ఒరిజినల్‌ డూప్లికేట్‌

26 Dec, 2017 23:27 IST|Sakshi

నేను  నా దైవం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ (86) ఏడు దశాబ్దాల మిమిక్రీ కళను గుర్తిస్తూ, ఆయన పుట్టిన రోజును (డిసెంబర్‌ 28) పురస్కరించుకొని తెలంగాణా సర్కిల్‌ తపాలాశాఖ ప్రత్యేక తపాలా కవర్‌ని ఆవిష్కరించిన సందర్భంగా... 

ఈ మనిషి ముందు అద్దం పెడితే... ఈ మనిషి కాదు! 
అద్దం తికమక పడుతుంది.
తను తప్ప ఎందరో కనబడతారు. సారీ... వినబడతారు. 
ఈయన డూప్లికేట్లకు కింగ్‌.
మిమిక్రీకి ఛత్రపతి. స్వర అనుకరణకు అంకురం.
మీలో ఇన్ని ధ్వనులు ఏలా ... అని అడిగితే
దేవుడి ప్రతిధ్వని అన్నారు ఈ ఒరిజినల్‌ డూప్లికేట్‌

మీరెంచుకున్న మార్గం స్వరంతో ముడిపడి ఉంది. ఈ మిమిక్రీ విద్య దైవం ఇచ్చిన శక్తిగా భావిస్తారా? మీకీ కళ ఎలా అబ్బింది?
నూటికి నూరుపాళ్లు దైవం ఇచ్చినదే! మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఇంటికి పెద్ద కొడుకుని కావడంతో నేనూ తహసీల్దార్‌ కావాలని ఆయన కోరిక. కానీ, నాకా పని పట్ల ఎప్పుడూ ఆసక్తి లేదు. సినిమాలంటే బాగా ఇష్టపడేవాడిని. అందులోనూ చిత్తూరు నాగయ్య సినిమా అయితే ఎన్నిసార్లు చూసేవాడినో లెక్క ఉండేది కాదు. క్లాసురూమ్‌లో కూడా సినిమా యాక్టర్లను అనుకరిస్తూ తోటివారిని సంతోషపెడుతుండేవాడిని. మా ఇంట్లో అందరూ నాకేదో పిచ్చిపట్టిందనేవారు. మా నాన్న అయితే కోపంలో ‘వీడు మన కుటుంబ లెక్కలోనే లేడు’ అని వదిలేశాడు. ఇంట్లో అందరూ నాతో అలాగే ఉండేవారు. కానీ, మా కాలేజీ ప్రిన్సిపల్‌ నాలో ఉన్న కళను గుర్తించాడు. ఇది అద్భుతమైన కళ. ఇదే దారిగా ఎంచుకుని వెళ్లమని సూచించారు. అప్పటి వరకు మిమిక్రీ అనేది కళగా గుర్తింపు ఎక్కడా లేదు. అసలు ఈ కళను మిమిక్రీ అనేవారే కాదు. అనుకరణ అని మాత్రమే నేను అనుకునేవాడిని. రామాయణంలో సీత పర్ణశాలలో ఉన్నప్పుడు మారీచుడు రాముని గొంతును అనుకరించాడట. ఇదే అనుకరణ గొంతుకు మొదటి ప్రాధాన్యత. నేనీ కళలోకి ప్రవేశించేంతవరకు దీనికి అంతగా ప్రాముఖ్యం లేదు. అలాంటిది ఎన్నో వేదికల మీద ఈ మిమిక్రీ కళ నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ప్రపంచ దేశాలన్నీ తిప్పింది. పురస్కారాలు అందజేసింది. అంతా భగవంతుని కృప.  ఏదీ ఉన్నపళంగా రాదని నమ్ముతాను. మనం ఎంచుకున్న మార్గానికి దైవ శక్తి తోడవ్వాలంటే నిరంతరం సాధన చేయాలి.  

ఈ కళలో జీవితాంతం గుర్తుండిపోయే సందర్భాన్ని ఏదైనా దైవం మీకు ఇచ్చిందా?
ఎన్నో.. లెక్కలేవు. వాటిలో అమెరికా ప్రెసిడెంట్‌ జాన్‌ఎఫ్‌ కెనడీని అనుకరించడం, అందుకు ఆయన మెచ్చుకోవడం మరిచిపోలేనిది. అప్పట్లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమ్మిట్‌లో నా ప్రదర్శనకు అవకాశం లభించింది. ఆ ప్రదర్శనలో  బైబిల్‌లోని టెన్‌ కమాండ్‌మెంట్స్‌ని కెనడీ గొంతును అనుకరిస్తూ చెప్పాను. అంతా తెగ ఆశ్చర్యపోయారు. కెనడీ ఆనందంగా ఆలింగనం చేసుకుని, నాతో కొద్దిసేపు ముచ్చటించారు. అదో అద్భుతమైన సందర్భం. చాలా కొద్ది సందర్భాలలో తప్ప వారి ఎదుటి వారి గొంతును అనుకరించను.  వారు హర్ట్‌ అవుతారేమో అని ఆ పని చేయను. 

దైవం ఉందని అనిపించిన ఘటన?
మా కుటుంబం అంతా వేంకటేశ్వరస్వామి భక్తులం. నా చిన్నతనం నుంచి నాకో నమ్మకం.. మనసుపెట్టి తలచుకుంటే ఆ స్వామి నా ముందు ప్రత్యక్షం అవుతారని. నాలో భక్తి భావం ఎక్కువే. మా నాన్నగారు తరచూ తిరుమల తీసుకెళ్లేవారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటరమణా అని నామార్చన రాయించేవారు. 1950లో కంచి వైష్ణవుల ద్వారా సమాసశ్రీనామాలు స్వీకరించాను. ఈ సందర్భంగా పీఠాధిపతి మంత్రోపదేశం చేశారు. నిత్యం నియమాలు, పారిశుద్ధ్యం పాటిస్తూ జపం చేయాలని చెప్పారు. ఓ కళాకారుడిగా నేను వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాను. కాబట్టి ఈ పారిశుద్ధ్య నియమాలు పాటించలేనండి అన్నాను. ఆయన ‘ఇక్కడున్న అందరికంటే నీవే నిజమైన భక్తుడివి. పరిశుద్ధత దేహానికి కాదు, మనసుకి ఉండాలి’ అని చెప్పారు. మంచి మనసుతో చేతులు కడుక్కుని మంత్రం జపించినా మంత్ర ఫలం ఉంటుందని చెప్పారు. దైవాన్ని తలిస్తే కుళాయి నీళ్లూ మంత్ర జలం అవుతుందని ఉపదేశం చేశారు. ఇప్పటికీ నిత్యం జపం చేస్తుంటాను. 

ఇదంతా దైవలీల అనిపించిన సంఘటన?
కళాకారుడిగా గుర్తింపు పొంది, మంచి పేరు వచ్చాక తిరుమలలో గజారోహణం జరిగింది. ఇది పూర్తిగా దైవలీలయే. ఆ రోజు తిరుమల పూజారులు మాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. నేను ముందు, నా వెనక శిష్యులు ఉన్నారు. వెనక ఎక్కడో నా భార్య ఉంది. పూజ సమయంలో తను ఎక్కడుందో నాకు తెలియడం లేదు. ఆ సమయంలో ‘నాకింత గౌరవం దక్కుతుందంటే అది నా అర్ధాంగి వల్లే. ఆమె కుటుంబ పోషణలో సరైన పాత్ర పోషించడం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. ఆమెకూ ఈ సముచితగౌరవం దక్కితే బాగుంటుంది’ అనుకున్నాను. ఇంతలో ఎవరో చెప్పినట్లుగా ఓ పూజారి శిష్యులను దాటుకుని వెళ్లి పూజా సమయానికి ఆమెను నా దగ్గరికి తీసుకొచ్చాడు. తిరుమలలో గజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. (చేతులు జోడించి ఆ స్వామిని తలుచుకుంటూ) ఆ దైవానికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా ఆ సమయంలో అర్ధం కాలేదు. కళ్లమ్మట నీళ్లు తిరిగాయి.  

మీ కష్టాలు తీర్చమని దేవుడికి మొక్కుకుని, ఆ మొక్కులు తీర్చుకున్న విధానం?
మొక్కులు ఓ రకంగా దేవుడికి లంచం ఇవ్వడం లాంటిదే. నేనెప్పుడూ దేవుడికి లంచం ఇవ్వలేదు(నవ్వుతూ). దేవుడు మన వెల్‌విషర్‌ అనే నమ్మకం ఉండాలి. బయటకు వెళ్లేప్పుడు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. ఇలా ఎందుకంటే నన్ను నడిపించే దేవుడు నాతోనే ఉన్నాడు అనే భరోసాకు. దీంతో పనుల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం రాకున్నా మన ఆథ్యాత్మిక వాతావరణం కారణంగా కర్మఫలం అనుకుని సరిపెట్టుకుంటాను. దేవుడిపై నమ్మకం ఉంచి తదుపరి పనిపై దృష్టి పెడతాను. 

ఎంతో అనుభవసారాన్ని గ్రహించిన మీరు మీ పిల్లలకు దైవారాధనను ఎలా పరిచయం చేశారు?
మిమిక్రీలో ఒక రేంజ్‌కి వెళ్లాక కుటుంబానికి టైమ్‌ ఇవ్వడం కుదరకపోయేది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం పిల్లలతో రకరకాల ధ్వనులతో వారిని మెస్మరైజ్‌ చేసేవాడిని. అలా మా ఆవిడకు కొంత పని తగ్గించేవాడిని (నవ్వుతూ) మన పిల్లలైనా సరే మన ఇష్టాయిష్టాలతో వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా జీవన విధానం. భక్తి, వృత్తి ఏదైనా సరే నా వరకే పరిమితం. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సరికాదు. నేను భక్తి పరుడిని కాబట్టి నా కుటుంబం అంతా నా మార్గంలోనే నడవాలనుకోకూడదు. వారి అభిప్రాయాలు, పద్ధతులనూ తండ్రిగా నేను గౌరవించాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారు వారి వృత్తుల్లో ఆనందంగా ఉన్నారు. 

మీ ఈ విశ్రాంత జీవనంలో దైవారాధన ఎలా ఉంటుంది?
పిల్లలు పెద్దవాళ్లై, మనవళ్లు వచ్చాక పెద్దవాళ్లకు పని తగ్గిపోతుంది. అలాగే నే చేసే పనులు తగ్గిపోయాయి. కాలక్షేపం కోసం రామకోటి, వెంకటేశ్వర నామార్చన వంటివి ఉంటాయి. కంచి పీఠాధిపతులు ఇచ్చిన మంత్రోపదేశం ఉండనే ఉంది. గతానుభవాలను, దైవాన్ని తలుచుకుంటే ఈ మిగిలిన జీవితాన్ని గడుపుతున్నాను. గతంలో వాకర్స్‌ అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉండేవాడిని. రోజూ ఉదయం సాయంత్రం వాకింగ్‌కి వెళ్లేవాడిని. ఇప్పుడు ఎక్కువసేపు నడవలేకపోతున్నాను. అందుకే మానేశాను. ఇంట్లోనే ఉంటే బోర్‌ కొడుతుందని క్యారమ్‌ బోర్డ్‌ క్లబ్‌కి వెళుతుంటాను. 
– కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, వరంగల్‌
ఫొటోలు: పెద్ద పెల్లి వరప్రసాద్‌

మరిన్ని వార్తలు