ఊరికి పరంపర

12 Jan, 2019 02:41 IST|Sakshi

చెట్టు ఎంత ఎదిగినా వేళ్లను వదిలిపెట్టదు. తాను ఎదుగుతున్న కొద్దీ వేళ్లను కూడా అంతగా విస్తరించుకుంటుంది. మహావృక్షంగా మారిన తర్వాత ఊడలను దించుకుంటుంది. మరి.. మనుషులం? మన మూలాలను పుటుక్కున తెంచేసుకుంటున్నాం. ‘ఎంత ఎత్తుకి ఎదిగినా పాదాలు ఉండాల్సింది నేల మీదనే’ అనే చిన్న సూత్రాన్ని మర్చిపోతున్నాం. ‘‘అది గుర్తు చేయడానికే ‘పరంపర’ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించాం.. అంటున్నారు డాక్టర్‌ శ్రీనాగి, శశికళ. దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘‘తమిళనాడు, కర్ణాటక వాళ్లు సంస్కృతికి దూరం కారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఏడాదిలో ఒకసారి వారి సొంత ప్రదేశాలకు చేరిపోతారు. అందరూ కలిసి సంగీతం, నాట్యాలతో వాళ్ల సంప్రదాయ రీతులను ప్రదర్శించుకుంటారు. ఇక్కడ ప్రదర్శకులు వేరు, ప్రేక్షకులు వేరు కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ్యత తీసుకుంటారు. ఒకరు ప్రదర్శిస్తుంటే మిగిలిన వాళ్లు ప్రేక్షకులైపోతారు. సాంస్కృతిక వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోతారు.  ఐదేళ్ల కిందట ఒక స్నేహితురాలి ఆహ్వానంతో బెంగళూరుకెళ్లినప్పుడు వాళ్ల సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించుకుంటున్న తీరు తెలిసింది. తెలుగువాళ్లకు అలవాటు చేద్దామనిపించింది’’ అన్నారు డాక్టర్‌ శ్రీనాగి.

మనకూ వేదికలు.. వేడుకలు
‘‘మనదైన శాస్త్రీయ సంగీత కచేరీలు, సంప్రదాయ నాట్యరీతులు ఉన్నాయి. వాటిని ప్రదర్శించడానికి హైదరాబాద్‌లో రవీంద్రభారతి, శిల్పకళావేదిక వంటి వేదికలూ ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ ఇలాంటి వేదికలూ ఉండనే ఉన్నాయి. అయితే కళాభిరుచి ఉన్న వాళ్లను మాత్రమే ఆకర్షిస్తాయవి. సంస్కృతి గురించి ఏమీ తెలియని వారికి కూడా మన సంస్కృతి మూలాల దగ్గరకు తీసుకురావాలంటే మాకు కనిపించిన మార్గం ఒక్కటే. ఆ కార్యక్రమాలను వారి ముంగిటకు తీసుకెళ్లడమే. అందుకే నాలుగేళ్ల నుంచి కళాసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాం’’ అని పరంపర కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ గురించి చెప్పారు శశికళ. డాక్టర్‌ శ్రీనాగి, శశికళ ఇద్దరూ తమవంతు బాధ్యతగా సామాజిక కార్యక్రమాలను నిర్వహింస్తుంటారు. ‘రోష్ని’ స్వచ్ఛంద సంస్థ స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు శశికళ. రోష్ని సంస్థ ఆత్మహత్యకు పాల్పడే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తుంది. జీవితం మీద ఆసక్తి కోల్పోకుండా చేస్తుంది. జీవితంలో కష్టాలుంటాయి, కానీ అవి జీవితానికి డెడ్‌ఎండ్‌లు కాదు, టర్నింగ్‌లు మాత్రమేననే మంచి మాటలతో నిరాశానిస్పృహలను తొలగించి జీవితేచ్ఛ కలిగిస్తుంటుంది రోష్ని సంస్థ. వీరిద్దరి స్నేహం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల పరిరక్షణ బాధ్యతను తలకెత్తుకుంది. ‘పరంపర... నర్చరింగ్‌ కల్చర్‌’ అనే ట్యాగ్‌లైన్‌లోనే తామేం చెప్పదలుచుకున్నామో ఉందంటారు శ్రీనాగి, శశికళ. 

గుడిలోనే ఎందుకు?
సాంస్కృతిక కార్యక్రమాలను గుడి ఆవరణలో నిర్వహించడం వెనుక బలమైన కారణాన్ని చెబుతున్నారీ మహిళలు. ‘‘ప్రతి ఊళ్లోనూ ఆలయం ఉంటుంది. గుడి ధార్మిక ప్రదేశమే. అయితే మతపరమైన పరిధితో గిరిగీసుకునే ప్రదేశం కాదు. ఆ గ్రామస్తు లందరికీ సమావేశ వేదిక. ఊరికి, ఊళ్లో వాళ్లకు సంబంధించిన ఏ అంశాన్నయినా గుడి ఆవరణలోనే చర్చించుకునేవాళ్లు. ఆ సంస్కృతిని గుర్తు చేయడానికే గుడి ఆవరణను ఎంచుకున్నాం. ఎక్కడెక్కడ ప్రాచీన ఆలయాలున్నాయో శోధించాం. శంషాబాద్‌ దగ్గర అమ్మపల్లె రామచంద్రస్వామి ఆలయం ఏడు వందల ఏళ్ల నాటిది. మనం గుజరాత్‌కెళ్లి చూసొచ్చే స్టెప్‌వెల్‌ కూడా ఉందీ ఆలయం సమీపాన. చాలామందికి అక్కడ అంత గొప్ప ప్రాచీన ఆలయం ఉందనే సంగతి కూడా తెలియదు. నాలుగేళ్లు మేము ఆ ఆలయంలో కూడా ఒక వేడుకను నిర్వహించడంతో ఇప్పుడు అక్కడికి భక్తులు ముఖ్యంగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. భువనగిరిలోని అక్కన్న మాదన్నల ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం ఈతరం చాలా మందికి తెలియడమే లేదు. మా గుడి సంబరాల నిర్వహణకు ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలనే ఎన్నుకుంటున్నాం. కళాకారుల ఎంపికలో మేము ఇప్పటికే పేరు గడించిన వారి కోసం ప్రయత్నించడం లేదు. టాలెంట్‌ ఉండి పెద్దగా గుర్తింపునకు నోచుకోని వారి కోసం గాలించినంత పని చేస్తున్నాం.  

ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్న పని. ప్రదర్శనకు టికెట్‌ ఉండదు. వీలయినంత ఎక్కువ మందికి మన మూలాలను తెలియచేయడమే మా ఉద్దేశం. ఎవరైనా స్థానికంగా మాకు సహకరిస్తే వారి సహాయం తీసుకుంటున్నాం. మై హోమ్, బీవీఆర్, ఏఎమ్‌ఆర్‌ వంటి సంస్థలు కొంత వరకు ఆర్థిక తోడ్పాడునిస్తున్నాయి. గద్వాల్‌ కోటలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్‌’ నృత్యనాటకాలను ప్రదర్శించాం. మహబూబాబాద్‌లో ‘నర్తనశాల’ ప్రదర్శించాం. ఆ ప్రదర్శన గురించి తెలిసిన వరంగల్‌ ఎమ్మెల్యే తర్వాతి ప్రదర్శన భద్రకాళి ఆలయంలో పెట్టమని అడిగారు. అలా ఎక్కడికక్కడ స్థానికంగా ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే మాకు కొంత బరువు తగ్గుతుంది. అలా లేనిచోట పూర్తి బాధ్యత మాదే. ఈ వేడుకలు ఈ రోజు (జనవరి 11న) మొదలయ్యాయి. ఏటా జనవరి నుంచి మార్చి వరకు సాగే ఈ కార్యక్రమాల్లో మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లందరికీ ఇదే మా ఆహ్వానం’’ అన్నారు డాక్టర్‌ శ్రీనాగి, శశికళ.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

కార్యక్రమాల ‘పరంపర’: 
జనవరి 11 : కనకదుర్గ ఆలయం, విజయవాడ (ముగిశాయి)
జనవరి 13 : భావ నారాయణ ఆలయం, బాపట్ల; జనవరి 16 : వేయి స్తంభాల గుడి, వరంగల్‌
జనవరి 19 : శ్రీ రామచంద్రస్వామి ఆలయం , అమ్మపల్లె, శంషాబాద్, హైదరాబాద్‌
జనవరి 27 : వేణుగోపాల స్వామి ఆలయం, అక్కన్నమాదన్న ఆలయం, భువనగిరి
ఫిబ్రవరి 2 : వీరభద్రస్వామి ఆలయం, అప్పా సర్వీస్‌ రోడ్, నార్సింగి, హైదరాబాద్‌
ఫిబ్రవరి 22 : అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, మామిడిపల్లి, నిజామాబాద్‌
మార్చి 4 : ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు