ఒక నిమిషం ఒక విషయం

5 Nov, 2017 00:08 IST|Sakshi

శని సింగనాపూర్‌ మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేదు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్‌ ఆ శనిసింగనాపూర్‌ శనిదేవుడిది..గురుద్వార్‌ పంజాబ్‌ లోని మొహాలీలో వుంది. ఈ గురుద్వార్‌ లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి వుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు వుంది. సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కాని ఇక్కడున్న మామిడిచెట్టుకి రుతువులతో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఆ మామిడిచెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్థం గాని ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన  క్షేత్రం యాగంటి. ఇక్కడ వున్న నంది విగ్రహం మొదట్లో చిన్నగా వుండేది. కానీ నంది విగ్రహం రానురాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి శాస్త్రవేత్తలుు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూ వుంటారు.   లేపాక్షి ఆంధ్రాలో.. అనంతపురం జిల్లాలో వుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద కాగితాన్ని లేదా బట్టను సులువుగా పట్టించేయ్యొచ్చు. అంటే స్తంభం కింద ఏ ఆసరా, ఆధారం లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. అలా ఎలా మోస్తుందో, ఎవ్వరూ చెప్పలేకపోయారు.
∙పూణేలో దార్వేష్‌ దర్గా వుంది. 90 కేజీల రాయి ఈ దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ 11 మంది కలిసి ఒక రాయిని ముట్టుకుని ‘హజరత్‌ కమార్‌ అలీ దర్వేష్‌‘ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. వెంటనే ఆ రాయి 5 నుంచి 10 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు.

తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యం.పూరీ జగన్నాథ్‌ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు, పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ వింత ఏంటో అంతుచిక్కదు.

మరిన్ని వార్తలు