దివి నుంచి భువికి దిగిన దేవతావృక్షం

3 Jun, 2018 00:54 IST|Sakshi

పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాతపుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు.

పారిజాత పుష్పాలతో పూజ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ పూలనుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరేచనకారిగా వాడతారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న నిఫా వైరస్‌ను ఈ చెట్టు ఆకులతో నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగానే కదా నంది తిమ్మన రంచిన పారిజాతాపహరణం కథ నడిచింది.శ్రీ కృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్‌ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు.

ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి.

పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వక్షం వికసిస్తుంది. అదీ జూన్‌ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. దీని వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా భావిస్తున్నారు. ఈ వృక్ష కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగకపోవడం ఈ వృక్షం ప్రత్యేకత.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా