బ్రెస్ట్‌క్యాన్సర్‌ వస్తే రొమ్ముతప్పనిసరిగా తొలగించాలా?

6 May, 2019 05:04 IST|Sakshi

ఆంకాలజి కౌన్సెలింగ్స్‌

నా అక్కకు 36 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు త్వరగా ఆపరేషన్‌ చేయించుకొమ్మని సిఫార్సు చేశారు. క్యాన్సర్‌ ఉన్న రొమ్మును పూర్తిగా తొలగించి వేస్తారని, అయినా మళ్లీ మరోచోట క్యాన్సర్‌ వస్తుందేమోనని మా అక్క భయపడుతోంది. రొమ్ముక్యాన్సర్‌ వస్తే... ఆ రొమ్మును తప్పనిసరిగా, పూర్తిగా తొలగించాలా? హార్మోన్ల సమతౌల్యం ఏమైనా దెబ్బతింటుందా? ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఎదురవుతాయా? మళ్లీ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో దయచేసి వివరంగా తెలపండి.

శస్త్రచికిత్స చేసి క్యాన్సర్‌ సోకిన భాగాన్ని తీసివేస్తే మరోసారి క్యాన్సర్‌ రాదని ఖచ్చితంగా చెప్పలేము. ఇందుకు కారణం... ఆపరేషన్‌ చేయడం వల్ల మొత్తం క్యాన్సర్‌ కణాలన్నింటినీ సమూలంగా తొలగించడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ఆపరేషన్‌లో మొత్తం క్యాన్సర్‌ భాగాన్ని సమూలంగా తీసేసినా, మరోసారి క్యాన్సర్‌ కాదని ఖచ్చితంగా చెప్పలేము. రొమ్ము క్యాన్సర్‌ సర్జరీ తర్వాత వ్యాధి సోకిన ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల రేడియేషన్, అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో అదే భాగంలో మరోసారి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించగలుగుతాం.

అయితే శస్త్రచికిత్స జరిగిన తర్వాత కొంతమంది మహిళలకు బ్రెస్ట్, ఒవేరియన్‌ క్యాన్సర్‌ మళ్లీ వచ్చినట్లు గుర్తించారు. కానీ సర్జరీ చేయించుకున్న వ్యక్తి క్యాన్సర్‌ కారణంగా చనిపోయే ప్రమాదం మాత్రం చాలావరకు ఉండకపోవచ్చు. రెండు అండాశయాలను తొలగించిన మహిళల్లో ఒవేరియన్‌ క్యాన్సర్‌ మరణాలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.ఇక బ్రెస్ట్‌క్యాన్సర్‌లో రొమ్మును తొలగించడం పైన ప్రచారంలో ఉన్న అంశాలు చాలావరకు అపోహలూ, అనుమానాలే. క్యాన్సర్‌ సోకిన రొమ్మును పూర్తిగా తొలగించడం అన్నది చాలా అరుదు. రోగనిర్ధారణ పరీక్షలపై ఆధారపడి రొమ్ములో క్యాన్సర్‌ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించడం జరుగుతుంది.

దానివల్ల రొమ్ము ఆకృతి చెడకుండా, ఆపరేషన్‌ చేసిన గీత కనిపించకుండా ఉండేందుకు తొలగించిన భాగంలో, శరీరంలోని మరోచోటి నుంచి కొంతభాగాన్ని తెచ్చి, పార్షియల్‌ ఫిల్లింగ్‌ అనే ప్రక్రియ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. దాంతో శస్త్రచికిత్స తర్వాత కూడా రొమ్ము ఆకృతిలో పెద్దగా మార్పు ఉండదు. రొమ్ము మొత్తాన్ని తీసేయడం అన్న అంశం సహజంగానే మహిళ మనసుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆమె మానసికంగా కుంగుబాటుకు (డిప్రెషన్‌కు) గురయ్యే ప్రమాదం ఉంది.

అందుకే ఇటీవల రొమ్ముపూర్తిగా తొలగించకుండానే చాలావరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.రొమ్ము తొలగించాల్సి రావడం చాలా చాలా అరుదు. అలాగే ఒకవేళ రొమ్ము తొలగించాల్సి వచ్చినా దాని వల్ల  శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలు ఏమాత్రం ప్రభావితం కావు. మీ అక్క భయపడుతున్న పరిణామాలు ఏవీ ఎదురయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆందోళన చెందకుండా మీరు సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించండి. అర్థం లేని అపోహలు వీడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గొంతు దగ్గర గడ్డ... సలహా ఇవ్వండి

నా వయసు 42 ఏళ్లు. నాకు గత ఏడేళ్ల నుంచి హైపోథైరాయిడ్‌ సమస్య ఉంది. దానికి థైరాయిడ్‌ మాత్రలు వాడుతున్నాను. ఈమధ్య గొంతు దగ్గర గడ్డలా కనిపిస్తోందని నా భార్య గమనించింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్‌ చేసి, కణితి ఉందని చెప్పారు. అది క్యాన్సర్‌కు సంబంధించిందని కూడా చెప్పారు. ఈ విషయంలో నాకు తగిన  సలహా ఇవ్వండి.

మీకు హైపోథైరాయిడ్‌ సమస్య ఉందని చెప్పారు. హైపోథైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లకు కొన్నిసార్లు థైరాయిడ్‌లో చిన్న గ్రంథులు ఏర్పడతాయి. కానీ హైపోథైరాయిడ్‌ సమస్య క్యాన్సర్‌కు కారణం కాదు. అల్ట్రాసౌండ్‌ చేస్తే గడ్డ ఉందని చెప్పారని వివరించారు. అలాగే అది క్యాన్సర్‌కు సంబంధించిన కణితిలాగా ఉందని కూడా చెప్పారన్నారు. అల్ట్రాసౌండ్‌ గైడెన్స్‌లో ఆ కణితి నుంచి ఒక ఎఫ్‌ఎన్‌ఏసీ పరీక్ష చేయించాలి.ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్‌ అని నిర్ధారణ అయితే తప్పనిసరిగా ఆపరేషన్‌ చేయించుకోవాలి.

థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తీసేయాలి. అలాగే శ్వాసనాళం/శ్వాసగొట్టం (ట్రాకియా/బ్రీతింగ్‌ పైప్‌) పైన, పక్కన ఉన్న ఊపిరితిత్తుల నాడ్యూల్స్‌ కూడా తీసేయాలి. అల్ట్రాసౌండ్‌లో మెడలో కూడా ఏమైనా కణుతులు ఉన్నాయా అని చెక్‌ చేసుకోవాలి. ఒకవేళ ఎఫ్‌ఎన్‌ఏసీలో సందేహాస్పదం (డౌట్‌ఫుల్‌) అని రిపోర్టు వస్తే ఆపరేషన్‌ చేసి, ఆ సమయంలో ఫ్రోజెన్‌ సెక్షన్‌ను ఉపయోగించుకొని, ఆ కణితి తాలూకు అసలు రిపోర్ట్‌ తెలుసుకోవాల్సి ఉంటుంది.

మూడు నెలలుగా రక్తంతో కూడిన విరేచనాలు... ఇదేం సమస్య?

మా నాన్నగారి వయసు 67 ఏళ్లు. గత మూడునాలుగు నెలల నుంచి నీళ్ల విరేచనాలు (లూజ్‌ మోషన్స్‌) అవుతున్నాయి. విరేచనం సమయంలో రక్తం కూడా పడుతోంది. కడుపునొప్పి కూడా ఎక్కువగా వస్తోందని అంటున్నారు. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు. ఏది తిన్నా వాంతి అవుతుందంటున్నారు. ఇది ఎలాంటి సమస్య?

మీరు చెప్పిన లక్షణాలను విశ్లేషిస్తే అవి పెద్దపేగు సమస్యగా అనిపిస్తోంది. ఈ వయసులో ఇలాంటి రక్తంలో కూడిన లూజ్‌మోషన్స్‌ (విరేచనాలు) అవుతుంటే, పెద్దపేగు కింది భాగంలో ఉన్న సిగ్మాయిడ్‌ కోలన్‌ లేదా రెక్టమ్‌ (మోషన్‌పైప్‌) పైభాగంలో ట్యూమర్‌/కణితి ఉండే అవకాశం ఉంది. ఈ భాగంలో క్యాన్సర్‌ ఉన్నవారిలో ఆకలి తగ్గుతూ అజీర్ణం, రక్తంతో కూడిన మోషన్స్, కొన్ని రోజులు మలబద్దకం/కొన్ని రోజులు ఎక్కువసార్లు మోషన్‌కు వెళ్లడం, అలాగే మోషన్‌కు వెళ్లినప్పుడు మల విసర్జన పూర్తిగా జరగలేదని అనిపించి, మళ్లీ తిరిగి వెంటనే వెళ్లడం కూడా జరుగుతుంటుంది.

వీటితో పాటు అజీర్ణం, బరువు తగ్గడం, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రోంటరాలజిస్ట్‌ను సంప్రదించి, కొలొనోస్కోకపీ అనే పరీక్ష చేయించుకోండి. దీని ద్వారా పెద్దపేగు లోపలి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలవుతుంది. అలాగే ఏదైనా అల్సర్స్‌ ఉంటే వెంటనే బయాప్సీ తీస్తారు. కొలొనోస్కోపీతో పాటు ఒక అబ్డామిన్‌ స్కాన్‌ పరీక్ష కూడా చేయించుకోవడం మంచది. ఇవి పైల్స్‌ కావచ్చేమో అంటూ మీరు అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు.

డాక్టర్‌ కె. శ్రీకాంత్,సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్‌ సోమాజిగూడ, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు