ఋతుగుణానికి... అనుగుణంగా

18 Jan, 2020 04:53 IST|Sakshi

వాతావరణంలోని మార్పులను బట్టి సంవత్సరంలోని పన్నెండు నెలల్ని ఆరు ఋతువులుగా విభజించారు మన పూర్వీకులు. సంస్కృతంలో చెప్పినా, ఆంగ్లంలో చెప్పినా, ఏ మాతృభాషలో చెప్పినా ‘శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం’ ప్రకృతిలోని కాలచక్రానికి చిహ్నాలు. వీటికి అనుగుణంగా ప్రాణికోటి తమ జీవనశైలిని, ఆహారవిధానాలను సర్దుకోవలసిందే. మానవ ఆరోగ్య శాస్త్రానికి కాణాచి అయిన ఆయుర్వేదం వివిధ వ్యాధులకు చికిత్సలను వివరించడంతో పాటు ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పదిలపరచుకోవడానికి, ఎన్నో ప్రక్రియలను ‘స్వస్థవృత్తం’ అనే పేరు మీద విపులీకరించింది. ఆహారస్వభావాలను, జీవనశైలిని.. దినచర్య, ఋతుచర్యలుగా విశదీకరించింది. శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంతం అనే ఆరు ఋతువులలోనూ తదనుగుణమైన ఆహారవిహారాలను వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న హేమంత ఋతువు, రానున్న శిశిర ఋతువుల చర్యలను పరిశీలిద్దాం.

హేమంతం: మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువు. ఇంచుమింగా నవంబరు నెల చివర నుంచి, జనవరి నెల చివరి వరకు ఉంటుంది. అనంతరం శిశిర ఋతువు ప్రారంభమౌతుంది. ఇది మార్చి నెలలో మూడు వారాల వరకు ఉంటుంది. ఈ రెండు ఋతువుల్ని చలికాలం అంటాం. స్వభావరీత్యా బయట చలిగాలులు వీస్తాయి. అందువలన శరీరం లోపల ఊష్మం అంటే వేడి పుడుతుంది. జఠరాగ్ని (దీపన పాచకాగ్నులు – ఆకలి కలగడానికి, అరుగుదల కావడానికి ఆధారమైనవి) గణనీయంగా వృద్ధి చెందుతుంది. మనుషులు ఎంతటి బరువైన ఆహారాన్నయినా అరిగించుకోగలరు. సమృద్ధిగా తినకపోతే రసధాతువు బలహీనపడి వాతప్రకోపం జరుగుతుంది.

ఆహారవిధి: తీపి, పులుపు, ఉప్పు రుచులతో (మధుర, ఆమ్ల, లవణ రసాలు) కూడిన పుష్టికరమైన (బరువైన గుర్వాహారం) ఆహారాన్ని సేవించాలి. కొత్త బియ్యం, ఆవుపాలు, చెరకు రసం శ్రేష్ఠమని చరకాచార్యుడు స్పష్టీకరించాడు. నువ్వులనూనె (తైల), వస (ఎముకల గుజ్జులోని రసం) బలకరమని చెప్పాడు. (గోరసాన్‌ ఇక్షువికృతీః – వసామ్, తైలమ్‌ నవౌదనమ్‌). కనుకనే సంక్రాంతి పండుగ సమయంలో కొత్తబియ్యపు పాయసం, చెరకు రస పానం విశిష్టతను సంతరించుకున్నాయి. మినుములతో (మాష) చేసిన పదార్థాలు పుష్టికరమని వాగ్భటాచార్యుడు వివరించాడు. (... మాషిక్షుక్షీరోద్ధవికృతీః శుభాః). కారము, చేదు, వగరు (కటు తిక్త కషాయ) రుచులు కలిగిన ఆహారపదార్థాలు మంచివి కాదు. వేడివేడి సూపుల వంటి పానీయాలు, ఫలాలు, రకరకాల రుచికర వంటకాలు
హితకరం.
విహారం (జీవనశైలి): వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నువ్వులనూనె వంటి వాతహర తైలంతో శరీరానికి మర్దనా చేసుకోవటం, నూనెతో కూడిన దూదిని తలమీద ఉంచుకోవటం మంచిది. వస, కరక్కాయ వంటి ద్రవ్యాల చూర్ణాలకు కొద్దిగా నూనె కలిపి నలుగు పెట్టుకుని, ఆ తరవాత అభ్యంగ స్నానం చేయాలి. (శరీరానికి సరిపడేలా వేడి నీళ్లు వాడుకోవాలి. అంటే సుఖోష్ణ జలస్నానం). వెచ్చదనం కోసం ప్రత్తి లేదా పట్టు (సిల్కు) వస్త్రాలను ధరించాలి. ఎండలో నుంచి సూర్యరశ్మి శరీరానికి అందేలా కొద్ది సమయం గడపాలి. కూర్చోవటం, పండుకోవటం కోసం వెచ్చని వస్త్రాలు ఉండాలి.

గమనిక: ఎటువంటి పరిస్థితులలోనూ శీతల వాయువులకు గురి కాకూడదు. తలకు, శరీర భాగాలకు వెచ్చదనం కలిగించే దుస్తులు, ఇతర ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే భూమి లోపల కూడా చిన్న గదులు నిర్మించుకుని నివసించాలని వివరించారు. ఇటువంటి ఋతుచర్యలను ఆరు ఋతువులకు కూడా ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకు, ఓజో వృద్ధి కొరకు పేర్కొన్నారు.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు,
హైదరాబాద్, ఫోన్‌: 9963634484

మరిన్ని వార్తలు