నా దేశం ఒక సందేశం

26 Jan, 2019 00:41 IST|Sakshi

మహా సంకల్పం

అంతటి రసస్ఫోరకమైన, ఉన్నత స్థితిలో దేశాన్ని చూడగలగడం అంటే.. దేశంపై ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు.. దేశాన్ని గౌరవించడం, దేశాన్ని పూజించడం కూడా. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మరొకసారి ప్రతిన పూనుదాం.దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని ఇష్టపడటమా? దేశాన్ని ప్రేమించటమా? స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దేశభక్తి అర్థాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  వివేకానంద ఓ దశలో నాలుగేళ్ల పాటు పాశ్చాత్యదేశాలలో పర్యటించారు. ఆ దేశాల్లోని సిరిసంపదలను, విజ్ఞానాన్ని, అభివృద్ధిని, వారు అవలంబిస్తున్న విధానాలను, ఆధునికతను, ఆ దేశాల అగ్రగామితనాన్ని, ఆధునిక టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. ఆ సుదీర్ఘ పర్యటనను ముగించుకుని, భారతదేశానికి వచ్చేందుకు అక్కడి విమానాశ్రయంలో వేచి ఉండగా ఓ పత్రికా విలేకరి ఆయన్ని.. ‘‘ఇక్కడికి, అక్కడికి తేడా ఏమిటని మీ అనుభవంలో తెలుసుకున్నారు?’’ అని అడిగారు.

అందుకు వివేకానంద ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘ఇక్కడి సంపదను, వైభోగాలను స్వయంగా చూశాను. ఇప్పుడు పర్యటన ముగించుకుని నా మాతృభూమికి వెళుతున్నాను. ఈ దేశాలకు రాక ముందు నా దేశాన్ని నేను ఇష్టపడేవాడిని. ఇప్పుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అంతే తేడా. అంతేకాదు, నా దేశంలోని ధూళి, నీరు, నేల పవిత్రంగా అనిపిస్తున్నాయి. చెట్టూ చేమ, రాయి రప్పా, పుట్టా గుట్టా అంతా నాకు పరమ పవిత్రంగా కనిపిస్తోంది. మొత్తం మీద నా భారతదేశం నాకు ధగధగాయ మానమైన ఓ సువర్ణ దేవాలయంలా సాక్షాత్కారం అవుతోంది’’ అన్నారు వివేకానంద. స్వచ్ఛమైన, నిత్యమైన, దేశభక్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? 
– డా. రమాప్రసాద్‌ ఆదిభట్ల  

మరిన్ని వార్తలు