నన్నిలాక్కూడా బతకనివ్వవా?!

9 Feb, 2018 02:46 IST|Sakshi

చెట్టు నీడ

రోజులు గడుస్తున్నా ఏ దేవుడూ   అతడి మొర  ఆలకించలేదు.

ఒక దీవికి సమీపంలో పడవ మునిగిపోయింది. ఒకే ఒక వ్యక్తి బతికి బట్ట కట్టి దీవి ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. అది మనుషులుండే దీవి కాదు. ఇతడొక్కడే మనిషి. భయపడ్డాడు. దేవుడిని ప్రార్థించాడు. నీళ్లలోంచి ఒడ్డున పడేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఒడ్డు నుంచి తనను తన దేశానికి చేర్చమని వేడుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఏ దేవుడూ అతడి మొర ఆలకించలేదు. చలికి, ఎండకు తట్టుకోలేకపోతున్నాడు. ఒడ్డున ఉన్న చెక్కలతో కష్టపడి చిన్న గది కట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నాడు.

ఒక రోజు ఆ వ్యక్తి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు ఆకాశంలో దట్టంగా పొగ కనిపించింది. ఆ పొగ ఎక్కడినుంచి వస్తోందా అని ఆ దారి వెంటే వెళితే.. చివరికి తన చెక్కగల గది కాలిపోతూ కనిపించింది. ఆ పొగ తన గదిదే! ‘భగవంతుడా.. నన్ను ఇలాక్కూడా బతకనివ్వవా?’ అని దేవుడిపై ఆగ్రహించాడు. కొద్దిసేపటికే అక్కడి ఒక నౌక వచ్చింది! అతడిని ఎక్కించుకుంది. ‘‘నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసిందీ’’ అని సంతోషంగా అడిగాడు ఆ వ్యక్తి. ‘‘ఆకాశంలోకి వ్యాపించిన పొగను చూసి వచ్చాం’’ అని చెప్పారు వాళ్లు. దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు అతను. దేవుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో తెలీదు. ఆగ్రహించాడని అనుకుంటాం కానీ.. అది కూడా అనుగ్రహమే అయి ఉంటుంది.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు