బతుకు కంటే వాస్తవమైంది నటన

13 May, 2019 00:35 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

ఎవరైనా– మన లోపలి సమస్త కల్మషాన్ని స్వీకరించి మనల్ని నిత్యం చిరునవ్వుతూ ఉండేలా చేస్తే? రోజురోజుకీ మన పెరిగే వయసును స్వీకరించి మనల్ని ఎల్లప్పుడూ నవయౌవనంలో ఉండేలా చేస్తే? డోరియన్‌ గ్రేకు అట్లాంటి మహదవకాశం వస్తుంది. అతడి తప్పులనూ వృద్ధాప్యాన్నీ స్వీకరించేలా ఒక అరుదైన చిత్రాన్ని గీస్తాడు కళాకారుడు బేసిల్‌ హాల్‌వార్డ్‌. ఇక, ఏ నియమాలకూ లొంగనక్కర్లేని, ఏ మృత్యువుకూ భయపడనక్కర్లేని గొప్ప అందగాడైన డోరియన్‌ గ్రే తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఏదో ఒక దశలో తనకు బదులుగా తన చిత్తరువు పొందుతున్న వికృతరూపాన్ని చూసుకున్నాక ఏమయ్యాడు? ఇదీ స్థూలంగా ఐరిష్‌ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ నవల ‘ద పిక్చర్‌ ఆఫ్‌ డోరియన్‌ గ్రే’ (1890). దీన్ని తెలుగులోకి డోరియన్‌ గ్రేగా బెల్లంకొండ రామదాసు అనువదించారు. గొప్పగానూ, తీవ్రంగానూ, విపరీతంగానూ అనిపించే ఆ పుస్తకంలోని కొన్ని పంక్తులు ఇక్కడ. అయితే గ్రహించవలసింది ఇవి ఆయా పాత్రల అంతరంగ తీరును బట్టి పలికేవని.

లోకంలో మనల్ని గురించి నలుగురూ చెప్పుకోవటం కంటే అధ్వాన్నమైంది ఒకటే ఉంది– అది మనల్ని గురించి ఎవరూ చెప్పుకోకుండా ఉండటం. మేధస్సు సన్నగిల్లినవాళ్లే వాదనలోకి దిగుతారు. ప్రేమ పట్ల విశ్వాసం గలవాళ్లకు దాని లోతుపాతులు తెలియవు. దాని పై మెరుపులే తెలుస్తాయి. విశ్వాసం లేనివారికే ప్రేమ యొక్క వైఫల్యాలూ, విషాదాంతాలూ తెలుస్తాయి.జీవితంలో అలసిపోయినప్పుడు పురుషులు పెళ్లాడుతారు. ఔత్సుక్యం వల్ల స్త్రీలు పెళ్లాడుతారు. ఇద్దరి ఆశలూ విఫలమవుతాయి. మనల్ని మనం మోసం చేసుకోవడంతో మన ప్రేమ ప్రారంభిస్తుంది. ఇతరులను మోసం చెయ్యడంతో అంతమవుతుంది. దీన్నే ప్రపంచం ‘ప్రణయం’ అనే పేరుతో పిలుస్తూ ఉంటుంది. అభివృద్ధి ఆగిపోయిన జీవితం తప్ప మరే జీవితమూ పాడైనట్టు కాదు. నీవు ఒక వ్యక్తిని పాడుచెయ్యాలంటే అతన్ని సంస్కరించు చాలు. వివాహమంటే ఏమిటి? ఆడి తప్పని ప్రతిజ్ఞ.

సంస్కారం గల ఏ వ్యక్తి అయినా తను నివసించేనాటి నైతిక ప్రమాణాన్ని ఒప్పుకున్నాడంటే అంతకంటే అవినీతి మరొకటి లేదు. స్త్రీలు మనల్ని గొప్ప కళాఖండాలు సృష్టించడానికి ప్రేరేపిస్తారు. కాని అవి పూర్తికాకుండా మనకు అవరోధాలవుతారు. బ్రతుకు కంటే వాస్తవమైంది నటన. ప్రేమ కళకంటే అద్భుతమైంది. మనం ఎవరిని లెక్క చెయ్యమో వారిపట్ల దయగా ఉంటాం. మనం ఒక విచిత్రమైన యుగంలో నివసిస్తున్నాం. విజ్ఞానం నశించేటంత చదువూ, అందం నశించేటంత ఆలోచనా ఉన్న యుగం ఇది. ఒక ఉద్వేగం నుంచి విముక్తి పొందడానికి సంవత్సరాల తరబడి కాలం కావలసింది ఒక్క వ్యర్థులకు మాత్రమే. పరిపక్వత పొందిన వారికి అంతకాలం అనవసరం. తనపై తనకు స్వాధీనతగల వ్యక్తి ఒక కొత్త ఆనందాన్ని ఎంత సులువుగా కనిపెట్టగలడో అంత సులువుగా ఒక దుఃఖాన్ని సమాప్తి చేసుకోగలడు.

మరిన్ని వార్తలు