భయంగా ఉంటోందా?

17 Sep, 2017 00:59 IST|Sakshi
భయంగా ఉంటోందా?

జీవితంలో కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి చాలా చిన్నవిగానే అనిపిస్తాయి. అనుభవించిన వాళ్లకు మాత్రమే వాటి బాధ అర్థమవుతుంది. తరచుగా అలాంటి చిన్నా చితకా సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాలను పాటించండి.ఆర్థిక ఇక్కట్లు, ఆరోగ్య బాధలు లేకపోయినా, ఒక్కోసారి ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది.  అప్పుడు అశ్వగంధ వేరును బూడిదరంగు దారంలో కట్టి మెడలో వేసుకోండి. అలాగే, అశ్వగంధాది లేహ్యాన్ని రెండుపూటలా సేవించండి.

కొందరికి సాధారణ సమయాల్లో మామూలుగానే ఉన్నా, ప్రయాణాలు చేసే సందర్భాల్లో తెలియని భయాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణానికి బయలుదేరే ముందు కాలభైరవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. కొందరు విద్యార్థులు బాగానే చదివినా పరీక్షలంటే తగని భయం ఏర్పడుతుంది. పరీక్షల పట్ల విపరీతమైన భయంతో ఇబ్బంది పడే విద్యార్థులకు తల్లి చేతుల మీదుగా మెడలో వెండి హారాన్ని ధరింపజేయాలి. అలాగే, పరీక్షలంటే భయపడే విద్యార్థులు హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

కొందరికి తరచుగా పీడకలలు వస్తుటాయి. కలల్లో తరచుగా క్రూరమృగాలు, పాములు, భూతప్రేత పిశాచాదులు కనిపించి ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. ఆ తర్వాత భయంతో ఒక పట్టాన నిద్రపట్టదు. పీడకలలు భయపెడుతున్నట్లయితే, సంజీవని పర్వతం మోస్తున్న ఆంజనేయుడి బొమ్మ గల వెండి లేదా రాగి లాకెట్‌ను ఎర్రతాడుతో మెడలో వేసుకోండి. ప్రతి మంగళవారం ఉదయం ఆంజనేయ ఆలయంలో దర్శనం చేసుకుని, ఆలయం వెలుపల ఉండే యాచకులకు అరటిపండ్లు పంచిపెట్టండి.
– పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు