాయి ఇంట్లో వారి ఆలోచనలు. ముందుగానే కేటాయించిన బడ్జెట్‌లో కంచిపట్టు ప్రధానంగా ఉంటుంది. వీటితో పాటు బెనారస్‌ మనవైన చేనేతలు గద్వాల, నారాయణపేట, ఇక్కత్, ఉప్పాడ వంటివి ఉంటున్నాయి. వీటిలోనూ ముదురు రంగులు, పాతగా అనిపించే జరీ జిలుగులు, చెక్స్‌ వంటి డిజైన్లకే ఓటేస్తున్నారు వధువులు. వీటి రూపురేఖలు  అమ్మమ్మల కాలం నాటివేమో అనిపించేలా ఉంటున్నాయి. అమ్మ, అమ్మమ్మల స్టైల్‌ బహుబాగు అంటున్నారు.

కుట్టులోనూ ఓల్డే!
అమ్మమ్మల కాలంనాటి చీరనా అని పెదవి విరిచే అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటి డిజైన్స్‌నే అపురూపంగా ఎంచుకుంటున్నారు. వీటితో పాటు బ్లౌజ్‌ డిజైనింగ్‌లో ‘పాత కళ’నే ఇష్టపడుతున్నారు. కొన్నాళ్లు బోట్‌నెక్‌ బాగా ట్రెండ్‌లో ఉండేది. ఇప్పుడు మెడను పట్టేసినట్టుగా ఉండే క్లోజ్డ్‌ రౌండ్‌నెక్‌కి ఓటేస్తున్నారు. ఇవి దక్షిణాది కళనే కాదు ఉత్తరాది అమ్మాయిలనూ బాగా ఆకట్టుకుంటుంది.

మోచేతుల వరకు ఉండే జాకెట్టు స్లీవ్స్‌ మరో ఆకర్షణ అవుతున్నాయి. బ్లౌజ్‌కు రకరకాలుగా గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేయించుకోవడం పాత జాబితాలో చేరిపోయింది. కాంట్రాస్ట్‌ రంగులు లేదంటే చీరలోనే వచ్చే పీస్‌తో డిజైన్‌ చేసిన బ్లౌజ్‌లు ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చాయి.

ఆభరణాలూ ‘పాత’వే!
మామిడిపిందెలు, చంద్రహారాలు, కాసుల పేర్లు, మెడను పట్టి ఉంచే చోకర్స్‌ .. ఆభరణాలలోనూ పాత డిజైన్లవైపు మక్కువ చూపుతు న్నారు. దీంతో అలాంటి ఆభరణాలు  పెళ్లింట కళకళలాడుతున్నాయి.

్జ్టకొప్పు ఎవర్‌గ్రీన్‌
ఎన్ని హెయిర్‌స్టైల్స్‌ వచ్చినా ఇప్పటికీ అమ్మమ్మల కాలం నాటి కొప్పులే పెళ్లికి కరెక్ట్‌ హెయిర్‌ స్టైల్‌. కొప్పు వేసి, ఆ కొప్పు చుట్టూ పువ్వులను చుడితే వచ్చే కళ మరే హెయిర్‌స్టైల్‌కి రాదన్నది స్టైలిస్టులమాట.

– నిర్వహణ: ఎన్‌.ఆర్‌

మరిన్ని వార్తలు