పాక్ పటాస్

23 Feb, 2015 23:28 IST|Sakshi
పాక్ పటాస్

ఈమధ్య టీవీలో మీరు ఈ టీజర్ చూసే ఉంటారు. 1992- 2011 మధ్య ఇండియా-పాక్‌లు తలపడిన ఐదు సందర్భాల్లోనూ గెలుపుపై ఆశలుపెట్టుకొని సంబరాలకు పటాసులు రెడీ చేసుకొన్న ఓ పాక్ అభిమాని... తీరా తమ జట్టు ఓడిపోయే సరికి వాటిని అటకెక్కించేస్తుంటాడు. సగటు పాక్ జట్టు అభిమానిని ఉడికిస్తున్నట్టుగా ఉన్న ఆ తొలి టీజర్ ఇండియన్ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా అలరించింది.

అయితే ముందుగానే టీజర్‌లను డిజైన్ చేసుకున్నారో ఏమో కానీ స్టార్ టీవీ వాళ్లు  పాక్‌తో మ్యాచ్ అనంతరం ఇండియన్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ అతడి చేతిలో పటాస్‌లు ఉంచారు. ప్రపంచకప్‌లో అంతవరకూ దక్షిణాఫ్రికాపై గెలిచిన చరిత్రే లేని ఇండియన్ టీమ్‌కు అది దెప్పిపొడుపులా అనిపించింది. తీరా దక్షిణాఫ్రికాపై ఇండియన్ టీమ్ నెగ్గేసరిగి తిరిగి ఆ టీజర్‌ను పాక్ వైపు మళ్లించారు.
 తమ జట్టు ఇండియాపై గెలవకపోవడంతో పటాసులను పేల్చే అవకాశం రాని బాధలో ఉన్న పాకిస్తాన్ అభిమాని దక్షిణాఫ్రికా అయినా ఇండియాని ఓడిస్తుందనే ఆశలు పెట్టుకున్నట్టుగా మూడో టీజర్‌లో చూపారు.

అందులో దక్షిణాఫ్రికా జెర్సీని ధరించిన పాక్ అభిమాని ఆ జట్టుకు మద్దతునిస్తాడు. అయితే ఈసారి కూడా ఆశాభంగమే! ఈ అసహనంతో ఉడికిపోతున్న అతడికి యూఈఏ ఫ్యాన్ తమ దేశ జెర్సీని అందిస్తాడు. ప్రస్తుతం స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతున్న ఈ టీజర్‌లో ఇండియాను యూఏఈ ఓడిస్తుందన్న ఆశతో ఆ దేశపు జెర్సీతో రెడీగా ఉంటాడు పాక్ అభిమాని. యూఏఈ ఒక అనామక జట్టు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలను చిత్తు చేసిన ఇండియన్ టీమ్‌ను ఓడించి పాక్ అభిమానిచేత పటాసులు కాల్పించేంత సీన్ ఆ జట్టుకు ఉంటుందా? ఏదేమైనా   ఈ పటాసులు మోగనంత వరకే మనకు ఆనందం. కాబట్టి అవి శాశ్వతంగా పాక్ అభిమాని చేతిలోనే పదిలంగా ఉండాలని... ఈ ప్రపంచకప్ ముగిశాక కూడా అతడు వాటిని అటకెక్కించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశ!
 - జీవన్

మరిన్ని వార్తలు