మన దగ్గర మహిళా టెక్నీషియన్లు కాస్త తక్కువే!

25 Feb, 2015 00:02 IST|Sakshi
మన దగ్గర మహిళా టెక్నీషియన్లు కాస్త తక్కువే!

ఏక్తాకపూర్ అనే మహిళా నిర్మాత హిందీ సీరియల్ రంగాన్ని ఏలుతోంది. మిథాలీ మహాజన్ లాంటి రచయిత్రులు, అపర్ణారైనా లాంటి ఆర్ట్ డెరైక్టర్లు, ప్రీతి శర్మ లాంటి కాస్ట్యూమ్ డిజైనర్లు అక్కడ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. మరి తెలుగు సీరియళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ నటీమణులు ఉన్నంతగా ఇతర విభాగాల్లో మహిళలు ఎందుకు లేరు?! ఈ విషయం గురించి టెలివిజన్ స్టార్ రైటర్ బిందునాయుడుతో చిన్నపాటి చిట్‌చాట్...
బిందునాయుడు
 
హిందీలో మాదిరిగా తెలుగు సీరియళ్లలో మహిళా టెక్నీషియన్లు ఎందుకు ఎక్కువ ఉండటం లేదు?

 నిజమే. మన దగ్గర నటీమణులు ఉన్నంతగా మహిళా స్క్రిప్టు రైటర్లు, డెరైక్టర్లు, ప్రొడ్యూసర్లు లేరు. అయితే హిందీ ఫీల్డ్ చాలా పెద్దది. దానితో తెలుగు రంగాన్ని పోల్చడం సరికాదు. అసలు హిందీలో జరిగినంత సీరియల్ ప్రొడక్షన్, మరే ఇతర భాషలోనూ జరగదు. అందుకే అక్కడ మహిళలకు అవకాశాలు చాలా ఎక్కువ.

అంటే ఇక్కడ అవకాశాలు లేవనా లేక మహిళల్లో ఆయా అంశాలపై ఆసక్తి తక్కువ ఉందా?

అవకాశాలు లేవని అనలేం. ఇటీవల మీడియాలో మనకు చాలామంది మహిళలు కనిపిస్తున్నారు. అదే సీరియళ్ల దగ్గరకు వచ్చేసరికి నటన మీద ఆసక్తితో బోలెడంతమంది వస్తుంటారు కానీ మిగతా విభాగాల్లో పని చేయాలనుందంటూ అంతమంది రారు. ఇతర ప్రొడక్షన్స్ గురించి నాకు తెలియదు కానీ, మా వరకూ అయితే అలా వచ్చేవాళ్లు చాలా తక్కువే. నిజానికి టీవీ ఒక్కటే కాదు... మన తెలుగు సినిమా రంగంలో కూడా మహిళా డెరైక్టర్లు, రచయిత్రులు తక్కువే ఉన్నారు కదా!  

ఒకవేళ ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని భయపడి..

ఆ మాటను నేను ఒప్పుకోను. ఈ రంగం ఆడాళ్లకు అనుకూలంగా ఉండదు, ఇబ్బందులుంటాయి, అందువల్లే ఆడవాళ్లు రావడానికి భయపడతారు అని చాలామంది అంటుంటారు. అదే నిజమైతే ఇంతమంది నటీమణులు ఎందుకుంటారు చెప్పండి! మేమైతే మా ప్రొడక్షన్లో ఉండే మహిళలకు టైమింగ్స్ అడ్జస్ట్ చేయడం, ఇబ్బందిగా ఫీలైతే సన్నివేశాల్లో మార్పులు చేయడం వంటి వెసులుబాటు కల్పిస్తాం. అయినా ఇబ్బందులు ఏ రంగంలో ఉండవు?! నిజాయతీగా శ్రమిస్తే, ఎవరైనా ఇక్కడ సక్సెస్ అవుతారు. దానికి ఆడా మగా తేడా లేదు.
 
మహిళలు సీరియళ్లకు అడిక్ట్ అవుతున్నారని, వాళ్ల మీద చెడు ప్రభావం పడ్తోం దనే కామెంట్‌కి మీ స్పందన?

సినిమా అయినా సీరియల్ అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. మనం దేన్ని తీసుకుంటామనేదాన్ని బట్టి ఉంటుంది. నిజానికి ఇంతకుముందు కంటే ఇప్పుడు కాస్త అత్తాకోడళ్ల గొడవలవీ తగ్గించి డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. అది మంచి మార్పే కదా!
 
ఆ మార్పొక్కటే సరిపోతుందా?

అలా అని కాదు. ఇంతకుముందు కంటే కాస్త మెరుగుపడిందని నా ఉద్దేశం. అయితే ఇంకా అక్కడక్కడా ఆడవాళ్లను మరీ క్రూరంగాను, మగవాళ్ల వెంటపడి వాళ్ల కోసం పాకులాడు తున్నట్టుగాను, ఒక్కోసారి కాస్త అసభ్యం గానూ చూపించడం జరుగుతోంది. నాకది నచ్చదు. అందుకే అక్క మంజు, నేను మా సీరియల్స్‌లో వీలైనంత వరకూ అను బంధాలను, వాటి విలువలను ఎక్కువగా చూపించడానికి ప్రయత్ని స్తుంటాం. ఆ విషయం నేను కాస్త గర్వంగానే చెప్పుకుంటాను!
 
 డబ్బింగ్ సీరియళ్ల గొడవ ఎంతవరకూ వచ్చింది?
 
పరిస్థితి ఇంకా అలాగే ఉంది. వాటి వల్ల ఇక్కడ ఎంత మంది జీవనోపాధికి గండిపడుతుందో ఎవరూ ఆలోచించట్లేదు. అంతవరకూ ఎందుకు? మీరు మన మహిళల సాధికారత గురించి అడుగుతున్నారు కదా! ఎంతోమంది నటీమణులు సీరియళ్ల మీద ఆధార పడి జీవిస్తున్నారు. డబ్బింగ్ సీరియళ్లు పెరిగి పోతే వాళ్లందరూ రోడ్డున పడరా? ఇంకెక్కడొస్తుంది సాధికారత?!
 
 

మరిన్ని వార్తలు