విసిరి పారేశారు

31 May, 2017 00:17 IST|Sakshi
విసిరి పారేశారు

లాస్ట్‌ పఫ్‌
‘నో టొబాకో డే’ సందర్భంగా


సిగరెట్‌లో నికోటిన్‌ ఉంటుంది. సిగరెట్‌ తాగడంలో స్టయిల్‌ ఉంటుంది. నికోటిన్‌ ఇచ్చే కిక్‌ కన్నా, స్టెయిల్‌ ఇచ్చే కిక్కే యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్‌ చేస్తుంది! బడ్డీ కొట్టుకు వెళ్లి, సిగరెట్‌ కొనుక్కుని, నోట్లో పెట్టుకుని, వెలిగించి, గుండె నిండా దమ్ము పీల్చనవసరం లేదు. అక్కడ స్క్రీన్‌ మీద ఫేవరెట్‌ హీరో దమ్ము కొడుతున్నా చాలు, ఇక్కడ సీట్లో ఫాన్స్‌కి కిక్‌ ఎక్కుతుంది. హీరో వరకు ఎందుకు? విలన్‌ ఉఫ్‌మని పొగను వదులుతున్నా... ఆ వదలడంలో కుర్రాళ్లకు హీరోయిజమే కనిపిస్తుంది. ఇక స్మోకింగ్‌ అలవాటవడం ఎంతసేపు చెప్పండి? అసలు నిజమైన హీరోలు ఎవరో తెలుసా? సిగరెట్‌ మానేసినవాళ్లు. అలాంటి రియల్‌ హీరోలు కొందరు స్క్రీన్‌పైన కూడా ఉన్నారు. నేడు ‘నో–టొబాకో–డే’ కాబట్టి... ఒకరిద్దరు నో–స్మోకింగ్‌ హీరోల నుంచి ‘మానే దమ్ము’ను స్ఫూర్తిగా పొందడం టైమ్‌లీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా రియల్‌ హీరోలు?

సల్మాన్‌ ఖాన్‌
సార్‌కి 2013లో నెర్వ్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. ప్రాబ్లం ఏంటీ అని డాక్టర్‌లని అడిగితే... ‘స్మోకింగ్‌’ కూడా ఒక కారణం అని చెప్పారు. వార్నింగ్‌ బెల్‌ మోగింది! తక్షణమే సిగరెట్‌కి బై చెప్పేశాడు. గ్రేట్‌!

హృతిక్‌ రోషన్‌
సిగరెట్‌ మానేయడానికి హృతిక్‌ చాలా కష్టపడ్డాడు. ఓసారి అనుకోకుండా ‘ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌’ అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకం రాసింది అలెన్‌కార్‌ అనే చైన్‌స్మోకర్‌. పుస్తకం చివరి పేజీ చదివిన రోజే తన చివరి సిగరెట్‌ కాల్చాడు. నైస్‌!

ఆమిర్‌ ఖాన్‌
ఆమిర్‌ అప్పుడప్పుడు స్మోక్‌ చేసేవాడు. ‘అది కూడా ఎందుకు పప్పా’ అని పిల్లలు జునాయిడ్, ఇరా అడిగేసరికి.. సిగరెట్‌ మానాలని ట్రై చేశాడు. ఫైనల్‌గా 2011లో చిన్న కొడుకు అజాద్‌ పుట్టాక ధూమపానం నుంచి విముక్తుడయ్యాడు. ఆసమ్‌!

సైఫ్‌ అలీ ఖాన్‌
సైఫ్‌కి 2009లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ‘స్మోకింగ్‌ మానేస్తే మీ గుండెకు మంచిది’ అని డాక్టర్లు చెప్పారు. చెప్పింది విన్నాడు. ‘సిగరెట్‌ మానండోయ్‌ బాబూ..’ అని కొన్నాళ్లు ప్రజాహితార్థం ప్రచారం కూడా చేశాడు. వావ్‌!

వివేక్‌ ఒబెరాయ్‌
ఒకప్పుడు ధారాళంగా పొగ తాగిన ఒబేరాయ్‌కు.. ముంబైలోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్‌ పేషెంట్‌లతో గడిపాక  జ్ఞానోదయం అయిందట. అప్పట్నుంచీ తాను తాగడు, సెట్‌లో ఎవర్నీ తాగనివ్వడు. వండర్‌ఫుల్‌!

అజయ్‌ దేవగణ్‌
‘నా మాట నేనే వినను..’ అన్న అజయ్‌ చివరికి తన బాడీ మాట వినవలసి వచ్చింది. బాడీ తో పాటు భార్య కాజోల్‌ కూడా ‘మానేద్దురూ’ అని బతిమాలింది. ఆమె మాట విని సిగరెట్‌ని క్విట్‌ చేసేశాడు అజయ్‌. వైజ్‌!

అర్జున్‌ రాంపాల్‌
ఆమిర్‌ ఖాన్‌ లానే ఈయన కూడా పిల్లల కోసమే సిగరెట్‌లు మానేశాడు. అర్జున్‌ భార్య మెహర్‌కు కూడా సిగరెట్‌ తాగే అలవాటు ఉండేది. ఆమె మానేయడంతో, ఆమె ఇన్‌స్పిరేషన్‌తో ఈయనా మానేశాడు. లవ్లీ!

రణ్‌బీర్‌ కపూర్‌
డైరెక్టర్‌ అనురాగ్‌ బసుతో బెట్‌ కట్టి మరీ సిగరెట్‌ హ్యాబిట్‌కు టాటా బై బై చెప్పేశాడు రణబీర్‌. అంతేకాదు, ఎవరికైనా తను సిగరెట్‌ తాగుతూ కనిపిస్తే తనని చంపేయవచ్చట. తనని కాల్చేయవచ్చట. తనని అబద్దాల కోరు అనేయవచ్చట. సో స్వీట్‌!

మరిన్ని వార్తలు