ఇంట్లో పూజించే సాలగ్రామాలు...

22 Jul, 2018 01:10 IST|Sakshi

సాలగ్రామాలు ఎక్కువగా నలుపు రంగులో దొరుకుతాయి. అరుదుగా కొన్ని సాలగ్రామాలు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో కూడా దొరుకుతాయి. సాధారణంగా ఇళ్లలో నల్లని సాలగ్రామాలనే పూజిస్తుంటారు. ఎరుపు తప్ప మిగిలిన రంగుల్లో ఉన్న సాలగ్రామాలను ఇళ్లలో పూజించవచ్చు. ఎరుపు రంగులో ఉండే సాలగ్రామాలను ఆలయాలు, మఠాల్లో మాత్రమే పూజించాలి.

పరిమాణంలో చిన్నవిగా, మధ్యస్థంగా ఉండే వాటినే ఇళ్లలో పూజించాలి. అసాధారణ పరిమాణాల్లో ఉండే వాటిని ఆలయాల్లో మాత్రమే పూజించాలి. సాలగ్రామాలను పూజించేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో పాటు తప్పనిసరిగా తులసిదళాలను సమర్పించాలి. ఒక్క తులసిదళమైనా సరిపోతుంది.

సాలగ్రామాలను ప్రతిరోజూ అభిషేకించాలి. అభిషేకానికి మంచినీరు, ఆవుపాలు, పంచామృతాలలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఇళ్లలోని పూజమందిరాల్లో బేసి సంఖ్యలో సాలగ్రామాలను పూజించాలి. రెండు, నాలుగు... ఇలా నూట ఎనిమిది ఇంకా ఆపై ఎన్నైనా శక్తిమేరకు పూజమందిరంలో ఉంచి పూజించుకోవచ్చు.

సాలగ్రామాలను పూజించే వారు నియమబద్ధమైన జీవనం కొనసాగించాలి. లౌకిక వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసగించడం, కించపరచడం, దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడం, అనవసర దర్పాన్ని ప్రదర్శించడం వంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. నియమబద్ధంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తేనే సాలగ్రామాల పూజ ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది.

– పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు