మావారికి మరొకసారి థ్యాంక్స్

20 May, 2014 23:24 IST|Sakshi
మావారికి మరొకసారి థ్యాంక్స్

వేదిక
 
మా ఊరి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. దాంతో నా చదువు అక్కడితో ఆగిపోయింది. ఇంట్లో పెద్దమ్మాయిని కావడంతో చదువు పూర్తయిన రెండేళ్లకే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని అబ్బాయికిచ్చి పెళ్లిచేశారు. నా భర్త డిగ్రీ చదువుకున్నాడు.

ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాతోటి స్నేహితులంతా వేరే ఊరెళ్లి చదువుకుంటుంటే...నేనేమో ఇలా పెళ్లి చేసుకుని వంటింట్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని చాలా బాధ పడేదాన్ని. నా బాధని అర్థం చేసుకున్న నా భర్త నాతో ప్రయివేటుగా పదోతరగతి చదివించాడు. పరీక్ష రాసి పాసయ్యాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీకి కూడా అప్లయి చేయించాడు.

మా అత్తయ్య ‘సంటి పిల్లల తల్లికి చదువేంది...!’ అంటూ నా భర్తని తిట్టేది. ఎవరేమన్నా ఆయన పట్టించుకునేవాడు కాదు. ‘‘ఇంటి పనికి, వంట పనికి...ఎంత సమయమైనా సరిపోదు...చేసేకొద్దీ పని ఉంటనే ఉంటది.  త్వరగా పనులు ముగించుకుని పుస్తకాలు ముందరేసుకో...పిల్లలు స్కూలుకెళ్లేలోపు నీ చదువు పూర్తయిపోవాలి. తర్వాత నీ కిష్టమైతే ఉద్యోగం చేద్దువు...లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు.

నీ స్నేహితులను తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం నీకు లేదు’’ అని నా భర్త చెప్పిన మాటలు నాకు చాలా బలాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసేశాను. ఇప్పుడు నా భర్త ఫ్యానులకు సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ప్రారంభించాడు. అందులో అడ్మినిస్ట్రేషన్ పని బాధ్యతలు నాకు అప్పగిస్తానన్నారు. దానికోసం సిద్ధం అవుతున్నాను.  

నాతో ఇలాంటి పెద్ద పనేదో చేయించడం కోసమే అనుకుంటాను. గత ఏడాది స్పోకెష్ ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చి పట్టుబట్టి నాతో చదివించారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడమంటే నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి, పిల్లలు తర్వాత వాటికోసం సమయం కేటాయించడమంటే ఏ అమ్మాయికైనా కష్టమే. చిత్రమేమిటంటే...నా స్నేహితులు చాలామంది డిగ్రీ పూర్తిచేసి పెళ్లి తర్వాత ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయారు.

నేను మాత్రం పెళ్లి తర్వాత ఊహించని మలుపులు చూశాను. దీనంతటికీ కారణం నా భర్తే. ఒక్క చదువనే కాదు...పెళ్లి తర్వాత మహిళ ఎదుగుదలను ప్రోత్సహించాలన్నా...అడ్డుపడాలన్నా... రెండూ భర్త వల్లే సాధ్యమవుతాయి. నా భర్తలాంటివారు చాలా అరుదుగా ఉంటారనడంలో సందేహం లేదు. అందుకే ఈ వేదిక ద్వారా ఆయనకి మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాను.
 
- శ్రీలత, రంగారెడ్డి జిల్లా
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు