సమాజం స్వర్గధామం కాదా?

17 Feb, 2019 00:29 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనం ప్రత్యుపకారం చేస్తాం. ఎవరైనా మనకు హాని తలపెడితే మనమూ వారిపట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటాం. ఇది లోకం పోకడ. కాని అలా చేయవద్దని, ఇతరులెవరైనా మీకు అపకారం తలపెట్టినా మీరు మాత్రం వారికి ఉపకారమే చేయాలని ముహమ్మద్‌ ప్రవక్త(స)బోధించారు.  ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారివద్దకు వచ్చి..‘దైవప్రవక్తా..! నేను నా బంధువుల పట్ల ఎంత క్షమాశీలిగా వ్యవహరించినా వారు నాపట్ల దౌర్జన్యంగానే ప్రవర్తిస్తున్నారు. నేనెంతగా కలుపుకుని పోవాలని ప్రయత్నించినా వారు తెగదెంపులకే ప్రయత్నిస్తున్నారు. నేను ఉపకారం చేస్తే, వారు నాకు అపకారం తలపెడుతున్నారు. మరి నేను కూడా వారితో అలానే వ్యవహరించనా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘వద్దు..వారిని వారి మానాన వదిలేయి, వారు దౌర్జన్యం చేసినా, నువ్వు మాత్రం వారికి ఉపకారం చేస్తూనే ఉండు. నువ్వు గనక ఇలా చేస్తే అల్లాహ్‌ తరఫున నీకు సహా యం లభిస్తూనే ఉం టుంది.’ అన్నారు. అంటే  చెడుకు చెడు సమాధానం కాదు. బంధువులైనా, కాకపోయినా.. అందరికీ ఇదేసూత్రం వర్తిస్తుంది. కాకపోతే బంధువులకు కాస్త అధిక ప్రాముఖ్యం ఉంటుంది.

మన ఉపకారానికి, మన సత్‌ ప్రవర్తనకు మొట్టమొదటి హక్కుదారులు తల్లిదండ్రులు. తరువాతనే భార్యాబిడ్డలు. తరువాత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు. ఆ తరువాత సమీప బంధువులు, ఆ తరువాత ఇతర బంధువర్గం. ఈ విధంగా క్రమం విస్తరిస్తుంది. ఎవరికి వారు ఇదేవిధంగా ఆలోచిస్తే, దీన్ని ఒక బాధ్యతగా గుర్తించి ఆచరించగలిగితే ఆ బంధుత్వాలు, ఆ కుటుంబాలు, ఆ సమాజంలో ఎంతటి సంతోషం వెల్లివిరుస్తుందో..! ఆర్థికంగా కలిగిన వారు, వారి బంధువుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, వారిని ఆదుకోవడం ఆ సమీప బంధువుల విధి. కాని చాలామంది ఈ బాధ్యత పట్ల ఏమరుపాటుగా ఉన్నారంటే తప్పు కాదు. ఎంతోమంది తిండి, బట్ట, నివాసం లాంటి కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా ఉన్నవారు సమాజంలో ఉన్నారు. వారివారి బంధువులు తలా ఒక చెయ్యేసి వారిని ఆదుకోగలిగితే, వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుని ఇతరులకు సహాయకారులుగా నిలిచే అవకాశం ఉంటుంది.

బంధువుల పట్ల బాధ్యత తీరిపోతే, అప్పుడు సమాజంలోని ఇతర అభాగ్యులను అక్కున చేర్చుకోవాలి. వారికీ సహాయ సహకారాలు అందించాలి.  వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎందుకంటే,‘మీ పొరుగు వారు ఆకలితో ఉండగా, మీరు కడుపునిండా తింటే మీలో రవ్వంత విశ్వాసంగాని, మానవత్వంగాని లేనట్టే’ అన్నారు ముహమ్మద్‌ ప్రవక్త(స). ఎవరి దుష్ప్రవర్తన కారణంగా వారి పొరుగువారు భద్రంగా, సురక్షితంగా ఉండరో అలాంటివారికి అల్లాహ్‌ పట్ల విశ్వాసమేలేద’ ని ఆయన బోధించారు. కనుక దైవాదేశాలూ, ప్రవక్త హితవచనాల వెలుగులో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సమీక్షించుకుంటూ, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు, మన సహాయానికి అర్హులైన ఇతర వర్గాల పట్ల తమబాధ్యతను చిత్తశుధ్ధితో నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
 – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 


ధర్మ జిజ్ఞాస
శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుందెందుకు?
తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచెం ఉండటం నిజమే. దీనికి కారణం ఏమంటే, తిరుమలేశుడు కుబేరుని వద్ద అప్పు చేశాడట. దానిని తీర్చడం కోసం ద్రవ్యాన్ని కుంచెంతో కొలిచి ఇచ్చేవాడట శ్రీనివాసుడు. స్వామివారి పక్షాన గోవింద రాజస్వామి ఈ కార్యాన్ని సాగించారట. ఈ క్రమంలో ఆయన స్వామివారికి వచ్చిన కానుకలను కొలిచీ కొలిచీ అలసి సొలసి తలకింద కుంచె పెట్టుకుని అలాగే నిద్రలోకి ఒరిగిపోయారనీ, అందుకే ఆయన తల వద్ద కుంచెం ఉంటుందనీ చెబుతారు. 

మరిన్ని వార్తలు