ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?

5 Mar, 2019 05:19 IST|Sakshi
గిడ్డయ్య ఫొటోతో భార్య, పిల్లలు

మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్‌ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు  తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు.

అదేరోజు  ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్‌ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్‌ ఫర్టిలైజర్‌ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె.
      
 – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా