మనసు దోచిన మహానటి 

11 Feb, 2019 01:35 IST|Sakshi

ఆర్గానిక్‌ మేళా

ఆర్తి డెహ్రాడూన్‌ నుంచి వచ్చింది. మృగాక్షిది హిమాచల్‌ ప్రదేశ్‌. అరుణా చద్దా మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చారు. రేఖాశర్మ ఉత్తరాఖండ్‌ మహిళ. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నుంచి ఓల్గా, ఇంకా.. గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కశ్మీర్, తమిళనాడు, కేరళల నుంచి వచ్చిన మహిళలు శిల్పారామంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించి, నిన్ననే.. తమ రాష్ట్రాలకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. వీళ్లందరూ జీవితంలో ఎదగాలనే తపన ఉన్న వాళ్లు మాత్రమే కాదు.. కష్టపడితే కొత్త అభివృద్ధి పథాన్ని నిర్మించడం సాధ్యమేనని నిరూపించాలనే కృత నిశ్చయం కలిగిన మహిళలు.  ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం కంటే.. చాలెంజింగ్‌గా ఉండే పరిశ్రమల రంగంలో విజయం సాధించడమే అసలైన గెలుపు అన్నది కంప్యూటర్‌ కోర్సు చేసిన మృగాక్షి భావన.

ఆమె కేవలం హెయిర్‌ ఆయిల్స్‌ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌ అడవుల్లోని ఔషధ వృక్షాల నుంచి ఆకులు, బెరళ్లు, వేర్లను సేకరించి, నువ్వుల నూనెలో మగ్గపెట్టి హెయిర్‌ ఆయిల్స్‌ చేస్తుంది. ఈ పరిశ్రమ కోసం ఆమె హెర్బల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు కూడా చేసింది. ఆర్తి 1990లో డెహ్రాడూన్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ స్థాపించింది. ఈ సంస్థ  కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన 3,800 మంది రైతులతో అనుసంధానమై ఉంది. వాళ్లు సేకరించిన ముడిసరుకుతో కాస్మొటిక్‌ ప్రోడక్ట్స్‌తోపాటు ఔషధతైలాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే చ్యవన్‌ప్రాశ్‌ వంటి మందులను  తయారు చేస్తోందామె.

తమ ఉత్పత్తులను తేజస్విని బ్రాండ్‌నేమ్‌తో ఎగ్జిబిషన్‌లో నేరుగా తానే ప్రదర్శించడంతోపాటు ఆన్‌లైన్‌లో మార్కెట్‌ చేస్తోంది ఆర్తి.ఇక ఉత్తరాఖండ్‌లోని, అల్మోరా కేంద్రంగా పని చేస్తున్న రేఖాశర్మ తన యూనిట్‌ని మహిళలతోనే నడిపిస్తోంది. హ్యాండ్‌మేడ్‌ సోప్‌ తయారు చేయడం అంటే ఒక యజ్ఞం వంటిదనీ, సబ్బు తయారీకి మూడు నెలలు పడుతుందని చెప్పింది రేఖ. ‘‘అరోమా ఆయిల్, ఇతర ముడిసరుకులను కలిపి ఆ మిశ్రమాన్ని చెక్క మూసలో పోస్తారు. ఆ మూసలను కదిలించకూడదు. నెల రోజులకు తేమ ఆరిపోయి మిశ్రమం ద్రవ రూపం నుంచి కొద్దిగా గట్టి పడుతుంది. మరో రెండు నెలలకు తేమ పూర్తిగా ఆవిరై పోతుంది.

అప్పుడు మూసల్లో నుంచి సబ్బును వేరు చేస్తాం. మిశ్రమం త్వరగా ఆరాలనే తొందరలో మూసలను ఎండకు ఆరబెడితే తేమతోపాటు మిశ్రమంలోని సుగంధం ఆవిరైపోతుంది. నీడలో ఆరబెట్టినప్పుడే సబ్బులో పూల రెక్కల పరిమళం నిలుస్తుంది’’ అని వివరంగా చెప్పింది రేఖ.అరుణ అయితే.. తమ ఉత్పత్తులను కొనమని ఎవ్వరినీ బలవంతం చేయడం లేదు. వచ్చిన వాళ్లందరికీ స్పూన్‌తో తీపి వంటలను రుచి చూపిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయిన తర్వాత మధ్యప్రదేశ్, మాండ్లాలో స్థానిక గిరిజనుల కోసం ఆమె ఒక కో ఆపరేటివ్‌ సొసైటీ స్థాపించారు. ఐదు వేల మంది గిరిజనులకు ముడిసరుకు ఇచ్చి వ్యవసాయం చేయిస్తారు. వారి ఉత్పత్తులను తిరిగి సొసైటీ కొంటుంది. ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చి, వారి చేతనే తయారు చేయిస్తారు. మాండ్లా ఆర్గానిక్‌ పేరుతో మార్కెట్‌ చేస్తారు.

అరుణ నిర్వహిస్తున్న కో ఆపరేటివ్‌ సొసైటీలో ఐదు వేల మంది గిరిజనులు మమేకమై ఉన్నారు.పరిశ్రమ నిర్వహించడం ఒక ఎత్తు. అది మెళకువతో కూడిన పని. ఉత్పత్తులను ప్రదర్శించడం మరో ఎత్తు. అది నైపుణ్యంతో కూడిన పని.  రేఖాశర్మ, ఆర్తి, మృగాక్షితోపాటు ఆ మేళాలో పాల్గొన్న మహిళలందరిలోనూ ఆ మెళకువ, నైపుణ్యం కనిపించాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ఫెస్టివల్‌లో జ్యూట్‌ బ్యాగ్‌ స్టాల్‌ కూడా ఉంది. జ్యూట్‌ బ్యాగ్‌ల మీద మహానటి సావిత్రి ఫొటో ముద్రించి ఉంది. ఫెస్టివల్‌ను చూడడానికి వచ్చిన మహిళలు ఆ స్టాల్‌ దగ్గర గుమిగూడి పోయారు. సావిత్రిని నేరుగా చూసినంత మురిపెంగా ఆ బ్యాగ్‌లను చేతుల్లోకి తీసుకున్నారు.

కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ– తెలంగాణ రాష్ట్ర మహిళశిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు ‘ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా– ఆర్గానిక్‌ ఫెస్టివల్‌’ జరిగింది. హైదరాబాద్, శిల్పారామంలోని సంప్రదాయ వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ ఆర్గానిక్‌ మేళాలో దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. తొంభైకి పైగా స్టాళ్లలో వెయ్యి రకాలకు పైగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రదర్శించారు. రసాయనాలు దేహానికి హాని చేస్తాయని, ఆ హాని నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగిన ఏకైక మార్గం సేంద్రియ ఉత్పత్తుల వాడకమేనని చెప్పింది ‘ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా– ఆర్గానిక్‌ఫెస్టివల్‌. 

మరిన్ని వార్తలు