పాపకు పదే పదే జ్వరం... ఏం చేయాలి?

7 Nov, 2013 00:13 IST|Sakshi
పాపకు పదే పదే జ్వరం... ఏం చేయాలి?

మా పాపకు రెండేళ్లు. ఇటీవల తనకు పదే పదే జ్వరం వస్తోంది. మా డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుతున్నాం. పాపకు ఇతర సమస్యలేమీ ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా డాక్టర్‌గారు కూడా అంటున్నారు. అయితే పాపకు తరచూ ఇలా జ్వరం ఎందుకు వస్తోంది? ఇదేమైనా తీవ్రమైన వ్యాధులకు సూచికా? ఆమె ఏమైనా ప్రత్యేకమైన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందా? మాకు తగిన సలహా ఇవ్వగలరు.
 - శ్వామల, కత్తిపూడి

 
మీరు చెప్పిన సమాచారం, లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మాటిమాటికీ జ్వరం వస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రత్యేకమైన కారణం ఇదీ అని చెప్పలేకపోయినప్పటికీ, ఇదంత తీవ్రమైన జబ్బుకు నిదర్శనంగా చెప్పే అవకాశం తక్కువే. ఎందుకంటే... పిల్లల్లో జ్వరంతో పాటు ఇతర లక్షణాలు... అంటే ముఖ్యంగా లింఫ్‌గ్రంథులు వాచడం (గడ్డలు), చర్మంలో మార్పులు, కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్), కంటిపొరలో మార్పులు, బరువు పెరగకపోవడం, రక్తహీనత ఉండటం, ఎడతెరిపిలేకుండా దగ్గు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కూడా ఉంటే తప్పనిసరిగా ఈ జ్వరం ఏదైనా తీవ్రమైన వ్యాధికి సూచికగా చెప్పవచ్చు. అలాగే పిల్లల్లో జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థత... అంటే ముఖ్యంగా నీరసంగా ఉండటం లేదా మగతగా ఉండటం లేదా కొంతమంది పిల్లలు చికాకుగా (ఇరిటబుల్‌గా) ఉండటం వంటి లక్షణాలను కనబరుస్తుంటే అది తీవ్రమైన వ్యాధికి సూచనగా చెప్పవచ్చు.

అయితే చాలా మంది పిల్లల్లో జ్వరం అనేది నిర్దిష్టమైన కారణం లేకుండానే కనిపిస్తుంటుంది.  వారికి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు చేయించడం ద్వారా ఆ జ్వరానికి కారణం తెలుసుకోవచ్చు. ఇక ఈ వయసులోని ఆడపిల్లల్లో జ్వరం వస్తుందంటే వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమోనని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే... ఇలా పదే పదే జ్వరం కనిపించిన సందర్భాల్లో దాదాపు 50 శాతం మందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటానికి అవకాశం ఎక్కువ.

ఇక కొన్నిసార్లు హెచ్‌ఎల్‌హెచ్ సిస్టమ్ అసోసియేటెడ్ కండిషన్స్‌లో కూడా దీర్ఘకాలిక జ్వరాలు రావచ్చు. అయితే వాళ్లలో కనిపించే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీ పాప విషయంలో జ్వరానికి కారణం నిర్ధారణ చేయడం కోసం రక్తానికి చెందిన బ్లడ్ పిక్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్‌రే, డిటెయిల్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు అవసరమైనప్పుడు ఇమ్యునోగ్లోబ్యులిన్ లెవెల్స్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడం కోసం రొటీన్ యూరినరీ పరీక్షలు, యూరిన్ కల్చర్ పరీక్షతో పాటు అవసరమైతే యూరినరీ ట్రాక్ట్‌లో ఏవైనా అబ్‌నార్మాలిటీస్ ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం... అంటే ముఖ్యంగా వెసైకో యూరినరీ రిఫ్లక్స్ (వీయూఆర్) ఉందేమో అని తెలుసుకోవడం కోసం ఎమ్‌సీయూజీ అనే పరీక్ష కూడా చాలా అవసరం. మీ పాప విషయంలో యూరినరీ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ అబ్‌నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడితో చర్చించి, తగు వైద్య పరీక్షలు చేయించుకొని, దాన్ని బట్టి అవసరమైన చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

>
మరిన్ని వార్తలు