పక్షవాతాన్ని తగ్గించే పాలకూర!

22 Jun, 2015 23:00 IST|Sakshi
పక్షవాతాన్ని తగ్గించే పాలకూర!

పక్షవాతం వచ్చే రిస్క్‌ను నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తల అధ్యయనం నిరూపించింది. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మరీ ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది.

వీళ్లంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నవారే. వీరికి మందుతో పాటూ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్ని అందించారు. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గుర్తించారు. పైగా దీనితో పాటు గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు