సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!

12 Sep, 2016 23:09 IST|Sakshi
సకాలంలో చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నియంత్రించవచ్చు!

న్యూరో కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే మా అమ్మగారికి బ్రెయిన్‌లో రక్తం క్లాట్ అవ్వడంతో స్ట్రోక్ వచ్చిందని డాక్టర్‌లు తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మాట్లాడలేకపోతున్నారు. ఆమెను క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్ల చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి ఎలాంటి చికిత్సను అందించాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
 - కళ్యాణి, చిత్తూరు

 
శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించేది మెదడు ఒక్కటే. శరీరానికి బ్రెయిన్ ఒక కంట్రోల్ రూమ్ లాంటిది అలాంటి మెదడులో క్లాట్ ఏర్పడటం అంటే అది శరీరంలోని అవయవాలపై నేరుగా ప్రభావం చూపడమే. ఈ సమస్య వల్ల కొన్ని అవయవాలపై మెదడు తన నియంత్రణను కోల్పోతుంది. అయితే మెదడులో క్లాట్ ఏర్పడటం అరుదైన విషయమేమీ కాదనే చెప్పాలి. వయసు, స్ట్రెస్, మానసిక ఆందోళన, జీవనశైలి, డయాబెటిస్, స్థూలకాయం, బీపీ, జన్యుపరమైన ఇతరత్రా కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పక్షవాతం బారిన పడటానికి ముందస్తుగా ప్రతి ఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు.

మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మూతి వంకరపోవడం, ముఖం, చేతులు బలహీనపడటం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెచ్చరికల్లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా స్ట్రోక్ వచ్చి ఆలస్యమైనప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రిలో నిపుణులైన న్యూరోసర్జన్ లేదా న్యూరాలజిస్ట్‌లను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి చికిత్స విషయంలో మీకు ఎలాంటి భయాలూ అవసరం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పురోగతితో మీ అమ్మగారి సమస్యను కరెక్టుగా గుర్తించి న్యూరో నావిగేషన్, మినిమల్లీ ఇన్వేజిక్, అవేక్ సర్జరీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన వైద్యాన్ని అందించి, ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు.

అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ హ్యామరేజి, మల్టిపుల్ క్లాట్స్, బ్రెయిన్ ఎన్యురిజమ్స్ లాంటి తీవ్రమైన మెదడుకు సంబంధించిన ప్రాణాపాయ వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశమూ ఉంది. మీకు ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. అలాగే మీ అమ్మగారికి పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు, మీ తోబుట్టువులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు గానీ, మీ తోబుట్టువులకు గాని డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవడం అవసరం.
- డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

పీసీఓడీని నయం చేయవచ్చా?
హోమియో కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 26 ఏళ్లు. తనకు నెలసరి క్రమంగా రాదు. బరువు కూడా పెరుగుతోంది. ఇంకో 2 నెలల్లో వివాహం చేయాలనుకుంటున్నాం. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి పీసీఓడీ అని చెప్పారు. దీని గురించి మాకు అవగాహన లేదు. అంతేకాదు... ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటి నుంచి బరువు మరింతగా పెరిగిపోతోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
- సంతోషమ్మ, విజయవాడ

 
అండాశయంలో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుడగల్లాంటి సంచులు వస్తాయి. అవి అండం విడుదలకు అడ్డుపడటం వల్ల వచ్చే సమస్యను పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. కొన్నిసార్లు అవి 1 నుంచి 12 వరకు ఉండవచ్చు.
 
లక్షణాలు
అండం విడుదల ఆగిపోవడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం లేదా 2 - 3 నెలలకు ఒకసారి రావడం  నెలసరి వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం  కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం వల్ల గర్భం దాల్చే పరిస్థితిక కూడా ఉండకపోవచ్చు  సాధారణంగా ఈ సమస్య ఉన్న కొందరిలో అవాంఛిత రోమాలు, ముఖంపై మొటిమలు, జుట్టు ఊడటం, బరువు పెరగడం వంటివి కనిపిస్తాయి  దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనవుతారు.
 లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో సాధారణ స్థాయిలో ఉంటే మరికొందరిలో తీవ్రస్థాయిలో ఉండవచ్చు. కొందరిలో అసలు ఏ విధమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు.
 
ఈ వ్యాధి వల్ల కలిగే ఇతర సమస్యలు
పీసీఓడీ వ్యాధి ఉన్నా హార్మోన్లపై అది ప్రభావం చూపనప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఈ వ్యాధి హార్మోన్లపై ప్రభావం చూపినప్పుడు హార్మోన్ల అసమతుల్యత కలిగి సమస్యలు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా  డయాబెటిస్  నెలసరి ఇబ్బందులు  సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడం  అవాంఛిత రోమాలు.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బరువు తగ్గాలి. కానీ అదే సమయంలో కడుపు మాడ్చుకోకూడదు. కేవలం మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాల్సి ఉంటుంది. అలా జరగకపోతే చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండకపోగా సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది   అవాంఛిత రోమాలను నివారించేందుకు వాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు వాడకపోవడం మంచిది  నెలసరి రావడం కోసం అధికంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వాడకపోవడం మంచిది  ఒకవేళ గర్భం దాల్చినట్లయితే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. లేదంటే గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ.
 
చికిత్స
హోమియోపతిలో కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, హార్మోన్ల సమతౌల్యత సాధారణ స్థాయికి వచ్చి వ్యాధి తగ్గుతుంది.
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు