కళ్లు మూసుకుంటే సరిపోదు

1 Jul, 2018 02:31 IST|Sakshi

అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసుకోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు. అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.

అతను కళ్ళు తెరిచి అడిగాడు – ‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’ అని.గురువు చెప్పాడు ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను‘‘ అని. అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది.  అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపుకోనివ్వండి‘‘ అని చెప్పాడు. అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.

శిష్యుడిని ప్రశ్నించాడిలా గురువు – ‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు‘‘ అనేసరికి శిష్యుడి నోటంట మరో మాట లేదు. ‘‘ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు‘‘ అని చెప్పాడు గురువు. ‘‘దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని నీకెవరు చెప్పార‘‘న్నాడు గురువు.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు