ఉప్పు, చక్కెరతోనే ప్రాణాలకు ముప్పు

4 Apr, 2019 09:01 IST|Sakshi

లండన్‌ : అధిక మోతాదులో ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవడంతో 2017లో ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల మంది మృత్యువాత పడ్డారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఉప్పు, చక్కెరతో పాటు ప్రాసెస్‌ చేసిన మాంసాహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులతో ఈ మరణాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషించింది. ఆహార సంబంధిత మరణాలు ఉజ్బెకిస్తాన్‌లో అధికంగా, ఇజ్రాయెల్‌లో తక్కువగా ఉన్నట్టు ది లాన్సెట్‌ ఆన్‌లైన్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వెల్లడించింది.

ఈ జాబితాలో అమెరికా 43వ స్ధానంలో, బ్రిటన్‌ 23వ స్ధానం, చైనా 140వ స్ధానంలో భారత్‌ 118వ స్ధానంలో నిలిచాయి. గింజలు, సీడ్స్‌, పాలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర ఆహారం వినియోగం సగటు బాగా తక్కువగా ఉందని, చక్కెర కలగలిసిన పానీయాలు, ఉప్పు, ప్రాసెస్‌ చేసిన మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరగడం ఫలితంగా 2017లో ప్రతి ఐదు మరణాల్లో ఒక మరణం చెడు ఆహారాన్ని తీసుకోవడం వల్లే సంభవించిందని తెలిపింది. ఆరోగ్యకర ఆహారమైన గింజలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను కేవలం 12 శాతం ప్రజలు మాత్రమే ఆహారంలో తీసుకుంటున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు