ఓం వరుణాయ నమః

3 Jul, 2014 23:34 IST|Sakshi
ఓం వరుణాయ నమః

సందర్భం
 
వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి వరుణుడి కరుణే కారణం.  
 భగవంతుడు చేసే సృష్టిని నిశితంగా వీక్షిస్తాడు వరుణుడు.  
 న్యాయానికీ, నిజాయితీకి ఈయన మూల స్తంభం. పడమటి దిక్కుకు అధిపతి.
 నాగులు ఈయన సేనలు. ఈయనకు దక్షిణాన యముడు, ఉత్తరాన కుబేరుడు ఉంటారు. ఈయన వాహనం మొసలి.
 అలాగే వరుణుడికి ఒక పక్క వాయవ్యం, ఒకపక్క నైఋతి మూలలు ఉంటాయి.
 వరుణుడు... కోపం, దయ రెండురకాల స్వభావాలను ప్రదర్శించగలడు.

 
ఆకాశంలో బంగారు భవంతిలో కూర్చుని... పాముతో తయారయిన ‘ఉచ్చు’ లేదా ‘పాశం’ ధరించి దర్శనమిస్తాడో దేవుడు. ఆయనే వరుణుడు. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. అంతేకాక పాతాళానికి, న్యాయానికి, స్వర్గానికి, పృథివికి కూడా అధిదేవతగా పూజించారు. సూర్యుని లక్షణాలన్నీ వరుణుడిలో ఉన్నాయి. వరుణుడు ఆదిత్యులకు అధిపతిగా ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడితో విభేదించి రాత్రితో స్నేహం చేశాడు. సృష్టిని అభివృద్ధి చేసే అంశాలు వరుణుడిలో అధికం.
 
న్యాయాధిపతి, శాంతికాముకుడు
 
వరుణుడు ఆకాశరాజు, ఆకాశంలో ఉన్న చీకటి అనే సగ భాగానికి, మహాసముద్రాలకు అంటే రసాతలానికి అధిపతి. మిత్రుడు (సూర్యుడు) ఋతానికి అంటే న్యాయానికి, ధర్మానికి సర్వాధికారి. వరుణుడు, మిత్రుడు ఇద్దరూ... ప్రమాణాలతో కూడిన సాంఘిక కార్యకలాపాలకు దేవతలు. అందుకే వీరిద్దరినీ కలిపి ‘మిత్రా - వరుణ’ అన్నారు. ఋగ్వేదం వరుణుడిని ఇంద్రుడితో కలిపి చెబుతూ, ఇంద్రా - వరుణ (ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రపంచంలో శాంతిభద్రతలను చేకూరుస్తారు) అని వర్ణించింది. నీటిలో మునిగిపోయినవారిని సంరక్షించి, వారికి అమరత్వాన్ని ప్రసాదించేవానిగా వరుణుడు పూజలందుకున్నాడు.
 
సర్వజ్ఞుడు, సర్వాధికారి
 
తప్పు పనులు చేసేవారిని వరుణుడు ‘వల’ వేసి పట్టుకుంటాడని, ఆకాశంలో ఉండే నక్షత్రాలు వరుణుడికి ఉండే వెయ్యి కళ్లనీ, వీటి సహాయంతో వరుణుడు నిరంతరం మనుషుల ప్రతి కదలికను రహస్యంగా గమనిస్తూ ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. సోముడు ఇంద్రుడికి అతి దగ్గర వాడు అయినప్పటికీ వరుణుడు తనకున్న సర్వజ్ఞత కారణంగా సర్వాధికారి అయ్యాడు. ద్విజులు సాయంసంధ్యలో చేసే సంధ్యావందనంలో వరుణుడిని ఉద్దేశించి, తాము చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటారు. వానలు కురిపించమని ప్రజలందరూ యాగాలు, ప్రార్థనలు చేస్తారు.
 
రాముడు- వరుణుడు
 
సముద్రాన్ని దాటి లంకను చేరడం కోసం రాముడు మూడు రోజులపాటు వరుణుడిని కఠోరదీక్షతో ధ్యానం చేశాడు. వరుణుడు కనికరించకపోవడంతో, నాలుగవరోజు బాణం సంధించాడు రాముడు. వెంటనే వరుణుడు ప్రత్యక్షమై రాముడికి నమస్కరించి, బ్రహ్మాస్త్రాన్ని సముద్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవద్దని, సముద్రగర్భంలో ఉన్న రాక్షసశక్తులను సంహరించడానికి ఉపయోగించమని ప్రార్థించాడు. వరుణుడి ప్రార్థనను మన్నించాడు రాముడు. ప్రతిగా రామదండు సముద్రాన్ని దాటడానికి వీలుగా నిశ్చ లంగా ఉంటానని వరుణుడు ప్రమాణం చేశాడు.
 
సంతాన, ఆయుష్కారకుడిగా...
 
హరిశ్చంద్రుడు సంతానప్రాప్తి కోసం ఏం చేయాలో చెప్పమని వశిష్ఠుని అర్థించాడు. వరుణుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహిస్తాడని సూచించాడు వశిష్ఠుడు. హరిశ్చంద్రుడు వరుణుడిని ప్రార్థించగా, ఆయన ప్రత్యక్షమై, ‘‘నువ్వు వరుణయాగం చేసి, నీకు జన్మించిన పిల్లవాడిని బలి ఇస్తానని మాట ఇస్తే సంతానం ప్రసాదిస్తాను’’ అన్నాడు. సత్యవాక్కును పరీక్షించడమే వరుణుడి ఉద్దేశం. హరిశ్చంద్రుడు అంగీకరించాడు. హరిశ్చంద్రుడి భార్య శైబ్యకు రోహితుడు జన్మించాడు. అర్ధాయుష్కుడిగా పుట్టిన ఆ పిల్లవాడు విశ్వామిత్రుడి సలహా మేరకు వరుణ మంత్రం జపించాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించిన వరుణుడు ఆ పిల్లవాడికి  పూర్ణాయుష్షు ప్రసాదించాడు. అందుకే వరుణ మంత్రం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయని చెబుతారు. వరుణుడి కరుణ ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి.
 
- రోహిణి
 
వరుణుడు - యురేనస్

జార్జెస్ డుమెజిల్ అనే శాస్త్రవేత్త భారతీయ వరుణుడికి, గ్రీకు యురేనస్‌కి ఉన్న పోలికలు వివరించాడు. రెండు పేర్లను పరిశీలిస్తే ఉరేనస్, వరుణ అనే ఉచ్చారణ ఒకేలా కనిపిస్తుంది. రెండింటికీ మూలం అయిన ఉరు అనే పదానికి కట్టుబడి ఉండటం అని అర్థం. యురేనస్ చీకటిగా ఉండే ఆకాశంతో ముడిపడి ఉంటాడు.  యురేనస్ అంటే ఆకా శం అని అర్థం. వరుణుడు ఆకాశానికి, పాలసముద్రానికి కూడా అధిదేవత. లక్షీ్ష్మదేవి ఇందులో నుంచే పుట్టిందని భాగవతం చెబుతోంది. అందువల్ల ఈయన లక్ష్మీదేవికి తండ్రి అని గ్రీకు పురాణాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు