‘కోట’లో మాత్రమే చలామణి!!

26 Feb, 2014 01:43 IST|Sakshi
‘కోట’లో మాత్రమే చలామణి!!

అది రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజును జిల్లా. ఆ జిల్లాలో ఓ కుగ్రామం బల్వంతపురా చెలాసి. ఆ గ్రామస్తులంతా కలిసికట్టుగా తమ గ్రామంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. అలా ఇస్తూనే ఉన్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. కానీ గ్రామస్థులు తీవ్రంగా స్పందించారు.

 

తలా ఓ చెయ్యి వేసి స్టేషన్ కట్టేసుకున్నారు. ఇది జరిగి కొన్ని ఏళ్లయింది. ఎవరో వస్తారు... ఏదో చేస్తారు... అని ఎదురు చూడకుండా ప్రభుత్వం చేయకపోతే మనమే చేసుకుందాం అని చేసి చూపించారు. ఇవన్నీ స్ఫూర్తిదాయకమైన కథనాలు. వీరిని చూసి ఉత్తేజం పొందమని చెప్పకుండా చెప్పే కథనాలు. ఇందుకు భిన్నంగా ‘ఇలా మాత్రం చేయకండి’ అని చెప్పే సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోట నగరంలో జరిగింది.
 

 

చిన్న కిరాణా దుకాణం నడపాలంటే, సాయంత్రానికి గల్లాపెట్టె గలగలలాడాలంటే చేతినిండా నాణేలు ఉండాలి. కానీ ఐదు రూపాయల నాణేలు అవసరానికి తగినన్ని అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వం కనీసంగా అవసరమైనన్ని అందించకపోతే ఎలా అని విసుగెత్తిపోయారు. అంతే ఇద్దరు టోకు వ్యాపారులు స్వయంగా నాణేలు ముద్రించేశారు. కోట నగరంలో ఇవి చెలామణిలోకి వచ్చేశాయి. భన్వర్‌లాల్, ఘాసిలాల్ కన్సువాలు గర్గ్ క్యాష్ కౌంటర్ పేరుతో ‘టోకెన్ నంబరు 5’ అనే నాణేలు ముద్రించారు.  
 

 

ఇది చట్టవిరుద్ధం అని తెలిసినా కూడా స్థానికులు పెదవి విప్పడం లేదు. ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు, కాలువలు నిర్మించుకోవచ్చు. కానీ నాణేలను ముద్రించుకోవడం సరికాదు.
 
 

మరిన్ని వార్తలు