తపనకు తోబుట్టువులు

17 Feb, 2020 10:30 IST|Sakshi

పంకజ – విజయ

పంకజ విజయ రాఘవన్‌ వయసు 70 ఏళ్లు. విజయ శ్రీనివాసన్‌ వయసు 67. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. తమిళ కుటుంబాలకు చెందినవారు. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఉద్యోగాల రీత్యా ముంబయ్, చెన్నై, పుణే అంటూ వెళ్లినా ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పంకజ సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో, విజయ మారేడుపల్లిలో ఉంటారు. పంకజ తెలుగు, తమిళం, ఇంగ్లిషు, హిందీ అనువాదాలు చేస్తూ, టీవీ కార్యక్రమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ బిజీగా ఉంటే.. చెల్లెలు విజయ ‘రెడీ టు ఈట్‌’ పొడుల తయారీ, అమ్మకాలు చేపట్టి.. మలి వయసులో నిస్పృహతో గడిపే ఎందరికో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. (‘ఫస్ట్‌ లేడీస్‌’లో బెస్ట్‌ లేడీ మార్తమ్మ)

వాయిస్‌ ఇంత పంచి
‘‘పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా ముంబయ్, చెన్నైలో ఉన్నాను. కొన్నాళ్లు ఐటీ ఇండస్ట్రీలో పని చేశాను. ఇద్దరు అబ్బాయిలు. వాళ్లు సెటిల్‌ అయ్యారు. రిటైర్‌ అయిన తొలి రోజుల్లో.. ఏం చేస్తే బాగుంటుందా అని నా వయసు వారితో కూర్చుని ప్లాన్‌ చేసేదాన్ని’’ అంటారు పంకజ. ‘‘అప్పటికే ఫారిన్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుని ఉండటం వల్ల నాకు తెలిసినవాళ్లు వీడియో డైలాగ్‌కు ట్రాన్‌స్క్రిప్షన్‌ వర్క్‌ చేసివ్వమని అడిగారు. ఆ సమయంలోనే ‘మీ గొంతు బాగుంది, వాయిస్‌ ఓవర్‌ ఇవ్వండి’ అని అడిగారు. ఇప్పుడు ఆ వర్క్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇంటి నుంచే బెంగుళూరు ఐఐఎంకి (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) వీడియో అనువాదాలు చేసి ఇస్తున్నారు. తమిళ్‌ టీవీ ఛానెల్‌లోని కుకరీ షోకి వాయిస్‌ ఓవర్‌ చెబుతున్నారు. ఇప్పటికి 500 ఎపిసోడ్స్‌ వరకు ఆమె తన వాయిస్‌ ఇచ్చారు. ‘‘సంపాదించాలనే ఆలోచన కాదు. ఏదైనా పనిలో ఉండాలి. ఆ పనే మనల్ని చురుగ్గా ఉంచుతుంది. అందుకే మా చెల్లెలు విజయతో కలిసి ఆమె చేస్తున్న పొడుల తయారీలోనూ భాగస్వామిని అయ్యాను’’ అని చెప్పారు పంకజ.

కిచెన్‌లలోకి ‘కంచి’
విజయ వారాంతాల్లో హైదరాబాద్‌లో జరిగే చిన్న చిన్న ఎగ్జిబిషన్లు, చేనేత సంత వంటి వాటిల్లో రుచికరమైన పొడులను వినియోగదారులకు పరిచయం చేస్తూ కనిపిస్తారు. కార్పోరేట్‌ ఆఫీసులోని అడ్మిన్‌ విభాగంలో ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు విజయ. భర్త బ్యాంకు ఉద్యోగి. ఓ కూతురు కొడుకు. పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. భర్త దూరమై, తను రిటైర్‌ అయ్యాక కూడా ఓ ఎమ్మెన్సీలో ఏడేళ్లపాటు పనిచేశారు. ఇప్పుడు ‘కంచి కిచెన్స్‌’ పేరుతో సాంబార్‌పొడి, దోస పొడి, మిర్చి పొడి, పులిహోర మిక్స్‌.. ఇలా సంప్రదాయ రుచులను మార్కెట్‌ చేస్తున్నారు ‘‘రిటైర్‌ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నా. చిన్న చిన్న కథలంటే చాలా ఇష్టం. అవి రాస్తూ ఉంటాను. వంట అంటే ఇంకా ఇష్టం. మా అమ్మ తన 87 ఏళ్ల వయసు వరకు మాతోనే ఉన్నారు. ఆవిడ నేర్పించిన వంటలు, బామ్మల వంటల రుచులను ఈ తరం వారికి పరిచయం చేయాలనుకున్నాం. ఇలా తయారుచేసిన ఉత్పత్తులను పెద్ద ఎగ్జిబిషన్స్‌లో, మాల్స్‌లో పెట్టాలనేది నా కల. ఈ ఫుడ్‌ ఐటమ్స్‌ని ఎనిమిది నెలలుగా చేస్తున్నాం. డబ్బుకు లోటు లేదు. కానీ, ఏదో చేయాలన్న తపన’’ అంటారు విజయ. తాము పనిచేస్తూనే ఆ పనిలో తమ కుటుంబసభ్యులనూ కలుపుకుంటూ మలి వయసునూ ఆహ్లాదకరంగా మార్చుకున్న ఈ అక్కాచెల్లెళ్లు చుట్టుపక్కల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా