సోషల్ సునామీలో...ఆర్కుట్ గల్లంతు..!

16 Aug, 2013 23:42 IST|Sakshi
సోషల్ సునామీలో...ఆర్కుట్ గల్లంతు..!

ఆర్కుట్.. ఈ పేరు వింటే ఒక పాతస్నేహితుడిని గుర్తు చేసుకున్న ఫీలింగ్... మనదేశంలో వ్యాపించిన తొలి సోషల్‌నెట్‌వర్కింగ్ సుగంధమిది. హద్దులు తెలిసిన స్నేహానికి, అంతులేని ఆనందానికి వేదిక అది. అయితే ఇప్పుడు ఆర్కుట్‌కు అంజలి  ఘటించాల్సిన సమయం వచ్చింది. ఒకనాడు నెటిజన్లు తీరిక లేకుండా గడిపిన సైట్‌కు ఇప్పుడు ట్రిబ్యూట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈ విధంగానైనా... మనకూ ఒక ఆర్కుట్ అకౌంట్ ఉంది అని గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్‌నెట్‌వర్కింగ్ సామ్రాజ్యంలో ఆర్కుట్ పతనావస్థ గురించి... ఇతర సైట్ల పోరాటాల గురించి...
 
 సోషల్‌నెట్‌వర్కింగ్ విషయంలో ఎక్కువ మంది భారతీయులు ఓనమాలు దిద్దుకుంది ఆర్కుట్‌లోనే. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పండితులుగా మారిన చాలా మంది సోషల్‌నెట్‌వర్కింగ్‌స్టడీస్‌ను ప్రారంభించింది ఆర్కుట్‌లోనే. మరి ఇప్పుడు ఆర్కుట్ ఎవరికీ పట్టనిది అయ్యింది. అరుదుగా కూడా అందులోకి లాగిన్ అయ్యేవారు కనపడటం లేదు. సోషల్‌నెట్‌వర్కింగ్ సామ్రాజ్యానికి ఫేస్‌బుక్ సోలో రాజుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్కుట్ ఔట్‌డేటెడ్ అనిపించుకుంటోంది. మరి ఆర్కుట్ ఎందుకు ఔట్‌డేటెడ్ అయ్యింది. ఎందుకు పోటీలో లేకుండా పోయింది?
 
 అలనాటి వైభవం...
 గూగుల్ మానస పుత్రిక ఆర్కుట్..2004లో ప్రారంభమైంది. 2006 నుంచి ఇండియాలో పాగా వేసింది. అప్పటికే కొన్ని సోషల్‌నెట్‌వర్కింగ్‌సైట్లు ఉన్నప్పటికీ,  పాశ్చాత్య దేశాలయూత్‌కు ఫేస్‌బుక్ ఫీవర్ చే సినప్పటికీ.. మన దేశంలో మాత్రం ఆర్కుట్ దూసుకు వెళ్లింది. జీమెయిల్ అకౌంట్ ఉన్న వారికి ఒకే క్లిక్‌తో ఆర్కుట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇంకే ముంది.. ఫ్రెండ్షిప్‌లు, స్క్రాప్స్, వీడియోలు, విషెష్‌లు, కమ్యూనిటీలు, చాటింగ్‌లు... ఇవన్నీ ఆర్కుట్ అందించిన అద్భుతమైన సదుపాయాలు! క్లాస్‌రూమ్ స్నేహాలను మించి ఆకట్టుకున్నాయి ఆర్కుట్  చాట్‌రూమ్ స్నేహాలు. సరదా చాటింగ్‌కు ఆర్కుట్ ఒక అద్భుతమైన మార్గంగా కనిపించింది. ఇక ఆర్కుట్‌లో అదుర్స్ అనిపించిన ఫీచర్లలో ‘కమ్యూనిటీ’లు ముఖ్యమైనవి. అభిరుచులకు అనుగుణంగా కొన్ని వేలమంది ఈ కమ్యూనిటీస్‌లో సభ్యులుగా చేరేవారు.  అభిప్రాయాలను పంచుకునే వారు.   కొన్ని లక్షలమంది సభ్యులుగా కలిగిన కమ్యూనిటీలు కూడా ఉన్నాయి.
 
 నేడు నో అప్‌డేట్స్..!
 ఒకనాడు వేలాదిమందితో అలరారిన ఆర్కుట్ చాట్ రూమ్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కమ్యూనిటీల్లో కదలిక లేదు. కొత్తగా చేరేవారు లేరు. కొత్త పోస్టులు లేవు, కొత్త ఫ్రెండ్షిప్‌రిక్వెస్ట్‌లు లేవు. వీడియో షేరింగ్ లేదు, విషెష్ చెప్పే వారూ లేరు.  గూగుల్ తన హోమ్‌పేజ్ నుంచి ఆర్కుట్ లింక్‌ను తప్పించేసేంత వరకూ వచ్చింది వ్యవహారం! ఒకప్పుడు గూగుల్ హోమ్‌పేజ్ నుంచి ఒకే క్లిక్‌తో ఆర్కుట్‌లోకి సైన్ ఇన్ అయ్యే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు గూగుల్ డ్రైవ్, ఇమేజెస్, యూట్యూబ్, గూగుల్‌ప్లస్, మ్యాప్స్, ప్లే.. వంటి తన సేవలను హోమ్ పేజ్‌లో డిస్‌ప్లే చేసిన గూగుల్ ఆర్కుట్‌ను వెనక్కు నెట్టేసింది! క్రేజ్ తగ్గిపోతున్న తన సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్‌ను మరింతగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయాల్సిన గూగుల్ ఆర్కుట్ ప్రాణాన్ని స్వహస్తాలతోనే ఎందుకు తీస్తోందోనని ఆర్కుట్‌ను అమితంగా అభిమానించే ఫ్యాన్స్ లోని సందేహం!
 
 ఫేస్‌బుక్‌తోనే పెద్ద ప్రమాదం...
 2010 వరకూ ఇండియాలో ఆర్కుట్‌కు తిరుగేలేదు. అయితే ఫేస్‌బుక్ అందుబాటులోకి రావడంతోటే పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆర్కుట్ కన్నా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ యాడ్ అవ్వడం చాలా సులభతరంగా కనిపించింది!  ఫేస్‌బుక్ ఫీచర్స్‌లో ఆర్కుట్ కన్నా డెవలప్‌మెంట్ కనిపించింది. ఇది కాక ఆర్కుట్‌లో 50 మంది కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరం టైమ్ పట్టేది. అయితే ఫేస్‌బుక్‌లో ఆ పని మీద ఉండాలి కానీ.. స్నేహితులను యాడ్ చేసుకోవడం పెద్ద విషయం కానే కాదు! కాబట్టి ఆర్కుట్ కన్నా ఫేస్‌బుక్ అద్భుతమనిపిస్తోంది! అందుకే నెట్ ఫ్లోటింగ్ ఆర్కుట్ నుంచి ఫేస్‌బుక్ వైపుకు మళ్లింది!
 
 ఇక అంతమైనట్టేనా?
 దాదాపుగా... అంతమైనట్టే! ఆర్కుట్‌ను మెయింటెయిన్ చేయడానికి కొత్త సెర్వర్లను ఏర్పాటు చేయడం ఎప్పుడో ఆపేసింది గూగుల్. ఆర్కుట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఆపేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఏ సైట్‌లో లేని ఒక సదుపాయం ఆర్కుట్‌లోనే ఉండేది. ‘ఇటీవలి కాలంలో మీ పేజ్‌ను విజిట్ చేసిన వారు..’ అని రీసెంట్ విజిటర్స్ లిస్టును ఇచ్చేది ఆర్కుట్. అయితే కొంతకాలంగా ఈ ఫీచర్‌ను కూడా ఆపేసింది. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆర్కుట్‌లోకి లాగిన్ అయితే.. రీసెంట్ విజిటర్స్‌లో ఏడాది కిందటి లిస్టు కనిపిస్తుంది తప్ప...ఆ లిస్టులో రీఫ్రెష్‌కు అవకాశమే లేకుండా పోయింది. దీన్నిబట్టి ఆర్కుట్ సర్వర్లు దాదాపు స్ట్రక్ అయిపోయాయని అనుకోవచ్చు.  
 - జీవన్ రెడ్డి.బి
 
 గూగుల్ నిర్లక్ష్యమే ఎక్కువ!
 వస్తూ వస్తూనే ఎఫ్‌బీ ఆర్కుట్‌ను ఛిద్రం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్కుట్‌లో కొత్త సదుపాయాలను తీసుకురాకుండా గూగుల్ సంస్థ ‘గూగుల్‌ప్లస్’ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ‘సర్కిల్స్’ పేరుతో ఫ్రెండ్స్‌ను యాడ్ చేస్తూ సందడి చేయడానికి యత్నించింది. అయితే.. గూగుల్ ప్లస్ ఫేస్‌బుక్‌కు ఏ విధంగానూ పోటీ కాకుండా పోయింది. జీమెయిల్, బ్లాగర్‌ల ప్రభావంతో గూగుల్‌ప్లస్‌కు అంతో ఇంతో గుర్తింపు వచ్చింది కానీ.. లేకపోతే గూగుల్ ప్లస్ ఒక అత్యంత సాధారణ సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్‌గా మిగిలిపోయేది. బ్లాగర్, జీమెయిల్‌లోని కంటెంట్‌ను గూగుల్‌ప్లస్‌లోకి షేర్ చేసుకోండని జనాలను గూగుల్ మొహమాటపెడుతోంది. అటు ఆర్కుట్ పోయి, గూగుల్‌ప్లస్ క్లిక్ కాకపోవడంతో గూగుల్ తలపట్టుకుంది.
 
 టాప్‌టెన్ సోషల్సైట్లు ఇవే..

 ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్, లింక్డిన్, పింట్రెస్ట్, మైస్పేస్, గూగుల్ ప్లస్, డివైన్‌ఆర్ట్, టంబ్లర్, ఆర్కుట్..  తొలి స్థానం నుంచి  పదోస్థానానికి వచ్చింది ఆర్కుట్ !
 
 పారంభమే ఆసక్తిదాయకం...

 పుడుతూనే సోషల్ సామ్రాజ్యాన్ని ఏలేద్దాం అనే ఉద్దేశంతో ఆర్కుట్ ప్రారంభం కాలేదు. ఈ సైట్‌ప్రారంభించిన ఉద్దేశం వేరు, అది ఫేమస్ అయిన విధానం వేరు. దీన్ని రూపకర్త పేరు ఆర్కుట్ బయోక్కొటిన్. ఇతడు టర్కీకి చెందిన వాడు. దూరమైన తన ప్రియురాలి జాడను తెలుసుకునేందుకు తన పేరు మీద ఈ సైట్‌ను ప్రారంభించాడు.   ఇంటర్నెట్ వినియోగదారులందరినీ ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి తన ప్రియురాలి జాడను కనుక్కునేందుకు మొదలైంది ఇతడి ప్రయత్నం. అనూహ్యంగా ఈ సైట్ గుర్తింపుకు నోచుకుంది. వేలాదిమంది ఇందులోకి లాగిన్ అయ్యారు. ఈ పరిణామంతో ఆర్కుట్ గూగుల్ కంట పడింది. భారీ డీల్‌తో ఆర్కుట్‌ను కొనుగోలు చేసింది గూగుల్. ఈ డీల్‌తో ఆర్కుట్ పేరు మార్మోగడంతోపాటు అతని ప్రియురాలు కూడా దగ్గరైంది.
 

>
మరిన్ని వార్తలు