మగాళ్లు మారాలి

11 Feb, 2018 01:19 IST|Sakshi
ఓల్గా, రచయిత్రి

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ‘‘స్త్రీలు ప్రపంచ పనిగంటల్లో 60 శాతం పనిచేస్తారు. ప్రపంచ ఆదాయంలో పదిశాతం మాత్రమే పొందుతారు. ప్రపంచ సంపదలోనైతే ఒకేఒక శాతం మీద మాత్రమే స్త్రీలకు యాజమాన్యం ఉంటుంది.’’ ఇది 1980, 90 దశాబ్దాల లెక్కల ప్రకారం. ఇప్పుడు పరిస్థితి మరింత క్షీణించింది. స్త్రీలు ఎంతో శ్రమ చేసి, తక్కువ పొందటం ఒకరకమైన వివక్ష అయితే, స్త్రీలు చేసే పనులు విలువలేనివిగా, దాని వల్ల స్త్రీలు విలువలేనివారుగా పరిగణించడం మరొకరకం వివక్ష. వివక్ష వేరు వేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాల్లో వేరుగా ఉంటుంది.

కానీ సారాంశంలో మాత్రం స్త్రీలు తక్కువ స్థాయి వారు, వారు పురుషుల కంట్రోలులో ఉండాలి అనే ప్రాథమిక సూత్రంపై వివక్ష ఆధారపడి ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో పద్ధతులిప్పుడు లేవు. అలాగే దళిత స్త్రీలపై, గిరిజన స్త్రీలపై ఉండే వివక్షకూ అగ్రవర్ణ స్త్రీలపై అమలయ్యే వివక్షకూ ఎంతో తేడా ఉంటుంది. ఈ వివక్షలో అతి ప్రధానమైన, ప్రాథమికమైన నియంత్రణలు లైంగికత్వం మీద, సంతానోత్పత్తి మీద, శ్రమ మీదా అమలు జరుగుతాయి. ఈ నియంత్రణలను కచ్చితంగా అమలు చేయాలంటే స్త్రీల కదలికలను నియంత్రించాలి. ఒకప్పుడు స్త్రీలను ఇల్లుదాటి బైటికి రానివ్వకపోతే, ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక రావొద్దంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే సంచరించాలనే ఆంక్షలు పెడుతున్నారు.

ఈ వివక్షను కొనసాగించడానికి అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఉపయోగించే సాధనం హింస. లైంగిక అత్యాచారం, లైంగిక అవమానాలు, గృహహింస, çపనిచేసే చోట లైంగిక వేధింపులు– వీటన్నింటితో స్త్రీలలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ కల్పించి వివక్ష విశ్వరూపంతో వర్ధిల్లుతోంది. ఈ వివక్షలన్నింటినీ స్త్రీలు సవాలు చేస్తున్నారు. చట్టాలలో మార్పులకోసం కృషి చేస్తున్నారు. స్త్రీలలో ఇలా చైతన్యం పెరగటం అనేది కచ్చితంగా మార్పే. కానీ ఇప్పుడు చైతన్యం పెరగవలసింది పురుషులలో. స్త్రీలు అన్ని రంగాలలోకీ వస్తున్నారు. కానీ పురుషులు ఇంటి పనులకు ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఇంటి పనికి సమాజం విలువ కట్టడం లేదు. శ్రమగా గుర్తించటం లేదు. పిల్లల పెంపకంలోకి పురుషులు రావటం లేదు.

సమానత్వం లేనిదే తమ కుటుంబ సభ్యులైన స్త్రీల ప్రేమను వారెన్నటికీ పొందలేరనే ఎరుక వారికి కలగటం లేదు. స్త్రీలను సమానులుగా భావించటం వల్ల తామేదో కోల్పోతామనే తెలివితక్కువ ఆలోచన నుండి బయటపడి, తాము ఎంతో పొందుతామనీ, సమాజం అభివృద్ధి చెందుతుందనీ పురుషులు గ్రహించేలా స్త్రీలు తమ పోరాటాలను నడిపి, వివక్షను నిర్మూలించాలి.

- ఓల్గా, రచయిత్రి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు