అందమైన లోకం

3 Jan, 2020 07:44 IST|Sakshi
తమ ఇంటి పనిమనిషికి మరింత ఆసరా కోసం పెట్టిన ఉపాహార శాలలో అశ్వినీ షెనాయ్‌

ముంబయిలోని కండివాలి స్టేషన్‌కు సమీపంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ఉదయపు ఉపాహారశాల వెలిసింది. పోహా, ఉప్మా, కిచిడీ, ఇడ్లీ– చట్నీ, పరాఠాలు వేడివేడిగా వడ్డిస్తారు. దీని నిర్వాహకులైన అశ్విని షెనాయ్, అంకుష్‌ నీలేష్‌ షా భార్యాభర్తలు. ఉదయం ఐదుగంటల నుంచి తొమ్మిదిగంటల వరకు మాత్రమే ఉంటుంది సర్వీస్‌. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల వాళ్ల ఉద్యోగాలకు వెళ్లిపోతారు. వాళ్లు ఈ ఉపాహారశాలను ప్రారంభించింది తమకు అదనపు ఆదాయం కోసం కాదు. వాళ్ల ఇంట్లో వంట చేసే భావనాబెన్‌ పటేల్‌ కోసం! భావనాబెన్‌ భర్త అనారోగ్యానికి గురయ్యాడు.

అతడికి వైద్యం కోసం ఆమెకు డబ్బు కావాలి. వంట తప్ప మరో పని చేయడం రాదామెకు. ఆమె పరిస్థితి తెలిసిన అశ్విని, నీలేష్‌లు వైద్యానికి అవసరమైన డబ్బిస్తామని ధైర్యం చెప్పారు. కానీ భావనాబెన్‌ అందుకు అంగీకరించలేదు. తాను రోజూ చేసే పనులతోపాటు మరికొంత కష్టపడడానికి శక్తి ఉంది, పని చూపిస్తే చేసుకుంటానని అడిగింది. ఆమె కోసమే ఈ ఉపాహారశాలను ప్రారంభించారు అశ్విని దంపతులు. అందులో భావనాబెన్‌ వంటలు చేస్తుంది. అశ్విని, అంకుష్‌లు స్టాల్‌ నడుపుతారు. ఖర్చులు పోను మిగిలిన ఆదాయం మొత్తం భావనాబెన్‌దే. అశ్విని దంపతులకు మానవత్వానికి ప్రతీకలు అని ప్రశంసలు వస్తున్నాయి. కానీ ‘మానవత్వం అనే పెద్ద మాట వద్దు. ఆమెకు మేము చేయగలిగింది చేస్తున్నాం’ అంటున్నారు అశ్వని.

మరిన్ని వార్తలు