111 ఏళ్ల వయసులో రోజూ వర్కవుట్లు..

14 Sep, 2018 11:15 IST|Sakshi

కాలిఫోర్నియా : అరవై దాటగానే అంతా అయిపోయిందని నిట్టూర్చే రోజుల్లో 111 ఏళ్ల వయసులోనూ ఈ తాత రోజూ వర్కవుట్లు చేస్తూ యువతకే సవాల్‌ విసురుతున్నారు. ఈ బైక్‌పై రోజూ 30 నిమిషాలు సవారీ చేసే 111 సంవత్సరాల హెన్రీ సెంగ్‌ ఇప్పటికీ రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. జపాన్‌లోని యొకొహమాలో జన్మించిన హెన్రీ 1975 నుంచి లాస్‌ఏంజెల్స్‌లో స్ధిరపడ్డారు. వ్యాపారవేత్తగా విజయం సాధించిన హెన్రీ రిటైర్‌మెంట్‌ జీవితాన్ని ఆస్వాదిస్తూ నిత్యం చురుకుగా ఉండటమే ఆయన ఆరోగ్య రహస్యంగా చెబుతారు.

హెన్రీ తన 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేసేవారని, 90 ఏళ్ల వయసులో ఉదయం ఆరున్నర గంటలకే ఏరోబిక్‌ క్లాస్‌లకు వెళ్లేవారని కుటుంబ సభ్యులు చెప్పారు. హెన్రీ యువకుడిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్‌తో పాటు అవుట్‌డోర్‌ స్పోర్ట్స్‌ను ఇష్టపడేవారని ఆయన కుమార్తె లిండా అన్నారు. ఇప్పటికీ ఆయన రోజూ 30 నిమిషాల పాటు ఈ బైక్‌పై వ్యాయామం చేస్తారని, వీల్‌ఛైర్‌లోనే యోగ విన్యాసాలతో పాటు ఒత్తిడిని అధిగమించే కసరత్తులు చేస్తారని చెప్పారు. తమ తల్లితండ్రులు ఎన్నడూ మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండేవారని, ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించారని చెప్పారు. నిత్యం వ్యాయామం చేస్తూ సానుకూల దృక్పథంతో జీవించే వారు విజయం సాధిస్తారని హెన్రీ సెంగ్‌ చెబుతారు.

హెన్రీ ఆహారం ఇదే..
ఉదయాన్నేబ్రేక్‌ఫాస్ట్‌లో రెండు బాయిల్డ్‌ ఎగ్స్‌, ద్రాక్ష పండ్లు, ఒక అరటిపండు, బ్రెడ్‌, ఓట్స్‌, ఆరంజ్‌ జ్యూస్‌ తీసుకుంటారు. లంచ్‌కు ఇటాలియన్‌, చైనీస్‌, మెక్సికన్‌ ఫుడ్‌ను ఇష్టపడతారు. స్టార్‌బక్స్‌లో స్నాక్స్‌ ఆరగిస్తారు. ఇక రాత్రి డిన్నర్‌లో ఉడకబెట్టిన చికెన్‌, గ్రౌండ్‌ బీఫ్‌, పోర్క్‌, ఆమ్లెట్లు, సూప్‌ను రొటేషన్‌ కింద రోజుకో ఐటెమ్‌గా తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ను భారీగా, లంచ్‌ను అధికంగా, డిన్నర్‌ను మితంగా ముగించడంతో పాటు నిత్యం సంతోషంగా ఉండటం, సానుకూల దృక్పదంతో ముందుకు సాగుతుండటమే తన ఆరోగ్య రహస్యమని, వీటికి మించి ఎప్పుడూ చెదరని చిరునవ్వే తానింత కాలం ఆరోగ్యంగా బతకడానికి కారణమంటారు హెన్రీ.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు