ఇంటి కంపోస్టు.. సొంత కూరగాయలు!

17 Jul, 2018 03:57 IST|Sakshi
వెంకటకృష్ణ ఇంటిపై పంటల కనువిందు

హైదరాబాద్‌ నగరంలో పుట్టిపెరిగిన ఈమని వెంకటకృష్ణ మెహదీపట్నం కాంతినగర్‌ కాలనీలోని తమ సొంత ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఇంటిల్లి పాదీ ఆరోగ్యంగా ఉన్నారు. వెంకటకృష్ణ బీటెక్‌ అనంతరం అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి బహుళజాతి కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఫ్రీలాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు. 7గురు పెద్దలు, ఇద్దరు పిల్లలున్న ఉమ్మడి కుటుంబం వారిది. 1500 ఎస్‌.ఎఫ్‌.టి. టెర్రస్‌పై 200 పైచిలుకు టబ్‌లు, గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు పండిస్తున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలు కొనలేదు. 200 లీటర్ల ప్లాస్టిక్‌ పీపాలను కొనుగోలు చేసి మధ్యకు కత్తిరించిన వందకుపైగా టబ్‌లు.. అడుగు ఎత్తు–2 అడుగుల వెడల్పు ఉండే వాష్‌ టబ్స్‌.. అడుగు ఎత్తుండే గ్రోబాగ్స్‌ వాడుతున్నారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు అలములతో సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టునే ఉపయోగిస్తున్నారు.

ఏ టబ్‌లోనైనా.. కొబ్బరి పీచు+చెరకు గడల వ్యర్థాలను అడుగున 20% ఎత్తు మేరకు వేసి.. ఆ పైన 30% ఎర్రమట్టి వేసి.. ఆ పైన సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును 30% మేరకు వేస్తారు. తర్వాత అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా కంపోస్టు వేసుకుంటూ.. ఇంటిపంటలు పోషకాల లోపం, చీడపీడలకు గురికాకుండా మంచి ఉత్పాదకతను సాధిస్తున్నారు.  తోటకూర, పాలకూర, పొన్నగంటి, బచ్చలి, గోంగూరలతోపాటు వంగ, బీర, నేతిబీర, చిక్కుడు, గోరుచిక్కుడు, పిచ్చుకపొట్ల, పచ్చిమిరప, కంద.. సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారానికి 3 రోజులపాటు ఇంటి కూరగాయలనే తింటున్నారు. త్వరలో వారానికి 5 రోజులు సరిపోయే అంతగా ఇంటిపంటల సాంద్రతను పెంచామని అంటూ.. నూటికి నూరు శాతం వీటికే పరిమితం కావడం సాధ్యం కాదని వెంకటకృష్ణ(90001 03046) అభిప్రాయపడుతున్నారు. చెత్తను బయటపడేయకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ.. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను ఇంటిపైనే పండించుకుంటున్న వెంకటకృష్ణ కుటుంబానికి జేజేలు!


      వెంకటకృష్ణ

మరిన్ని వార్తలు