మాంచెస్టర్‌కు... మన మాణిక్యాలు

21 Mar, 2014 02:22 IST|Sakshi
మాంచెస్టర్‌కు... మన మాణిక్యాలు

ఖరీదైన జీవితాలకూ, సామాన్య జీవితాలకూ మధ్య తేడాను పట్టి చూపే వాటిలో అభిరుచులదీ, ఆసక్తులదీ కూడా ముఖ్య పాత్రే! క్రిస్టియానో రొనాల్డో, డిగో మారడోనా, మాంచెస్టర్ యునెటైడ్ క్లబ్... ఫుట్‌బాల్ క్రీడలోని ఈ పేర్లు ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి, పెరిగిన పిల్లలకే ఎక్కువ పరిచయం.


మనసుకు ఏదో సాంత్వన నిచ్చే  మడోన్నా ‘లైకే ప్రేయర్’ను ఆస్వాదించాలంటే ఒక స్థాయి ఉన్నవాళ్లకే సాధ్యం. వాళ్లకు ఫ్యాన్స్ అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్.  కానీ ఇలాంటి పరిమితులన్నింటినీ దాటేసే శక్తి కొంతమంది సామాన్యుల వద్ద ఉంటుంది. వారిలోని ప్రతిభ ఆ పరిమితులను దాటి అద్భుతాలను సాధించే అవకాశాన్నిస్తుంది. అలాంటి ప్రతిభ, స్ఫూర్తి దాగున్న యువకులే - రాజీవ్ బాయ్, అర్కా డేలు. కోల్‌కతాలోని అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన  ఈ యువకులు ఫుట్‌బాల్‌ను ఫ్యాషన్‌గా భావించారు. ఆట, ఆటగాళ్ల శైలి గురించిన ఆలోచనల్లోనే గడిపేశారు. ఇప్పుడు ఏకంగా మాంచెస్టర్ యునెటైడ్ ఫుట్‌బాల్ క్లబ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఎంపికయ్యారు.   


అత్యున్నత స్థాయి శిక్షణ
 

మొత్తం 11 మంది భారతీయ యువకులను ఫుట్‌బాల్ శిక్షణ కోసం ఎంపిక చేసింది మాంచెస్టర్ యునెటైడ్ క్లబ్. ఇక్కడ వీరందరికీ అత్యున్నత స్థాయి శిక్షకులతో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఆటకు సంబంధించి అనేక మెలకువలను నేర్పుతారు. ఇలాంటి వీధి రత్నాలను ఏరి, వారిని మైదానంలోని మాణిక్యాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ పరాయి దేశానిదే అయినా కూడా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు!
 - జీవన్‌రెడ్డి.
 
 అమ్మ స్ఫూర్తిగా...

 రాజీవ్ బాయ్ వయసు 16 ఏళ్ళు. అతనిది సామాన్య నేపథ్యం. ఆ సంగతులు చెప్పుకొని ఎవరిైకైనా పరిచయం చేసుకోవడానికి ధైర్యం ఉండాలి.  ‘అమ్మ సెక్స్ వర్కర్ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు. వీలైనంత త్వరగా ఆమెను ఆ కూపం నుంచి బయటకు తీసుకురావడమే నా ముందున్న కర్తవ్యం’ అని రాజీవ్ చెబుతుంటే, చెమర్చని కళ్లు ఉండవు. రోజుకు మూడొందల రూపాయలు సంపాదిస్తాను అని చెబుతుంది రాజీవ్ తల్లి. రాజీబ్‌కి చిన్నప్పటి నుంచి పోర్చుగీస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అంటే ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. రొనాల్డోలా ఫార్వర్డ్ ప్లేయర్‌గా గోల్‌పోస్టు మీద దండెత్తే దూకుడు ఆటతీరు రాజీబ్‌ది. అయితేనేం, రాజీవ్  రేపు ఏ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లోని క్లబ్‌కో ప్రాతినిధ్యం వహించే భారతీయ ఆటగాడిగా పేరు తెచ్చుకొనే అవకాశాలు పుష్కలం. ట్రైనింగ్ క్యాంప్‌లో ఆటకు తుదిమెరుగులు దిద్దుకొని, స్టేడియంలోకి దిగుతానన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
 
 నాన్న నేర్పినదే ఈ శైలి!
 
‘క్రికెట్ వేలంవెర్రి దేశం’ అంటూ భారత దేశానికి ముద్రపడినా పశ్చిమ బెంగాల్‌కు మాత్రం ఈ ముద్ర వర్తించదు. సౌరభ్ గంగూలీ వంటి ప్రసిద్ధ క్రికెటర్‌ను అందించినప్పటికీ కోల్‌కతాకు ఫుట్‌బాల్ అంటే క్రేజ్. అలాంటి క్రేజులో బ్రెజిల్ సాకర్‌స్టార్ పీలేను అమితంగా ఆరాధించేవాడు మా నాన్న అని చెబుతాడు అర్కా డే. ‘‘నా తొలి కోచ్ మా నాన్నే. తను ఒక సాధారణ వ్యాపారి. నా ఆట విషయంలో ప్రేక్షకుడిగా ప్రోత్సహించిందీ ఆయనే. అయితే ఇప్పుడు ఆయన లేరు. మూడేళ్ల కిందటే క్యాన్సర్‌తో మరణించారు. నాన్నను గుర్తు చేసుకొన్నప్పుడల్లా ఎంతో శక్తి వస్తుంది. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎదగాలన్న ఆశయం గుర్తుకొస్తుంది.


ఇప్పుడు ఆయనే గనుక ఉండుంటే ఎంత ఆనందించేవారో...’’ అంటూ తన నేపథ్యాన్ని వివరించేప్పుడు అర్క కళ్లలో ఒక సన్నటి కన్నీటి పొర. ఇతడికి తల్లే ఆధారం. ఆమె కోల్‌కతాలో ఒక రోడ్డు పక్కన చిరుతిళ్ళు అమ్ముతూ ఉంటుంది. రోజూ ఐదు కిలోమీటర్ల దూరం నడిచి గుడికి వెళ్లి, ఆటగాడిగా కొడుకు విజయం సాధించాలని పూజలు చేస్తుంటుంది. ‘‘బ్రిటన్‌లోని శిక్షణ శిబిరానికి ఎంపిక అయ్యాననే విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నా. నేను బ్రిటన్‌కు వెళ్లే లోపు, ఆటకు పనికొచ్చే కిట్, షూ కొనిస్తానని ఒక పెద్దాయన మాట ఇచ్చాడు’’ అంటూ సంబరంగా చెబుతాడు అర్కా డే
 
 

మరిన్ని వార్తలు