హోటల్ రంగం వారికి... అవకాశాలు ఎక్కువే!

5 Mar, 2015 23:48 IST|Sakshi
హోటల్ రంగం వారికి... అవకాశాలు ఎక్కువే!

మేం అమెరికాలో ఉండేవాళ్లం. అయితే అక్టోబర్ 2014లో నా భర్త నన్ను, సంవత్సరం వయసున్న మా పాపతో పాటు ఇండియా పంపించేశారు. ఆయన వస్తానన్నారు కానీ రాలేదు. నిజానికి ఆయన నన్ను చాలా హింసించేవారు. ఓసారి నన్ను తీవ్రంగా కొడితే నేను కంప్లయింట్ కూడా ఇచ్చాను. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలేదు కానీ మూడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండమని చెప్పారు. ఆ గ్యాప్‌లో మారినట్టు కనిపించడంతో నేను తనని నమ్మాను. పాపను తీసుకుని ఇండియా వెళ్లు, నేను వెనకే వస్తానని చెప్పి పంపించాడు. కానీ రాలేదు. మాకు రిటర్న్ టిక్కెట్స్ పంపమని అడిగితే పంపకుండా, విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో తన తండ్రి ద్వారా విడాకుల పిటిషన్ వేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? అమెరికా వెళ్లి తన మీద కేసు పెట్టమంటారా?
- ఓ బాధితురాలు, విజయవాడ

ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధనిపిస్తుంది. అమాయకంగా భర్తను నమ్మేసి, తను వెనకే వస్తాడులే అని వెళ్లిపోయి, ఇలా తర్వాత అష్టకష్టాలు పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీరూ వాళ్లలో ఒకరు కావడం నిజంగా దురదృష్టకరం. మీరు ఒక పని చేయండి. మీ కేసు ఎలాగూ ఇండియాలో ఫైల్ చేశారు కాబట్టి... మీరు ముందు అక్కడ ఎవరైనా మంచి న్యాయవాదితో మాట్లాడండి. కేసును అమెరికాలో కంటిన్యూ చేయాలి అనుకుంటే... ఆ దేశంలో ఉన్న ఎవరైనా న్యాయవాదిని సంప్రదించి, ఆయనకు కేసు అప్పగించమని చెప్పండి. అమెరికన్ కాన్సులేట్‌కి వెళ్లి, వీసా తీసుకోండి. అయితే అమెరికాలో ఉన్న న్యాయవాది సలహా తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి.
    
నేనొక చెఫ్‌ని. పన్నెండేళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సౌదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాను. నాకు అమెరికాలో పని చేయాలని ఆశగా ఉంది. వీసా ఎలా పొందాలో తెలియజేయండి.
 - అమర్, రియాద్

 హోటల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి అమెరికాలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పని చేయాలంటే ముందు మీకు ఎవరైనా ఎంప్లాయర్ ఉండాలి. వాళ్లు మీకు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మొదట చేయాల్సింది... అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుని ఉద్యోగానికి అప్లై చేయడం. ఒక్కసారి ఉద్యోగం దొరికిందంటే ఆ సంస్థ వారే న్యాయవాది ద్వారా మీకు వీసా ఇప్పిస్తారు.
 
మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా...
గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్,
హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com
 
 లక్ష్మీ దేవినేని, చైర్‌పర్సన్,
‘తానా’ ఇమిగ్రేషన్ కమిటీ
 

మరిన్ని వార్తలు