కోటీశ్వరుడిని చేసిన ఐడియా!

2 Sep, 2014 23:37 IST|Sakshi
కోటీశ్వరుడిని చేసిన ఐడియా!

విజయుడు

మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో  ఒడిదొడుకులను  ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు.
 
మనుషుల్లో రెండు రకాలు వారు ఉంటారు. విధిని నమ్ముకునే వాళ్లు. విధిగా ప్రయత్నం చేసి విజయం సాధించేవాళ్లు. ముప్పై తొమ్మిది సంవత్సరాల  ఆశిష్ హేమ్‌రాజని రెండో కోవకు చెందిన వ్యక్తి.
 
‘‘ఓడిపోవడమే అంటే  ఏమిటో కాదు...ప్రయత్నించకపోవడమే’’ అంటారు ఆయన.ఆన్‌లైన్ టికెటింగ్ సర్వీస్‌ను 1999లో ప్రారంభించారు ఆశిష్. పాతికవేలతో ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు కోట్లలోకి చేరుకుంది.
 
మూవీ, ఈవెంట్ టికెటింగ్ పోర్టల్‌గా దేశంలోనే అగ్రగామిగా నిలచింది. ముంబయిలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మార్కెటింగ్‌లో పట్టా పుచ్చుకున్న ఆశిష్  ఆ తరువాత ‘జె. వాల్టర్ థామ్సన్’ అడ్వర్వైజింగ్ కంపెనీలో చేరారు.

ఆశిష్‌కు ప్రయాణాలంటే వల్లమాలిన ఇష్టం.ప్రయాణాలలో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తుతాయనేది ఆయన విషయంలో నిజమైంది.
 
ఒకసారి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు రేడియో వింటున్నారు. రగ్బీ ఆటకు టికెట్లు అమ్మడానికి సంబంధించిన కార్యక్రమం అది. ఈ కార్యక్రమం తరువాత ఆశిష్ ఒక చెట్టు కింద నిల్చున్నాడు. అయితే పండేమీ రాలి పడలేదు.
 
ఒక ఐడియా మాత్రం వచ్చింది. అదే ‘బుక్ మై షో’  రాబోయే రోజుల్లో ఇంటర్‌నెట్‌దే హవా అని గ్రహించిన ఆశిష్  ‘బుక్ మై షో’కు రూపకల్పన చేశారు.
 
మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు.
 పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో  ఒడిదొడుకులను  ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు.
 
‘‘ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి’’ అంటారు ఆయన.
‘‘అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. యూనివర్శిటీలు కాదు’’ అని నమ్మే  ఆశిష్ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంత పెద్ద విజయాన్ని సాధించారు.

మరిన్ని వార్తలు