సేంద్రియ లాభాల కో(క్కొరో)కో!

25 Dec, 2018 05:51 IST|Sakshi
కోనసీమలో కోకో తోటలు తొలగిస్తున్న రైతులు

రసాయనిక సేద్యంలో పెట్టుబడులు రాక కోకో చెట్లు తొలగిస్తున్న రైతులు

పెట్టుబడులు భారీగా తగ్గించుకొని లాభాలు ఆర్జిస్తున్న సేంద్రియ రైతులు

‘సాగు గిట్టుబాటు కావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. దీర్ఘకాలిక పంటే అయినా సాగు చేస్తూ నష్టాలు చవిచూడలేము. దీనికన్నా కోకో తోటలను తొలగించుకోవడమే మేలు’ ఇది కోనసీమలో రసాయనిక వ్యవసాయం చేసే కోకో రైతుల ఆవేదన. అయితే, సేంద్రియ పద్ధతులు పాటించే రైతులు ఖర్చులు భారీగా తగ్గించుకొని లాభాల బాటలో సాగుతున్నారు.

కొబ్బరి సాగులో కోకో ప్రధాన అంతర పంట. కొబ్బరితోపాటు ఆయిల్‌ పామ్‌ తోటల్లో సైతం దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వేలాది ఎకరాల్లో కోకో సాగు జరుగుతున్నది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కోకో సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులను ఆదుకున్నది కోకో పంటే. కోకో ఆదాయంపైనే కొబ్బరి రైతులు ఆధారపడిన సందర్భాలూ లేకపోలేదు. అటువంటిది పెట్టుబడులు పెరగటం, పెట్టుబడులకు తగిన ఆదాయం రాక కోనసీమలో పలువురు రైతులు కోకో తోటలను తొలగిస్తున్నారు. గడిచిన ఒకటి, రెండు నెలల్లో పలువురు రైతులు అరటి తోటల్లో కోకో చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఇందుకు వారు చెప్పే కారణాలివి.. ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరగడం, తగిన దిగుబడి రాకపోవడం, కోకో గింజలకు కనీస ధర రాకపోవడం.

సేంద్రియ సాగు పద్ధతే శ్రేయోదాయకం
ఇటువంటి సమయంలో పెట్టుబడులు తగ్గించుకునేందుకు సేంద్రియ సాగు విధానం మేలు అని ఉద్యానశాఖాధికారులు, శాస్త్రవత్తేలు, ఈ విధానంలో సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో భూసారం పెంచుకునేందుకు జీవామృతం, వేస్ట్‌ డీ కంపోజర్, పంచగవ్య వంటి ద్రవరూప ఎరువులను వినియోగించడం, డ్రిప్‌ వాడకంతో పెట్టుబడులు మూడొంతులు తగ్గుతున్నాయని సేంద్రియ రైతులు చెబుతున్నారు.

 రూ. 13 వేలకు తగ్గిన పెట్టుబడి
రసాయన పద్ధతుల్లో సాగు చేసే రైతులకు ఎకరాకు ఏడాదికి  రూ.70 వేల వరకు ఖర్చవుతుండగా, సేంద్రియ విధానంలో సాగు చేస్తే రూ.13 వేలు ఖర్చవుతుండటం విశేషం. పెట్టుబడులు తగ్గించుకోవడం ద్వారా సేంద్రియ  రైతులు ఎకరాకు రూ.43,540 వరకు లాభాలు పొందుతుంటే.. రసాయన, సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు ఎకరాకు రూ. 6,150 మేరకు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.


తక్కువ ఖర్చు, లాభసాటి ధర
సేంద్రియ సాగు వల్ల రసాయనిక సేద్యం కన్నా ఏ విధంగా చూసినా మేలే. తొలి రెండేళ్లు సెమీ ఆర్గానిక్‌ అంటే 60:40, 40:60 పద్ధతుల్లో సాగు చేశాను. గడచిన రెండేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాను. దీని వల్ల స్వల్పంగా దిగుబడి తగ్గినా.. పెట్టుబడులు సగానికి పైగా తగ్గాయి. డ్రిప్‌ వల్ల కూలీల ఖర్చును కూడా బాగా తగ్గించగలిగాను. సేంద్రియ విధానంలో సాగు చేస్తేనే లాభసాటి ధర వస్తోంది.
– వంకాయల స్వామిప్రకాష్‌ (98663 55165), ఆదర్శ రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం, తూ.గో. జిల్లా


  సేంద్రియ విధానంలో డ్రిప్‌ పెట్టిన కోకోతోట

– ఎన్‌. సతీష్, సాక్షి, అమలాపురం

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా