వైతాళికుల ప్రస్థానం ఎటు?

4 Feb, 2019 00:34 IST|Sakshi
ముద్దుకృష్ణ

అభిప్రాయం

జాతీయ పోరాట స్ఫూర్తి సంకలనంగా తెలుగు సాహిత్యంలో నిలబడే బంగారు అవకాశం ఉండి కూడా, ఎదగని  సంకలనం ‘వైతాళికులు’.

ఒక సంకలనం చేసేటప్పుడు సంకలనకర్త దృక్పథం కీలకం. ఇప్పటికి పన్నెండు ముద్రణలు పొందిన వైతాళికులు,  ముద్దుకృష్ణ సంకలనకర్తగా 1935లో వచ్చింది. ముగ్గురు స్త్రీలతో సహా,  29 మంది కవుల 191 కవితలున్నాయిందులో. సంకలిత కవితల కాలం 1910 నుంచి 1934 వరకూ ఇరవై నాలుగేళ్ళు. తొలి కవిత రాయప్రోలు సుబ్బారావుది, రెండోది గురజాడది, ఆఖరుది శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’.
  
వైతాళికులు అంటే  ‘మేలుకొలుపువారు’ అని నిఘంటు అర్థం. ఏ యుగానికి, ఏ శకానికి ఇది కవితల మేలుకొలుపు? ఆ వైతాళిక కవులెవరు అన్న పరిశీలనాయుత ప్రశ్నలతో ఈ 84 ఏళ్ల సంకలనాన్ని చూడాలి. ఏ సంకలనమైనా, సమకాలాన్ని ప్రతిఫలించే సమదర్శన ధర్మంతో ఉండటం తప్పనిసరి. అదే సంకలన స్థాయిని సూచిస్తుంది. 1910 –35 దేశం మొత్తంలోనే గాంధీ నడుపుతున్న స్వాతంత్య్రోద్యమ కాలం కనుక అప్పటి తెలుగు సంఘ స్థితిగతులకు అద్దంగా ఉందా ఈ సంకలనం? భిన్నభాషల్లో, ఉపఖండం నలుమూలలా జాతీయోద్యమ  సాహిత్యం ముమ్మరంగా వస్తున్న రోజులవి. చంపారన్‌ రైతు సమస్యలలో గాంధీజీ విజయాలు, జలియన్‌ వాలా బాగ్, 1920లో తిలక్‌ కన్ను మూశాక, కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమం, తెలుగునాట కూడా బావుటా ఎగురవేస్తూన్న ఒక దశాబ్దన్నర కాలపు కవిత్వ సృజన 1935 నాటికి సంకలనకర్త ఎదుట ఉన్నది.  స్వాతంత్య్ర సముపార్జన, సాంఘిక సంస్కరణ లేదా పునర్నిర్మాణ శంఖారావాలు తెలుగు సమాజంలో  ఘూర్ణిల్లుతున్నాయి. 

1919లో మదరాసులో మొదలైన సాహితీసమితిలో తల్లావఝల శివశంకర శాస్త్రి సభాపతి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, ముద్దుకృష్ణ, తదితరులు ఇందులో ఉన్నారు. ప్రజల్లో ఉన్న స్వాతంత్య్రోద్యమ భావావేశాలు, కవుల్లో ఉన్న రచనాగరిమ బాగా తెలిసిన వీరు, వీరి మిత్రపుంగవులు ధార్మికావేశం, జాతి ఔన్నత్య భావనలు, భావకవిత్వోద్రేకం, ప్రణయభావ సంభరితం అయిన కవితలు రాసేవారు. ఆ కారణంగా ముద్దుకృష్ణ ఈ  సంకలనం చేస్తున్నప్పుడు, ఇటువంటి కవితలన్నీ అందులో చేరాయి. 1935 – 36 దాకా ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సభలు లండన్, లక్నోలలో జరుగలేదు. తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం 1942 దాకా ఏర్పడలేదు. అలా ఇరవయ్యో శతాబ్దంలో బహుశా తొలి తెలుగు కవితా సంకలనంగా ‘వైతాళికులు’ ఎంత విశాల బాధ్యత  నిర్వర్తించింది? 1935లో విజయవాడ నుంచి తాను రాసిన మూడు పేజీల ముందుమాటలో, ‘నవయుగం’ అంటూ ఆఖరి మూడు పేరాలలో గాంధీ పేరు ఒక్కసారి ప్రస్తావించారు ముద్దుకృష్ణ. దేశ స్వేచ్ఛ కోసం తెలుగు కవులు రాసిన కవితలు సంకలనంలో ఒక్కటైనా ఉండవు. దువ్వూరి రామిరెడ్డి ‘స్వాతంత్య్ర రథం’ అసలు నేల మీదికే  రాకుండా అసంతృప్తినే కలిగిస్తుంది. 

జాతీయ పోరాట స్ఫూర్తి సంకలనంగా తెలుగు సాహిత్యంలో నిలబడే బంగారు అవకాశం ఉండి కూడా, ఎదగని  సంకలనం ‘వైతాళికులు’. అంటరానితనంపై పోరాటం, స్త్రీ విద్య, బ్రిటిష్‌ పాలన లోపాలను విమర్శించే కవితలు, పాటల కవులు మంగిపూడి వెంకట శర్మ, గుర్రం జాషువా, శ్రీరంగం నారాయణబాబు ఎవరూ కనిపించరు. వేసిన కవుల కవితలే వేస్తూ, ఏకంగా కృష్ణశాస్త్రి ఇరవై కవితలు వేశారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్నే పక్కన పెట్టిన అసంగత సంకలనం ఇది. 

‘గాంధీజీ 150’ దేశదేశాల్లో జరుగుతున్న సందర్భంలో ఉన్నాము. ఇందులోని 191 కవితల్లో, గరిమెళ్ళ ‘మాకొద్దీ  తెల్లదొరతనం’, బసవరాజు అప్పారావు ‘కొల్లాయిగట్టితేనేమి’, 1930 ఉప్పు సత్యాగ్రహం తరువాతి త్రిపురనేని రామస్వామి గీతం ‘వీరగంధము తెచ్చినారము’ వేటికీ ఇందులో చోటు లేదు. 

తన భావ కవిత్వ ఖండికలు వేసి,  ఉప్పు సత్యాగ్రహం సమయంలో బసవరాజు అప్పారావు రాసిన ‘స్వరాజ్యలక్ష్మి పెండ్లి’ (సంద్రమే పెళ్లిల్లంట, సదస్యులే దేవతలంట, ఉప్పే తలంబ్రాలంట స్వరాజ్య లక్ష్మి పెండ్లికి) కూడా విడిచిపెట్టారు. ఇలా  ‘వైతాళికులు’ నవయుగాన్ని పట్టించుకోలేదు. కేవలం భావ కవిత్వ ఉదాహరణగా మిగిలిపోయింది. ‘వైతాళికులు’ అని పేరు పెట్టకున్నా, ముందుమాటలో సాహిత్యంలో నవయుగ ప్రస్తావనలు చేయకున్నా, ముద్దుకృష్ణకు ఈ అపఖ్యాతి మిగిలేది కాదు. 
-రామతీర్థ

మరిన్ని వార్తలు