కలవరం కాదు... వరం!

28 Jun, 2015 23:25 IST|Sakshi
కలవరం కాదు... వరం!

బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలలో జీవితం గడుస్తుంది. బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం; యవ్వనంలో ఉద్యోగం, వివాహం, సంతానం; వృద్ధాప్యంలో అరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు... ఇలా జీవనక్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగ జీవితం... కుటుంబపరంగా కూడా అనేక బాధ్యతలను నెరవేర్చుకోవడంతో సాగుతుంది.  పిల్లల చదువుల, పిల్లల పెళ్లిళ్లు, అదే సమయంలో ఉద్యోగనిమిత్తం కొత్త కొత్త ప్రదేశాలలో పనిచేయాల్సి రావడం, కొత్తవారితో పరిచయాలు... జీవితాన్ని వేగంతో నింపేస్తాయి. అయితే ఉద్యోగ విరమణ పొందాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. ఒంటరితనం మిగులుతుంది. దీంతో మనోవేదన కలుగుతుంది.

వయసు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యలూ ముప్పిరిగొంటాయి. అందుకే పదవీ విరమణ తర్వాత ఏదైనా ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలి. ఉచిత సేవలు అందించడం కానీ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కానీ చేయాలి. సమాజానికి ఉపకరించే పనుల్లో నిమగ్నం అయి ఉండడం వల్ల కూడా మనం ఈ ‘శూన్యత’ నుండి బయటపడవచ్చు. దాంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలూ తగ్గుతాయి. ఇక లలిత కళలు ఇచ్చే ఆనందం గురించైతే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఉల్లాసాన్నిచ్చే వ్యాపకాలను ఏర్పరచుకుంటే ఉద్యోగ విరమణ అన్నది శాపంలా కాకుండా వరంలా పరిణమిస్తుంది.
- చెన్నమాధవుని అశోక్‌రాజు

మరిన్ని వార్తలు