మద్యం... మక్కువ

10 Jul, 2018 00:17 IST|Sakshi

చెట్టు నీడ

రాక్షసుల గురువు శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలు. మొదటిది సురాపానం కాగా, రెండవది కూతురిమీద వల్లమాలిన ప్రేమ. శుక్రాచార్యునికి మృతసంజీవనీ విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలాగైనా సరే, రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారికోసం అన్వేషిస్తున్నాడు బృహస్పతి. దేవతలందరూ వెనకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చాడు ఆయన కుమారుడు కచుడు. కుమారుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. ‘‘కుమారా! ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు. తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే, శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు’’ అంటూ మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. 

కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. తాను ఎవరూ లేని అనాథనని, విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని ఎంతో వినయంతో పరిచయం చేసుకున్నాడు. అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి, తన వద్దనే ఉంచుకుని ప్రేమతో విద్య బోధించసాగాడు శుక్రుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేసి, తర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. అదంతా దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఇలా రెండుమూడుసార్లు జరిగింది. ఇలా లాభం లేదనుకున్న రాక్షసులు, ఈసారి కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. ‘పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది,’ అని ఆలోచించిన శుక్రుడు, జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపథం చేశాడు. 
– డి.వి.ఆర్‌ 

మరిన్ని వార్తలు