పాస్తా రుచుల రాస్తా

10 Oct, 2014 23:07 IST|Sakshi

‘‘జంతువులు ఆకలేస్తే తింటాయి. మనుషులు అనుబంధాల కోసం తింటారు’’
 ‘ఢిల్లీ 6’ సినిమాలో డైలాగ్.
 పాస్తా... చూడ్డానికి పచ్చి ఆకుల సేమియాలానో...
 ఉడికీ ఉడకని నూడిల్స్‌లానో...
 దవడలకు పనిపట్టే దుంపముక్కల్లానో ఉంటుంది!
 కానీ ప్రపంచం పాస్తాను పడీపడీ తింటుంది.
 అనుబంధాల కోసం పంచుకుంటూ తింటుంది!  
 ‘‘లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాజిక్ అండ్ పాస్తా’’ అట!
 ఇటలీ సినీ దర్శకుడు ఫెలినీ అనేవారు.
 పాస్తా వాళ్ల దేశానిది కాబట్టి ఆయన అలా అన్నారని అనుకునేరు!
 ఏ దేశం వారైనా... అదే ఎక్స్‌ప్రెషన్!
 అంతగా ఏముందబ్బా అందులో మ్యాజిక్?
 ఇవాళ మీకు తెలుస్తుంది.
 పాస్తా మిమ్మల్ని రుచుల రాస్తా ఎక్కిస్తుంది.

 
ష్రింప్ విత్ పాస్తా
 
కావలసినవి:
పాస్తా - కప్పు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రేకలు- 3, ఉల్లితరుగు - పావు కప్పు, ష్రింప్ (రొయ్యలు) - అర కప్పు, మిరియాల పొడి - పావు టీ స్పూను, టొమాటో తరుగు - అర కప్పు, బేసిల్ ఆకులు - 10 (సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి), రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు, తాజా క్రీమ్ - కప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత.
 
తయారీ:
ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి  
 
పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి)  
 
పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూత ఉంచి, రెండు నిమిషాలు ఉడికించాలి  
 
 బాగా కలిపి మరో రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి  
 
 అదే బాణలిలో ఉడికించిన పాస్తా వేసి అడుగు అంటకుండా కలుపుతుండాలి  
 
 టొమాటో తరుగు, సగం బేసిల్ ఆకులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, తగినంత ఉప్పు, పర్మేసన్ చీజ్ వేసి పదార్థాలన్నీ కొద్దిగా దగ్గరపడే వరకు ఉడికించాలి  
 
 క్రీమ్ జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి
 
 ఉడికించి ఉంచుకున్న రొయ్యలు, పక్కన ఉంచుకున్న కప్పుడు నీళ్లు, ఉప్పు జత చేయాలి  
 
 మిగిలిన బేసిల్ ఆకులు వేసి కలిపి వేడివేడిగా అందించాలి.
 
 స్పగెటీ మీట్ బాల్స్
 
 కావలసినవి:
 మటన్ - పావు కేజీ, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 3, ఉల్లితరుగు - అర కప్పు, టొమాటో తరుగు - కప్పు, స్పగెటీ పాస్తా - పావు కేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను.

 తయారీ:
 మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి మరిగే నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి  
 
 బాణలిలో మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి  
 
 ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి  
 
 టొమాటో ముక్కలు మెత్తబడ్డాక ఉడికించి ఉంచుకున్న స్పగెటీ పాస్తా, మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి  
 
 పర్మేసన్ చీజ్ వేసి బాగా కలపాలి  
 
 మిరియాల పొడి చల్లి మరోమారు కలిపి వేడివేడిగా అందించాలి.
 
పర్మేసన్ చీజ్
ఇది ఇటాలియన్ చీజ్. దీనిని ఆవు పాల నుంచి తయారుచేస్తారు. ఈ చీజ్‌ను సాధారణంగా స్పగెటీ పాస్తాలో వాడతారు. ఇది గట్టిగా ఉంటుంది. తురుముకుని వాడతారు.
 
స్పగెటీ పాస్తా
స్పగెటీ పాస్తాను ఒక రకమైన గోధుమపిండికి నీళ్లు జత చేసి తయారుచేస్తారు. ఇటాలియన్‌కు చెందిన ఈ పాస్తా పల్చగా సిలిండర్ ఆకారంలో ఉంటుంది. ఇది 50 సె.మీ. పొడవులో ఉండేది. ప్రస్తుతం 25 సెం.మీ.లలో దొరుకుతోంది. స్పగెటీ అనే పదం ఇటాలియన్ స్పగెటో నుంచి వచ్చింది. దీని అర్థం పల్చటి తీగ అని.
 
 ఫెట్యూసినీ మిక్స్ సాస్
 
 కావలసినవి:
 ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు, వెల్లుల్లి రేకలు - 3, టొమాటో తరుగు - అర కప్పు, ఫెట్యూసినీ పాస్తా - కప్పు, తాజా క్రీమ్ - అరకప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - పావు టీ స్పూను
 
 తయారీ:  
 బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేయించాలి  
 
 ఉల్లితరుగు, వెల్లుల్లి రేకలు, టొమాటో తరుగు జత చేసి మరో మారు కలపాలి  
 
 ఉడికించి ఉంచుకున్న ఫెట్యూసినీ పాస్తా, ఉప్పు, క్రీమ్, పర్మేసన్ చీజ్ వరుసగా వేసి బాగా కలపాలి  
 
 మిరియాల పొడి చల్లి ఒకసారి కలిపి దించేయాలి
 
 వేడివేడిగా అందించాలి.
 
 లసాన్యా
 
 కావలసినవి:
 లసాన్యా షీట్లు - 3, జుచినీ - 1, క్యాప్సికమ్ తరుగు - కప్పు, వంకాయ - 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి), క్యారట్ తరుగు - పావు కప్పు, బేబీ కార్న్ తరుగు - అర కప్పు,టొమాటో సాస్ - కప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, వెల్లుల్లి రేకలు - 3, ఉల్లితరుగు - పావు కప్పు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మోజెరిల్లా  చీజ్ - అర కప్పు, క్రీమ్ - కొద్దిగా.
 
 తయారీ:  
 లసాన్యా షీట్లను ఉడికించి తీసి చన్నీళ్లలో వేయాలి  
 
 బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి వేయించాలి  
 
 వెల్లుల్లి రేకలు, మిరియాలపొడి, పోపు జతచేయాలి  
 
 లసాన్యా షీట్ల మీద ఉడికించి ఉంచుకున్న కూరముక్కలను వరుసగా పేర్చి, పైన టొమాటో సాస్ వేయాలి  
 
 ఆపైన మోజెరిల్లా చీజ్, క్రీమ్ వేయాలి  
 
ఇదే విధంగా అన్ని షీట్ల మీద చేసి ఒకదాని మీద ఒకటి అమర్చి, 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో సుమారు పావుగంట ఉంచి తీసేయాలి.  
 
 వేడివేడిగా వడ్డించాలి.
 
 జనోచ్చీ
 
 కావలసినవి:
 మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంపలు - 2 (ఉడికించి తొక్కు తీసి మెత్తగా చేయాలి), ఉప్పు - తగినంత, కోడిగుడ్డు - 1 (ఉడికించాలి), పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు, వెల్లుల్లి రేకలు - 3, బేసిల్ ఆకులు - 10, ఎండిన టొమాటో ముక్కలు - కొద్దిగా, ఆలివ్‌కాయలు - 5, పాస్తా - రెండు కప్పులు (ఉడికించి నీరు తీసేయాలి), ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను
 
 తయారీ:  
 ఒక పాత్రలో మైదాపిండి, ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్డు , పర్మేసన్ చీజ్ వేసి బాగా కలిపి, కావలసిన ఆకారంలో ఉండలు తయారుచేసుకోవాలి  
 
 ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న బాల్స్ వేసి ఉడికించాలి  
 
బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి  
 
ఉల్లితరుగు, వెల్లుల్లి రేకలు, బేసిల్ ఆకులు, ఎండిన టొమాటో ముక్కలు, ఆలివ్ కాయలు, ఉడికించిన పాస్తా ఒకదాని తరవాత ఒకటి వేస్తూ బాగా కలపాలి  
 
 చివరగా మిరియాల పొడి చల్లి కలిపి వేడివేడిగా అందించాలి.
 
 చెఫ్: వరుణ్
 ఆవాస,  మాదాపూర్, హైదరాబాద్
 
 సేకరణ: డా. వైజయంతి
 ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల

 

మరిన్ని వార్తలు