నీ వెనుక రావడానికి ఆయనెప్పుడూ సిద్ధమే!

2 Jun, 2019 06:36 IST|Sakshi

సంగీత సాహిత్యం

‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా! అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్‌ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు. ఈ తొండమాన్‌ చక్రవర్తి ఎవరు ?పూర్వకాలంలో సుధర్మడునే రాజు ఉండేవాడు. ఆయన కపిలతీర్థం దగ్గరికి వచ్చారు. అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలో పాతాళ లోకాన్ని పరిపాలించే ధనంజయుడనే నాగలోకపు ప్రభువు కుమార్తె అక్కడ జలకాలాడుతూ కనపడింది.

ఆమె అంగీకారంతో ఆయన ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వారు కొంతకాలం అక్కడ ఉన్న దొండపొదలలో విహరించారు. ఆమె గర్భందాల్చి పుట్టింటికి వెడుతుంటే..‘‘నీకు కుమారుడు కలిగి పెద్దయిన తరువాత వాడిని నా దగ్గరికి పంపేటప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా దొండ తీగలను నడుముకు చుట్టుకుని ఈ రాజముద్రికను వేలికి పెట్టుకుని రమ్మనమను. అలా వస్తే నేను సులభంగా గుర్తుపడతాను’’ అని ఉంగరం ఇచ్చి ఆమెకు అభయం ఇస్తాడు. ఆమె తరువాత అలాగే సుధర్ముడి వద్దకు పంపింది. నడుముకి దొండతీగలు చుట్టుకుని వచ్చాడు  కనుక ఆయనకు తొండమాన్‌ అని పేరొచ్చింది. (తొండమాన్‌ తవ్వించిన చెరువు ఇప్పటికీ ఉంది. ఈయన వేంకటేశ్వరుడి మామగారయిన ఆకాశరాజుకు సోదరుడు. ఇద్దరికీ సమానమైన రాజ్యభాగం ఇచ్చారు).

తొండమాన్‌ జీవితంలో ఒక పొరబాటు చేసాడు. ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి‘మా తండ్రిగారి అస్థికలు గంగలో నిమజ్జనం చేయడానికి కాలినడకన కాశీకి వెడుతున్నాను. నాభార్య గర్భిణి, కొడుకు ఐదేళ్ళవాడు, ఎక్కువ దూరం నడవలేడు. నేను తిరిగొచ్చేదాకా వారి ఆలనాపాలనా మీరు చూడాలి’ అని కోరగా సమ్మతించిన తొండమాన్‌ వారిని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒక భవంతిలో ఉంచి తదనంతరకాలంలో మర్చిపోయాడు. కొంతకాలానికి అక్కడ వారికి ఆహార పదార్థాలు అయిపోయాయి. మరికొంతకాలానికి కూర్ముడు తిరిగొచ్చి తన భార్యబిడ్డలని అప్పగించమని కోరతాడు. అప్పడు వారి విషయం గుర్తొచ్చి మొదట భయపడినా ‘‘వారు స్వామి దర్శనానికి వేంకటాచలం వెళ్ళారు. వచ్చేస్తారు. అప్పటిదాకా సత్రంలో ఉండండి భోజన సంభారాలు ఏర్పాటు చేయిస్తాను’ అని చెప్పి పంపుతాడు. తొండమాన్‌ వెంటనే తన కుమారుడిని పంపి వాళ్ళకోసం వాకబు చేయించాడు.

వెళ్ళినవాడు తిరిగొచ్చి ‘‘ఆహారం లేక వారు మరణించారు. అక్కడ అస్థిపంజరాలు పడి ఉన్నాయి’’ అన్నాడు. భయపడిపోయిన తొండమాన్‌ ఆనంద నిలయానికి పరుగున వెళ్ళి స్వామి పాదాలను ఆశ్రయించాడు. తన భక్తుడివై, రాజువై ఉండి మాట ఇచ్చి తప్పి ఇంతటి ఘాతుకానికి కారణమయ్యావు. అయినా రక్షిస్తా. అస్థి తీర్థంలో(ఇప్పటికీ ఉంది) నేను మెడలోతు నీళ్ళలో మునిగి ఉంటా. వెంటనే వెళ్ళి అస్తికలు తెచ్చి ఒడ్డున పెట్టి ఆ తీర్థం నీళ్ళతో ప్రోక్షణ చెయ్యి.’’ అని ఆదేశించాడు. ఆ తరువాత వాళ్ళు బతికారు.అప్పటివరకు భక్తులతో మాట్లాడుతుండే స్వామివారు ‘ఈనాటినుంచి నేనిక మాట్లాడను. నేనేదయినా చెప్పవలసి వస్తే అర్చకులమీద ఆవహించికానీ, మరో రూపంలో కానీ నా మనోగతాన్ని తెలియచేస్తాను’ అని ప్రకటించారని చెబుతారు.

మరిన్ని వార్తలు