ఇద్దరూ ఒకరే... ఒకరిలోనే ఆ ఇద్దరు!

14 Aug, 2014 23:43 IST|Sakshi
ఇద్దరూ ఒకరే... ఒకరిలోనే ఆ ఇద్దరు!

17న శ్రీకృష్ణ జన్మాష్టమి
 
రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే.
 రాముడూ... కృష్ణుడూ! ఇద్దరూ భగవంతుడి రూపాలే. అవతార స్వరూపాలే. అన్యాయం చెలరేగిననాడు, అధర్మం పెచ్చరిల్లిననాడు ధర్మాన్ని రక్షించ వచ్చిన మర్మమూర్తులు వారు. కాకపోతే ఒకరు త్రేతాయుగాన... మరొకరు ద్వాపరన. ఒకరు అయోధ్యన. మరొకరు ద్వారకన. ఇద్దరూ ఇద్దరే. శ్రీరాముడు అనగానే మర్యాదకు సూచిక. శ్రీకృష్ణుడనగానే యుక్తికి ప్రతీక.
 
శ్రీరాముడంటే ఓ భయంతో కూడిన గౌరవం... శ్రీకృష్ణుడంటే మనవాడనే దగ్గరితనం. ఎందుకీ తేడా...? ఎందుకంటే...
మనమందరం రోజూ చదివే ఆ శ్లోకాలే చూద్దాం. ‘ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం’... అని నీలమేఘశ్యాముణ్ణి... ఆ రాముణ్ణి స్తుతిస్తారు. కేళీవిలాసంగా ఉండే ఆ శిఖిపింఛమౌళిని... ‘నాసాగ్రే నవమౌక్తికం...  కరతలే వేణుం... కరే కంకణం’... అంటూ నుతిస్తారు.
 
రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత  మాణిక్యాలే. కానీ ఆ ఇద్దరిలోనూ కొన్ని తేడాలు... నిశితంగా చూస్తే తప్ప కనిపించని అత్యంతసూక్ష్మమైన నిత్యవ్యత్యాసాలు... వాటిలో కొన్ని...

శ్రీరాముడు ధీరోదాత్తుడైనా స్థిరచిత్తుడే అయినా సీతను ఎత్తుకెళ్లిన సందర్భంలోనో, అడవిలో ఉన్న వేళలోనైనా అప్పుడో ఇప్పుడో కాస్తో కూస్తో దుఃఖిస్తాడు. కనుల నీరు దొర్లిస్తాడు. కానీ కృష్ణుడో... ఆ మోమున ఎప్పుడూ చిద్విలాసమైన చిరునవ్వే. ఆ నవ్వే ఒక చిరునవ్వులదివ్వె. రాముడు ఎప్పుడూ సలహాలు స్వీకరిస్తూనే ఉంటాడు. హనుమంతుడివో,  సుగ్రీవుడివో, లంక గుట్టు తెలుసుకోడానికి, దాన్ని ముట్టడించడానికి విభీషణుడివో.  ఇలా రాముడు తాను గెలవడానికి ఇతరుల సహాయం తీసుకుంటుంటాడు.
 
కానీ కృష్ణుడు ఎప్పుడూ సలహాలిస్తూ ఉంటాడు... జరాసంధ సంహారానికి భీముడికో. ఖాండవదహనానికి అర్జునుడికో. కురుక్షేత్ర యుద్ధానికి ధర్మజుడికో. ఎవరో గెలవడానికి కృష్ణుడు తానెప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు.
 
ఇలా... అందరి సాయం రాముడి గెలుపు... కృష్ణుడి సాయం అందరి గెలుపు. విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న బాల రామలక్ష్మణులను చూసినా, అరణ్యవాసం చేస్తున్న  యౌవన అన్నదమ్ముల్ని వీక్షించినా కనిపించే దృశ్యం వేరు. ‘నిశాచర వినాశకర’  స్వరూపాలైన వారు ధనుర్బాణాలతో ఆయుధధారులై మిలటరీ యూనిఫామ్‌లో ఉంటారు. కానీ కృష్ణుడో... ‘కరే కంకణం, కరతలే వేణుం’ అంటూ పిల్లనగ్రోవిని వరించిన ఆ వేణుధరుడి వేణిలో పింఛం అలంకరించుకుని ఎప్పుడూ మఫ్టీలో ఉంటాడు.
 
జలజాతాసనవాసవాది సురపూజా భాజనంబై తనర్చు ఆ కృష్ణుడు... బ్రహ్మాది దేవతలంతా స్తుతించే, నుతించే, ఆర్తితో కీర్తించే స్థానంలో ఉన్న ఆ కృష్ణుడు... ఆదిదేవుడైన ఆ విష్ణువు రూపానికి దగ్గరగా ఎలా ఉంటాడో చూడండి.  ఆర్తత్రాణపరాయణత్వంలోనూ, హడావుడి సమయంలోనూ శంఖచక్రయుగముం జేదోయి సంధింపక భయపెట్టక ఉండే విష్ణుమూర్తి మూల రూపానికి కృష్ణావతారం ఎంత  దగ్గరగా ఉంటుందో చూడండి. ధనుస్సు లాంటి ఆయుధాన్ని ధరించి న వారిని చూస్తే భయంతో కూడిన గౌరవం. అదే సంగీత ఝరిని ప్రసరింపజేసే వేణువును ధరించిన వాడిని చూస్తే నిర్భయంతో కూడిన దగ్గరిదనం.  అందుకే రామాయణమూర్తి కంటే మహాభారతమూర్తే ముచ్చటగా కనిపిస్తాడు. మనవాడే అనిపిస్తాడు.

తేడాలేముంటేనేం... ఇద్దరూ ఇద్దరే. దైవావతారాలే. కైవల్యమొసగగల కారుణ్యరూపాలే.అందుకే ముసలీముతకా వారిద్దరినీ కలుపుకుని ‘కృష్ణా.. రామా’ అనుకుంటుంటారు. కొత్తగా బిడ్డను కలిగే వయసులో ఉన్నవారు ఆ ద్వయంలో ఏ ఒక్కరినీ వదల్లేక ‘రామకృష్ణుడ’ంటూ తమ బిడ్డలకు ద్వంద్వసమాసయుక్తమైన వాళ్ల  పేరిడుతుంటారు. ముకుళిత హస్తయుగళంతో, మంగళగళంతో, హారతిపళ్లెంతో, తులసీదళంతో ఆ ఇద్దరికీ ఇదే మా ప్రార్థన.
 - కె.రాంబాబు

మరిన్ని వార్తలు