తల్లి ఆశలు కొడుకుపై ఆంక్షలు

24 Oct, 2019 02:59 IST|Sakshi

బయటి వ్యక్తుల ఫిర్యాదుల పై తీర్పులు సులభం. కుటుంబ సభ్యుల మధ్య స్పర్థ రేగితే ఏమిటి చేయడం? తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉండేదే. కాని తల్లి తన కొడుకునే ప్రధాన శత్రువు అని అనుకుంటోంది. ఇద్దర్నీ కూచోబెట్టి మాట్లాడాల్సిన తండ్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడు. సైకియాట్రిస్ట్‌ ఈ తగాదాను తీర్చాల్సి వచ్చింది.

చాలా పెద్ద పెద్ద అరుపులు వినవస్తున్నాయి. టేబుల్‌ మీద ఉండాల్సిన గ్లాస్‌ నేల మీద ఠాప్పున తగిలి వంద గిరికీలు తిరిగింది. తలుపు ధబ్బున మూసుకుపోయింది. తలుపు మూసుకున్న కొడుకు లోపలి నుంచి పెద్దపెద్దగా తిడుతున్నాడు తల్లిని. పరుషమైన మాటలు ఉన్నాయి అందులో. తల్లి తగ్గలేదు. తలుపు దగ్గర చేరి బిగ్గరగా వాదన చేస్తోంది. ‘నీకేం తక్కువ చేశామని ఇలా చేస్తున్నావురా గాడిద. మంచి కాలేజ్‌లో చేర్పించాము. అడిగింది ఇచ్చాము. కోరింది చేస్తున్నాము. చదివి బాగు పడరా అంటే మమ్మల్ని ఏడ్పించుకుని తింటున్నావేమిరా మూర్ఖుడా. నువ్విలా చేస్తే భయపడి ఊరుకుంటానని అనుకుంటున్నావేమో. నా సంగతి నీకు తెలియదు. నిన్ను ఎలా దారికి తేవాలో నాకు తెలుసు’ బుసలు కొడుతోంది.

తండ్రి డ్రాయింగ్‌ ఏరియాలో నిలబడి ఆ తల్లీ కొడుకుల సంవాదాన్ని విసుగ్గా, నిస్సహాయంగా, ఉద్వేగంగా చూస్తున్నాడు. దేదీప్య్‌ బి.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. కాని చదవడం లేదు. సరిగ్గా చదవడం లేదని తల్లి ఫిర్యాదు. క్లాసులకు వెళ్లడం లేదు. వెళ్లినా ఏం చెబుతున్నారో పట్టించుకోవడం లేదు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నాడు. అతనికి గది ఉంది. అందులో ల్యాప్‌ టాప్‌ చూస్తూ ఉంటాడు. ఇరవై నాలుగ్గంటలూ చెవులకు హెడ్‌ఫోన్స్‌ ఉంటాయి. ఏదైనా మాట్లాడాలన్నా పిలిచినా రెండు మూడు సార్లు అరిస్తే తప్ప హెడ్‌ఫోన్స్‌ తీసి వినడు. లేదంటే ఫోన్‌ చూస్తుంటాడు. ఎక్కువగా గదిలోనే డోర్‌ లాక్‌ చేసుకుని ఉంటాడు. తల్లి సురేఖకు ఇది ఆందోళనగా ఉంది. ఆమెకు కొడుకు భవిష్యత్తు మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

రాబోయే నాలుగైదేళ్లలో ఆమె అతణ్ణి అమెరికాలో చూడదలుచుకుంది. తమ కాలనీలో ఉన్న చాలామంది తల్లులు ఇదే ఆలోచన చేస్తున్నారు. అయితే దేదీప్య్‌ అలాంటి గోల్‌తో ఉన్నట్టు కనిపించడం లేదు. అసలు ఏ గోల్‌ లేనట్టుగా ఉంటున్నాడు. అదొక్కటే కాదు... దేదీప్య్‌ తమ్ముడు వికాస్‌ నైన్త్‌ క్లాస్‌ చదువుతున్నాడు. వాడి మీద అన్న ప్రభావం ఎలా ఉంటుందనే ఆమె ఇంకా ఆందోళనగా ఉంది. కొరుకుడు పడని ఈ కొడుకు తన జీవితానికి అతి పెద్ద శత్రువు అని ఆమె అనుకోవడం మొదలుపెట్టింది. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురూ సైకియాట్రిస్ట్‌ ఎదురుగా ఉన్నారు. తల్లి కొడుకు ముందే కొడుకు గురించి సైకియాట్రిస్ట్‌కు చెప్పింది– ‘ఏ జన్మలో ఏం పాపం చేశానో డాక్టర్‌... వీడు ఇలా తయారయ్యాడు. ఏ మాటా వినడం లేదు.

ఏం చెప్పినా తప్పంటున్నాడు. ఎంతో తెలివైన పిల్లాడు. బాగా చదివేవాడు. క్లాస్‌ టాపర్‌గా వచ్చేవాడు. ఇప్పుడిలా తయారయ్యాడు. వీణ్ణేం చేయమంటారో చెప్పండి’ అంది. తండ్రి ఏం మాట్లాడలేదు. ఈ వ్యవహారంలో వేలు పెడితే కొడుకు నుంచి భార్య నుంచి ఎటువంటి చర్య ఎదుర్కొనాల్సి వస్తోందో అన్నట్టుగా ఉన్నాడు. ‘ఏం.. దేదీప్య్‌ ఏంటి నీ సమస్య’ అని అడిగాడు డాక్టర్‌. తల్లిదండ్రులను బయటకు పంపించి దేదీప్య్‌ మాట్లాడాడు. దేదీప్య్‌ ముందు నుంచి కూడా ఇంటెలిజెంట్‌ స్టూడెంట్‌. చదువంటే ఆసక్తి బాగా ఉంది. తల్లిదండ్రులంటే ఇష్టం. ప్రేమ. తండ్రికి వ్యాపారం ఉంది. కుటుంబం కోసం కష్టపడటం తన విధి అనుకుంటాడు. పిల్లలను సరిగ్గా చదివించి పెద్దవాళ్లను చేయడం తన బాధ్యత అని తల్లి అనుకుంది. అయితే దేదీప్య్‌కు ముందునుంచి నలుగురితో కలిసే అలవాటు లేదు.

పెద్దగా ఫ్రెండ్స్‌ లేరు. ఒక్కడే చిన్నప్పుడు కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూసేవాడు. పుస్తకాలు చదివేవాడు. ఇంట్లోనే ఉండేవాడు. చాలాసార్లు క్లాస్‌ పుస్తకాలు ముందేసుకునేవాడు.తల్లి ఇది మంచి విషయంగా అనుకుంది. దేదీప్య్‌ ఆడుకోవడం లేదనీ, ఫ్రెండ్స్‌తో కలవడం లేదని, అందరూ పిల్లలు ఎదుర్కొనే అనుభవాలు ఎదుర్కొనడం లేదనీ ఆమె అనుకోలేదు. టైమ్‌ వేస్ట్‌ కాకుండా చదువుకుంటున్నాడు అనుకుంది. ఇంకా ఇంకా చదివేలా అతణ్ణి కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఆ కట్టడికి తగినట్టుగా మార్కులు, ర్యాంకులు టెన్త్‌లో ఇంటర్‌లో ఎంసెట్‌లో వచ్చేసరికి తన మార్గం సరైనది అనుకుంది. దేదీప్య్‌ కూడా తానేం చేస్తున్నాడో తనెలా ఉంటున్నాడో చెక్‌ చేసుకోకుండానే ముందుకు వెళ్లాడు. అయితే బి.టెక్‌ ఫైనల్‌ ఇయర్‌ వచ్చేసరికి అతనికి సడన్‌గా మెలకువ వచ్చినట్టయ్యింది.

చుట్టూ లోకం ఒకలా ఉంది. తను ఒకలా ఉన్నాడు. తన తోటి స్టూడెంట్స్‌ చాలా యాక్టివిటీల్లో ఉన్నారు. గ్రూపులుగా క్రియేటివ్‌ పనులు చేస్తున్నారు. వాళ్లకు చాలా అప్‌డేట్స్‌ ఉన్నాయి. యూ ట్యూబ్‌లు, నెట్‌ఫ్లిక్స్‌లు, అమెజాన్‌లు.. వాటిలో వస్తున్న కంటెంట్‌ గురించి మాట్లాడుతున్నారు. ట్రిప్స్‌ తిరుగుతున్నారు. చదువు కూడా చేస్తున్నారు. తన సహజ స్వభావం రీత్యా, బిడియం రీత్యా వారెవ్వరితోనూ కలవకపోయే సరికి వారు తనను దాటుకొని చాలా దూరం వెళ్లిపోయారని అనిపించి సడన్‌గా దేదీప్య్‌కు డిప్రెషన్‌ వచ్చింది. దానికి కారణం తల్లి అని అతడికి అనిపించడం మొదలుపెట్టింది. తనతో స్థిమితంగా ఒక గంట కూచుని మాట్లాడని తండ్రి మీద మరింత కోపం వచ్చింది. అంతా కలిసి తన కొంపముంచారని అనుకోవడం మొదలుపెట్టాడు.

తల్లి ఏం చెప్తే దానికి వ్యతిరేకం చేసి బాధించాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగినట్టుగా ఇంట్లో ప్రవర్తించసాగాడు. తండ్రి ఇదంతా ఏమీ అర్థం చేసుకోలేదు. అతను ఇల్లు చేరగానే కొడుకు మీద తల్లి ఫిర్యాదు చేసేది. అతడు మోటుగా కొడుకు చేతిలోని ఫోన్‌నో ల్యాప్‌టాప్‌నో లాగేసి దాచేసేవాడు. అదే విరుగుడు అనుకునేవాడు. దాంతో కొడుకు ఇంకా మొండిగా తయారయ్యాడు. అన్నింటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే తానిలా తయారయ్యానని తానే బాధ పడుతున్నాడు. ఈ బాధలో సాయం చేయాల్సిన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, తన మనసును అందుకోలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నాడు. ముగ్గురిలోనా తీవ్రమైన దూరం ఉంది. ఒకరికొకరు అర్థం కావడం లేదు. చేసుకోవడం లేదు. ఇప్పటి సమస్యకంతా ఇదే కారణం. అంతా విన్న సైకియాట్రిస్ట్‌ తిరిగి ముగ్గురినీ కూచోబెట్టి మాట్లాడాడు.

విడి విడి వ్యక్తులుగా ఉన్న ఆ ముగ్గురూ ముందు ఒక కుటుంబం కావలసిన అవసరం గురించి మాట్లాడాడు. కొడుకును అర్థం చేసుకోవాల్సిన పద్ధతిని, కొడుకు విషయంలో జరిగిపోయిన నిర్లక్ష్యాన్ని వివరించాడు. అలాగే కొడుకును తల్లిదండ్రులకు ఉండే ఆందోళనను అర్థం చేసుకోమని చెప్పాడు. ‘మీ నాన్న కష్టపడేది, మీ అమ్మ తాపత్రయ పడేది నీ కోసమే కదా’ అని చెప్పాడు. ‘వాళ్లు నా గురించి నాతోపాటుగా ఆలోచిస్తే మంచిది డాక్టర్‌. వాళ్లకై వాళ్లు ఆలోచిస్తే కాదు’ అని దేదీప్య్‌ అన్నాడు.‘ఇది మీ ఒక్క ఇంట్లోనే కాదు.

చాలా ఇళ్లల్లో జరుగుతోంది. ఒక్కోచోట తండ్రి, ఒక్కోచోట తల్లి తమ పిల్లల నుంచి ఇలాంటి శతృత్వం తెచ్చుకుంటున్నారు. వర్తమానంలో అవసరమైన స్పేస్‌ను తీసుకోకుండా భవిష్యత్తు కోసం అంతా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. రేపటి గురించి ఆలోచన మంచిదే. కాని దాని కోసం ఇవాళ్టి సాధారణ జీవితాన్ని లాస్‌ కావాల్సిన అవసరం లేదు’ అని చెప్పాడు.పైకి నేరుగా కనిపించని ఈ జటిలమైన సమస్య కేవలం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల సగం పరిష్కారం అయ్యింది. మిగిలిన సగం పరిష్కారం కోసం ఆ విడివిడి సభ్యులు ఒక కుటుంబంగా ప్రయత్నిస్తున్నారు. విజయం కూడా సాధిస్తారు.


– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌ బై సీనియర్‌ సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు