సేంద్రియ మల్బరీతో లాభాల పట్టు!

4 Sep, 2018 05:29 IST|Sakshi
పట్టుగూళ్లతో సైదులు , సేంద్రియ మల్బరీ తోట పట్టు పురుగుల పెంపకం

కాంట్రాక్టు ఉద్యోగం వదిలి మల్బరీ సాగు వైపు దృష్టి

నాలుగు ఎకరాల్లో ఏటా రూ. 5 లక్షల నికరాదాయం

ఎదుగూ బొదుగూ లేని కాంట్రాక్టు ఉద్యోగం కన్నా.. లోతైన అవగాహనతో సేంద్రియ సేద్యం చేయటమే ఉత్తమమం. అందులోనూ సాధారణ పంటల కన్నా నెల నెలా ఆదాయాన్నిచ్చే సేంద్రియ మల్బరీ సాగే మేలని ఓ యువ రైతు రుజువు చేశారు. అంతేకాదు, ఉత్తమ రైతుగా పురస్కారాన్ని అందుకోవటం విశేషం. ఆదర్శ రైతు స్ఫూర్తిదాయక గాథ ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.  

మామిడి సైదులు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో సేంద్రియ మల్బరీ సాగు చేసుకుంటూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాలకు చెందిన సైదులు.. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సెరికల్చర్‌ విభాగంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌(కాంట్రాక్టు ఉద్యోగి)గా ఆరేళ్లు పనిచేశాడు. ఉద్యోగం పర్మినెంట్‌ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో 2006లో ఉద్యోగం మానేసి మల్బరీ రైతుగా మారారు.

నల్లగొండ పట్టు పరిశ్రమ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారం, సలహాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రిప్‌ ద్వారా తక్కువ నీటితో నాలుగు ఎకరాల మల్బరీ తోట సాగు చేస్తున్నారు. ఆకు నాణ్యత కోసం వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు వాడుతున్నారు. సంవత్సరానికి కనీసం 7 పంటలు తీస్తున్నారు. 300 గుడ్లు చాకీ చేసి 45 రోజుల్లో ఒక పంట తీస్తున్నారు. పంటకు అన్ని ఖర్చులూ పోను రూ.75 వేల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా నికరాదాయం పొందుతున్నారు. వీలైనంత వరకు పనులన్నీ భార్య భర్త ఇద్దరే చేసుకుంటారు. పంట చివరి 7 రోజుల్లో మాత్రం నలుగురు కూలీల సహాయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో పలువురు రైతులు పట్టు శాఖ అధికారుల తోడ్పాటుతో సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు.

పట్టు గూళ్ల ఉత్పత్తే లక్ష్యంగా..
గతంలో జిల్లాలో మల్బరీ రైతులు పట్టు పురుగులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పట్టు గుడ్లను ఉత్పత్తి చేసేవారు. దీనివలన రైతుకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. సైదులు పట్టు పురుగుల ఉత్పత్తి కోసం తన ఇంటి ఆవరణలో ఒక షెడ్‌ ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని టెక్నికల్‌ సర్వీస్‌ సెంటర్‌ సరఫరా చేస్తున్న పట్టు గుడ్లను తీసుకొచ్చి ట్రేలలో గుడ్లను పెట్టి, నల్లటి గుడ్డ కప్పి, గుడ్లు పగిలే దశలో వాటిని బయటకు తీస్తారు. మల్బరీ ఆకును చాకింగ్‌ మిషన్‌ ద్వారా కట్‌ చేసి శైశవ దశలో పురుగులకు మేతగా వేసి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల రైతులకు విక్రయించడం ద్వారా సైదులు అధిక లాభాలు గడిస్తున్నారు.  

సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన అధికారి కృష్ణవేణి తెలిపారు. మల్బరీ రైతులకు షెడ్‌ నిర్మాణానికి, డ్రిప్‌కు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల అధికారులను సంప్రదించవచ్చన్నారు.
– చవగాని నాగరాజుగౌడ్, సాక్షి, పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా

పట్టు పురుగుల విక్రయంతో అధిక లాభాలు
గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో లాభసాటిగా మల్బరీ సాగు చేస్తున్నాను. గుడ్లను తీసుకొచ్చి ఇంటి దగ్గరే పట్టు పురుగులు పెంచుతున్నాను. ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాను.
– మామిడి సైదులు (99599 33842), మల్బరీ రైతు, లింగాల, సూర్యాపేట జిల్లా
 

మరిన్ని వార్తలు