నలుగురిలో ఒకరికి మధుమేహం..

27 Sep, 2017 03:49 IST|Sakshi

ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు

దేశంలో నగరవాసుల పరిస్థితి ఇదీ.

జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు.. ఇదీ దేశంలో నగరవాసుల పరిస్థితి. రోజువారీ అవసరాల కంటే తక్కువ మోతాదులో పోషకాలు, విటమిన్లు తీసుకుంటుం డటం ఈ పరిస్థితికి కారణం కావచ్చని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై విస్తృత అధ్యయనం నిర్వహించింది. 2015–16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనం.. ఆహారం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటన్నది స్పష్టం చేస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లోని ప్రజలు ఒక రోజులో తీసుకుంటున్న ఆహారం ఆధారంగా ఆ సంస్థ ఓ నివేదిక రూపొందించింది.
భారత వైద్య పరిశోధన సమాఖ్య నిర్దేశించిన మోతాదు లోనే నగర ప్రజలు తృణధాన్యాలు (రోజుకు 320 గ్రాములు), చిరుధాన్యాలు (42 గ్రా) తీసుకుంటున్నారు.

► పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, చక్కెర, బెల్లం వంటి వాటిని మాత్రం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా తీసుకుంటున్నారు.
► మూడేళ్ల లోపు పిల్లల్లో సగం మందికి, 4–6 ఏళ్ల మధ్య వయసు వారిలో మూడింట రెండొంతుల మందికి, గర్భి ణుల్లో 56 శాతం మందికి మాత్రమే రోజూ అవసరానికి తగ్గ మోతాదుల్లో ప్రొటీన్లు, కేలరీలు అందుతున్నాయి.
► ఐదేళ్ల లోపు పిల్లల్లో 25 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు. అలాగే 29 శాతం పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి తక్కువగా ఉంటోంది.
► పోషకాహార లేమి అనేది బాలికలతో పోలిస్తే బాలురలోనే (6–17 మధ్య వయసు) ఎక్కువగా ఉండటం గమనార్హం.
► బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లి స్తన్యం పట్టాలన్న సూత్రాన్ని నగర ప్రాంతాల్లో పాటిస్తున్న వారు 42 శాతం మంది మాత్రమే. నలుగురిలో ఒకరు తల్లి పాల కంటే ముందుగా తేనె, గ్లూకోజ్, చక్కెర నీరు, మేకపాలు వంటివి పడుతున్నారు.
► నగరాల్లో నివసిస్తున్న పురుషుల్లో 31 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, మహిళల్లో ఈ సంఖ్య 26 శాతంగా ఉంది. అధిక రక్తపోటు సమస్య కేరళలో అత్యధికంగా ఉంటే.. అత్యల్పం బిహార్‌ రాష్ట్రంలో నమోదైంది.
► నగరాల్లోని పురుషుల్లో 22 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, మహిళల్లో 19 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు