ఎనిమిది రకాల కేన్సర్లకు ఒకే రక్తపరీక్ష!

20 Jan, 2018 00:29 IST|Sakshi

ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే మనం బతికే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. అందుకే ఒకే రక్త పరీక్ష ద్వారా దాదాపు ఎనిమిది రకాల కేన్సర్లను గుర్తించేందుకు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ‘కేన్సర్‌సీక్‌ అని పిలుస్తున్న ఈ కొత్త పద్ధతి శరీర కణజాలాన్ని కోసి పరీక్షించడం (బయాప్సీ) కంటే ఎంతో సురక్షితమైన, కచ్చితమైన ఫలితాలిచ్చేది కూడా అంటున్నారు వీరు. దాదాపు 90 శాతం మరణాలకు కారణమవుతున్న కేన్సర్లను కేన్సర్‌సీక్‌ ద్వారా గుర్తించవచ్చంటున్నారు నికోలస్‌ పాపాడోపౌలోస్‌. శరీరంలో కేన్సర్‌ కణాలు ఏర్పడితే... కొంత సమయం తరువాత వీటి తాలూకూ అవశేషాలు కొన్ని రక్తంలో తిరుగుతూ ఉంటాయి.

కేన్సర్‌సీక్‌ ద్వారా ఇలాంటి డీఎన్‌ఏ ముక్కలను.. కేన్సర్‌ కణాలకు మాత్రమే పరిమితమైన కొన్ని రకాల ప్రొటీన్లను గుర్తిస్తారు. అండాశయ, కాలేయ, ఉదర, క్లోమ, ఆహారనాళం, ఊపిరితిత్తులు, రొమ్ములతో పాటు పెద్ద పేవు/మల ద్వార కేన్సర్‌ కణాలన్నింటిలో సామాన్యంగా కనిపించే ప్రోటీన్లు, డీఎన్‌ఏ ముక్కలను గుర్తించేందుకు తాము కొన్ని వందల జన్యువులు, దాదాపు 40 ప్రోటీన్‌ మార్కర్లను పరిశీలించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జోషువా కోహెన్‌ తెలిపారు. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందని దశలో కేన్సర్లు ఉన్న దాదాపు వెయ్యిమందిపై ఈ పరీక్ష నిర్వహించి చూశామని, అండాశయ కేన్సర్‌ను ఇది 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగా... రొమ్ము కేన్సర్‌ విషయంలో ఫలితం 33 శాతం ఉందని వివరించారు. ఈ ఎనిమిది రకాల కేన్సర్లలో ఐదింటికి ఇప్పటివరకూ ఏ రకమైన  పరీక్ష కూడా లేదని చెప్పారు.  

మరిన్ని వార్తలు