రోడ్డెక్కిన క్రోధం

4 Nov, 2015 22:45 IST|Sakshi
రోడ్డెక్కిన క్రోధం

రోడ్డు మీద ఇడియట్స్‌కి కొదవలేదు.    ఇదొక టైర్ కంపెనీ యాడ్‌లోని వాయిస్ ఓవర్. స్టీరింగ్ ముందున్న కూతురికి, వెనుక సీట్లో కూర్చొని ఉన్న తల్లి... లడ్డూ తినిపిస్తూ బైక్ ఆక్సిడెంట్‌కి కారణం కాబోతుంది. అ సమయంలో వినిపిస్తుంది ఈ మాట... ‘రోడ్లపై ఇడియట్స్‌కి కొదవలేదు’ అని. రోడ్లపై ఇడియట్స్‌కే కాదు, రోడ్ రేజ్‌కు లోనయ్యేవారికీ కొదవలేదు. నగర జీవితంలో ట్రాఫిక్ జామ్ నిరీక్షణలు, వ్యక్తిగత జీవితంలోని అనేక విధాలైన సమస్యలు రోడ్ రేజ్‌కు కారణం అవుతుంటే, మరోవైపు ప్రవర్తనలలోని అపసవ్యతల వల్ల కూడా రోడ్ రేజ్‌కు గురయ్యేవారి సంఖ్యా పెరిగిపోతోంది!
 
‘రోడ్ రేజ్’ అనే మాటను మీరు విని ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కానీ ‘రోడ్ రేజ్’ ను మాత్రం తప్పకుండా ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. మీరు రోజూ రాకపోకలు సాగించేది మహానగరంలో కనుకైతే రోడ్ రేజ్ మీకొక నిత్య దృశ్యం. రోడ్డు మీద బండి నడుపుతున్నప్పుడు ఏ కారణం వల్లనో అకస్మాత్తుగా ప్రదర్శించే  ఆగ్రహమే రోడ్ రేజ్. అది అగ్ని పర్వతం పేలినట్లుగా ఉంటుంది. ఇంగితాన్ని మరచినట్లుగా ఉంటుంది. ఒక్కోసారి సంస్కార హీనంగా, అసభ్యంగా కూడా ఉంటుంది. మీరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మీ బస్సుకు ఎవరైనా మనిషిగానీ, మరో వాహనంగానీ హఠాత్తుగా అడ్డువచ్చినప్పుడు మీ బస్సు డ్రైవర్ పట్టలేనంత కోపంతో పెద్దగా అరచి, తిట్టడమే రోడ్ రేజ్.

మీరున్న ఆటో మీదకు ఏ బస్సో రాబోతుంటే మీ ఆటో డ్రైవర్ తన బండిని తీసుకెళ్లి బస్సుకు అడ్డంగా నిలిపి బస్సు డ్రైవ ర్‌ను కొట్టబోవడమే రోడ్ రేజ్. మీరు టూ వీలర్‌పై వెళుతున్నప్పుడు ఇంకో వాహనం మిమ్మల్ని చికాకు పెడితే తిక్కరేగి మీరు తిట్లకు లంఘించుకోవడమే రోడ్ రేజ్. రోడ్ రేజ్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. చంపేస్తానన్నట్లు మీదికి దూకుతారు. తిట్లతో అవమానిస్తారు. ఇవి కాకుండా కొందరు తమ డ్రైవింగ్‌తోనే... దారంతా అడ్డదిడ్డంగా నడుపుతూ, రాంగ్ రూట్‌లో వెళుతూ, పరిమితి దాటిన వేగంతో తక్కిన వాహనదారులను, పాదచారులను భయకంపితులను చేస్తుంటారు.

రోడ్ రేజ్ ఘర్షణకు, కొట్లాటకు, తగవులకు, వాదులాటలకు, వాగ్యుద్ధానికి, చివరికి పెద్ద ట్రాఫిక్ జామ్‌కు దారి తీస్తుంది. కొన్ని సార్లు భౌతిక దాడులకు, హత్యలకు కూడా కారణం కావచ్చు. రోడ్డు మీద అడ్డదిడ్డంగా బండి నడిపేవాళ్లు ఉన్నప్పటి నుంచీ రోడ్ రేజ్ ఉన్నప్పటికీ, అసలిలాంటి ప్రవర్తనకు ‘రోడ్ రేజ్’ అనే పేరు వచ్చింది మాత్రం సుమారుగా ఓ ముప్పై ఏళ్ల క్రితమే. 1987లో అమెరికా ఈ మాటను కనిపెట్టింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కె.టి.ఎల్.ఎ. అనే అమెరికన్ టీవీ చానల్ తొలిసారి రోడ్ రేజ్ అనే మాటకు రూపకల్పన చేసింది.
 
 
ఎందుకిలా చేస్తారు?

‘రోడ్ రేజ్’ అనేది ఒక విధమైన మానసిక రుగ్మత అని డి.ఎస్.ఎం. (డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్) పరిగణిస్తోంది. ఈ విధమైన ప్రవర్తనల్ని ‘ఇంటర్మింటెంట్ ఎక్స్‌ప్లోజివ్ డిజార్డర్’ గా పేర్కొంది. 2001- 03 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికాలోని 9,200 మంది వాహనదారులను సర్వే చేసి డి.ఎస్.ఎం. ఈ నిర్థరణకు వచ్చింది.
 
 రోడ్ రేజ్ ఇలా కూడా ఉంటుంది
 
అరవడం, తిట్టడం, దురుసుకుగా మీదకు వెళ్లడం... ఇవి మాత్రమే రోడ్ రేజ్ కాదు. కింద ఉదహరించిన ప్రవర్తనలు కూడా రోడ్ రేజ్ కిందికే వస్తాయి.  దూకుడుగా డ్రైవ్ చెయ్యడం  అకస్మాత్తుగా యాక్సిలేటర్ పెంచడం  సడెన్ బ్రేక్ కొట్టడం  ముందున్న వాహనాన్ని తాకుతున్నట్లుగా నడపడం (టెయిల్‌గేటింగ్)  కట్‌లు కొట్టడం  మరో వాహనానికి దారివ్వకపోవడం  ఛేస్ చెయ్యడం  గట్టిగా హారన్  కొట్టడం / అలా కొడుతూనే ఉండడం   వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేలా బండి నిలపడం  వేలితో అసభ్య సంకేతాలు చూపడం  కావాలని ఇతర వాహనాలు డీకొనేలా చెయ్యడం  ముందున్న వాహనం బంపర్‌ని  తాకించడం.
 
రోడ్ రేజ్‌కు కారణాలు
ప్రధానంగా వ్యక్తిగతమైన సమస్యలు, ఇబ్బందులు, బాధించే ఆలోచనలు రోడ్ రేజ్‌కు కారణం అవుతుంటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ నిర్థరించింది. ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఆఫీస్‌లో పై అధికారితో సంత్సంబంధాలు లేనివారు, అర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుని ఉన్నవారు అతి తేలిగ్గా రోడ్ రేజ్‌కు లోనవుతారని ఆ సంస్థలోని అధ్యయనాల అధికార ప్రతినిధి ఫిలిప్ వాంగ్ అంటున్నారు.
 
రోడ్ రేజ్ సెలబ్రిటీలు

రోడ్ రేజ్‌ను ప్రదర్శించిన అంతర్జాతీయ ప్రముఖులలో చాలామంది సృజనాత్మక రంగాలలో ఉన్నవారే కావడం ఆసక్తికరమైన విషయం. టాప్-10 రోడ్ రేజ్ సెలబ్రిటీల జాబితా ఇది.
మైక్ టైసన్, బాక్సింగ్ క్రీడాకారుడు.
మెల్ గిబ్సన్, హాలీవుడ్ నటుడు.
గ్యారీ బ్యూసీ, హాలీవుడ్ నటుడు.
డ్యానీ బ్యునాడ్యూస్, టీవీ ఆర్టిస్ట్.
{Mిస్ బ్రౌన్, రికార్డింగ్ ఆర్టిస్ట్.
రస్సెల్ క్రోవ్, హాలీవుడ్ నిర్మాత.
చార్లీ షీన్, హాలీవుడ్ నటుడు.
నిక్ నోల్టే, హాలీవుడ్ నటుడు.
హోవార్డ్ స్టెర్న్, రేడియో ఆర్టిస్ట్.
Mిస్టియన్ బాలే. బ్రిటిష్ యాక్టర్.
 
 మనవాళ్లు
 1. సల్మాన్‌ఖాన్
 2. నవ జోత్ సింగ్ సిద్ధు
 3. రామ్ చరణ్ బాడీగార్డులు
 4. జాన్ అబ్రహాం
 5. వసీమ్ ఆక్రమ్ (రోడ్ రేజ్ బాధితుడు)
 

మరిన్ని వార్తలు