పదార్థాల్లేని వంట

9 Feb, 2019 04:02 IST|Sakshi

చెట్టు నీడ  

పూర్వం ఒకసారి ఒక ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడింది. అంటే వర్షాలు పడక పంటలు ఎండిపోయి, గడ్డి కూడా మొలవని పరిస్థితి అన్నమాట. ఒకాయన అక్కడ వర్షాలు పడేంతవరకు ఎలాగూ పనిదొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారు. పిల్లల్లో చిన్నవాడు ఆకలి అనడంతో ఏదైనా వండుకుని తిని ఆకలి తీరాక ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. తల్లి రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. తండ్రి నీళ్ల కోసం వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి చెట్టు కింద ఉన్న ఎండుపుల్లలు ఏరి నిప్పు రాజేస్తున్నారు.

ఈ విధంగా అందరూ తలోపనిలో ఉండటాన్ని చెట్టుపైనుంచి పక్షులు చూస్తున్నాయి. వాటిలో పెద్ద పక్షి మిగిలిన వాటితో ‘‘వీళ్లు చూస్తే ఒట్టి తెలివితక్కువ వాళ్లలా ఉన్నారు. వండుకోవడానికి పదార్థాలేమీ లేకుండానే వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు’’ అంటూ నవ్వింది. ఆ మాటలు విన్న పెద్దవాడికి కోపం వచ్చింది. ‘‘ఇప్పటివరకు ఏదైనా దుంపలు తవ్వుకు తీసుకొచ్చి వండుకు తినాలనుకుంటున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎగతాళి చేశారు కాబట్టి, మిమ్మల్నే పట్టుకుని వండుకుని తింటాం’’ అన్నాడు కోపంగా. ఆ మాటలకు పెద్దపక్షి భయపడింది. ‘‘బాబూ! కుటుంబమంతా కలిసి ఉండటంలోని సంతోషం నీకు తెలుసు కదా.

మా పక్షి పరివారాన్ని చంపకండి. అందుకు బదులు మేము మీకు ఒక నిధి చూపిస్తాం వెళ్లి తెచ్చుకోండి. ఈలోగా మీకు ఆకలి తీరేందుకు కొన్ని పళ్లు, దుంపలు చూపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అని బతిమాలింది. అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు. ఆ కష్టకాలంలో వారికి లభించిన నిధితో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ కథను ఒక గురువు తన శిష్యులకు చెప్పి, ‘‘చూశారా పిల్లలూ! పరిస్థితులను తలచుకుని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. మన ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నీ అనుకూలిస్తాయి. ఆ కుటుంబం పదార్థాలేమీ దొరక్కుండానే వంట మొదలు పెట్టి అలా ఆశావహ దృక్పథంతో ప్రవర్తించింది కాబట్టే వారికి నిధి దొరికిందని గ్రహించండి’’ అని బోధించారు. పిల్లలు అర్థమైందన్నట్టు తలలు పంకించారు. 
– డి.వి.ఆర్‌.

మరిన్ని వార్తలు